– గ్రామ సభల్లో పాల్గొన్న పలువురు మంత్రులు, ప్రజాప్రతినిధులు
– .రాష్ట్ర వ్యాప్తంగా నేటి వరకు 60 శాతం గ్రామ,వార్డు సభలు విజయవంతగా పూర్తి
హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న గ్రామ సభలు విజయవంతంగా కొనసాగుతున్నట్లు అధికారులు తెలిపారు. నేటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 60 శాతం గ్రామ/ వార్డు సభలు, 9844 గ్రామాలలో విజయవంతంగా నిర్వహించారు. ఈ గ్రామ సభలలో ఆ నాలుగు పథకాలకు సంబంధించి ఇప్పటి వరకు 10 లక్షల 9 వేల 131 దరఖాస్తులు అందినట్లు అధికారులు తెలిపారు.
గణతంత్ర దినోత్సవం సందర్భంగా జనవరి 26వ తేదీ న రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇళ్ళు, రేషన్ కార్డుల పథకాలను లాంఛనంగా ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు గాను గ్రామాలలో, పట్టణ ప్రాంతాలోని వార్డులలో సభలను ఏర్పాటు చేసి దరఖాస్తులను స్వీకరిస్తోంది. ఈ సభలలో ప్రజలు ఉత్సాహంగా పాల్గొని తమ దరఖాస్తులను అధికారులకు అందచేస్తున్నారు.
జనవరి 21 నుండి 24 వరకు కొనసాగే ఈ గ్రామ సభలలో భాగంగా రెండోవ రోజు బుధవారం 3608 గ్రామ సభలు, 1055 వార్డు సభలు మొత్తం కలపి 4663 గ్రామ/వార్డు సభలు విజయవంతంగా జరిగాయి.
రాష్ట్రంలోని రూరల్ ఏరియాలలో 12,914 గ్రామ సభలు, పట్టణ ప్రాంతాల్లో 3484 వార్డ్ సభలు, మొత్తం 16,398 గ్రామ, వార్డు సభలు నిర్వహించాల్సి ఉన్నది.
నేడు రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో రాష్ట్ర మంత్రులు గ్రామ సభల్లో పాల్గొన్నారు. రాష్ట్ర రెవిన్యూ, గృహనిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డ్డి ఖమ్మం జిల్లాలోని పాలేరు నియోజక వర్గంలోని పలు గ్రామాల్లో నిర్వహించిన గ్రామ సభలలో పాల్గొన్నారు.
జగిత్యాల, రాజన్న సిరిసిల్ల జిల్లాలలో రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, బీసీ సంక్షేమం, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజ నర్సింహా మహబూబ్ నగర్ జిల్లాలో నిర్వహించిన గ్రామ సభలలో పాల్గొన్నారు. వీరితోపాటు, పలువురు ప్రజాప్రతినిధులు, జిల్లా కలెక్టర్లు ఈ గ్రామ సభలకు హాజరయ్యారు.