– ష్నైడర్ ఎలక్ట్రిక్ సిఇఓ దీపక్ శర్మతో మంత్రి లోకేష్ భేటీ
దావోస్: ష్నైడర్ ఎలక్ట్రిక్ ఎండి, సిఇఓ దీపక్ శర్మతో రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ భేటీ అయ్యారు. మంత్రి లోకేష్ మాట్లాడుతూ… ఆసియా పసిఫిక్ దేశాలకు ఆంధ్రప్రదేశ్ గేట్ వేగా ఉంది. సువిశాల తీర ప్రాంతం, 3 ఇండస్ట్రియల్ కారిడార్లు, 20 ఇండస్ట్రియల్ క్లస్టర్లు ఎపిలో నెలకొని ఉన్నాయి. స్థానిక యువతలో నూతన ఆవిష్కరణలు ప్రోత్సహించి, నైపుణ్యం కలిగిన యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడానికి ఎపిలో ఆర్ అండ్ డి కేంద్రాన్ని ఏర్పాటుచేయండి.
2026నాటికి భారత్ లో రూ.3,200 కోట్లు పెట్టుబడి పెట్టాలన్న మీ ప్రణాళికలో ఆంధ్రప్రదేశ్ ను చేర్చండి. పునరుత్పాదక ఇంధన వనరులు, పారిశ్రామిక క్లస్టర్లను ఏర్పాటుచేసేందుకు వీలు భూసేకరణను సులభతరం చేసేందుకు ఎపి ప్రభుత్వం మద్దతు నిస్తుంది. రాష్ట్ర పారిశ్రామిక రంగాన్ని ప్రోత్సహించేందుకు స్థానిక మ్యానుఫ్యాక్చరర్స్ నుంచి కాంపొనెంట్స్ సోర్సింగ్ చేయడం, స్థానిక సప్లయ్ చైన్ పర్యావరణ వ్యవస్థ అభివృద్ధికి సహకారం అందించండి.
విజయవాడ, విశాఖపట్నం వంటి కీలక నగరాల్లో స్మార్ట్ సిటీ ప్రాజెక్టుల అమలులో భాగంగా ఎలక్ట్రిక్ నైపుణ్యాలను అందించండి. సమర్థవంతమైన పట్టణ ప్రణాళికలు, స్మార్ట్ గ్రిడ్ లు, ఐఓటి ఆధారిత సొల్యూషన్స్ లో ఎపి ప్రభుత్వంతో భాగస్వామ్యం వహించండి. పునరుత్పాదక శక్తి, పారిశ్రామిక ఆటోమేషన్‌లో నైపుణ్య శిక్షణా కార్యక్రమాలను అభివృద్ధి చేయడం, భవిష్యత్- వర్క్‌ఫోర్స్‌ను రూపొందించడానికి సాంకేతిక సంస్థలు, స్థానిక విశ్వవిద్యాలయాలతో కలసి పనిచేయాలని కోరారు.
ష్నైడర్ ఎలక్ట్రిక్ దీపక్ శర్మ మాట్లాడుతూ… తమ సంస్థ భారత్ లోని 9 రాష్ట్రాల్లో కార్యకలాపాల విస్తరణకు 3,200 కోట్లు పెట్టుబడి పణాళికలను ఇప్పటికే ప్రకటించింది. దేశంలోని 9 రాష్ట్రాల్లో 1.2 మిలియన్ చదరపు అడుగుల స్థలాన్ని జోడించడం కూడా మా ప్రణాళికలో భాగంగా ఉంది. ఆంధ్రప్రదేశ్ ప్రతిపాదనలపై కంపెనీ సహచరులతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని దీపక్ శర్మ తెలిపారు.