– జనసేన మనకు మిత్రపక్షమా? కాదా?
– ఎన్డీఏలో ఉన్నట్టా? లేనట్టా?
– ఉంటే టీడీపీతో సమన్వయకమిటీలు ఏమిటి?
– మనతోనూ సమన్వయ కమిటీ వేయమనండి
– బయట ప్రశ్నలకు జవాబు చెప్పలేకపోతున్నాం
– బీఎల్ సంతోష్జీపై కమలదళాలు ప్రశ్నల వర్షం
– మనతో ఉండేవాళ్లతోనే వెళతామన్న సంతోష్జీ
– బీజేపీ ఎవరు చుట్టూ తిరగదని స్పష్టీకరణ
– ఎవరైనా మన చుట్టూ తిరగాల్సిందేనన్న సంతోష్జీ
– చాలా పార్టీలు వచ్చి వెళ్లాయని వ్యాఖ్య
– మీ పని మీరు చేయండని దిశానిర్దేశం
– మనకు 1 ఎంపీ, 4 సీట్లు ప్రధానం కాదన్న సంతోష్జీ
– సీఎం సీటే ప్రధానమని స్పష్టీకరణ
– పురందీశ్వరికి పార్టీ అండగా ఉంటుందని ప్రకటన
– జనసేనతో పొత్తుపై సంతోష్జీ నర్మగర్భ వ్యాఖ్యల మర్మమేమిటి?
( మార్తి సుబ్రహ్మణ్యం)
బీజేపీ-జనసేన పొత్తుపై స్పష్టత ఇవ్వాలన్న కమలనాధుల ప్రశ్నలకు.. ఆ పార్టీ అగ్రనేత విస్తుపోయే సమాధానం ఇచ్చిన వైనం, ఇప్పుడు బీజేపీలో చర్చనీయాంశంగా మారింది. ఏ పార్టీ చుట్టూ బీజేపీ తిరగదని, ఏ పార్టీ అయినా బీజేపీ చుట్టూ తిరగాల్సిందేనని, పొత్తు కోసం పార్టీలు వస్తుంటాయి పోతుంటాయని బీజేపీ జాతీయ సంఘటనా మహామంత్రి బీఎల్ సంతోష్జీ ఇచ్చిన సమాధానం, బీజేపీ-జనసేన పొత్తు కొనసాగింపుపై అనుమానపు మేఘాలు కమ్మేందుకు కారణమయ్యాయి. ఆయన వ్యాఖ్యలు పరోక్షంగా జనసేననుద్దేశించి చేసినవేనా? అన్న అనుమానాలకు తెరలేపింది. పొత్తులో పార్టీలు వస్తుంటాయి పోతుంటాయన్న నర్మగర్భ వ్యాఖ్య ఇప్పుడు బీజేపీలో హాట్టాపిక్లా మారింది.
ఒంగోలులో జరిగిన బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశానికి బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్జీ, జాతీయ సహ ప్రధాన కార్యదర్శి శివప్రకాష్జీ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. సాధారణ చర్చలు-ప్రసంగాలు పూర్తయిన తర్వాత.. పార్టీకి చెందిన పలువురు జిల్లా నేతలు జనసేనతో పొత్తు కొనసాగింపుపై తమకున్న సందేహాలు, క్షేత్రస్ధాయిలో తమకు ఎదురవుతున్న ప్రశ్నలను సంతోషజీ ముందు ఉంచారు. బీజేపీతో జనసేన పొత్తు ఉందా? లేదా? అని క్షేత్రస్థాయిలో తమను ప్రశ్నిస్తుంటే, తామేమీ చెప్పలేకపోతున్నామని నిర్వేదం వ్యక్తం చేశారు.
జనసేన ఎన్డీఏలో భాగస్వామి అయితే, టీడీపీతో కలసి సమన్వయ కమిటీ ఎలా ఏర్పాటుచేస్తుందన్న ప్రశ్నలకు, తమ వద్ద జవాబులు లేవని బీఎల్ సంతోష్జీ దృష్టికి తీసుకువెళ్లారు. అలాగైతే బీజేపీ కూడా జనసేనతో విడిగా సమన్వయకమిటీ ఏర్పాటుచేయాలని సూచించారు. ఓవైపు టీడీపీతో సమన్వయ కమిటీ ఏర్పాటుచేసుకున్న జనసేన, మళ్లీ బీజేపీతో ఎలా కలసి నడుస్తుందో తమకు అర్ధం కావడం లేదన్నారు. దీనిపై స్పష్టత ఇవ్వాలని కోరారు.
అన్నీ విన్న సంతోష్జీ.. సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. బీజేపీ ఎవరి చుట్టూ తిరగదని, ఏ పార్టీ అయినా బీజేపీ చుట్టూ తిరగాల్సిందేనని స్పష్టం చేశారు. గతంలో బీజేపీతో పొత్తు పెట్టుకున్న అనేక పార్టీలు వెళ్లిపోయాయి. పార్టీలు వస్తుంటాయి పోతుంటాయి. కానీ బీజేపీ మాత్రం ఎవరి కోసం తన సిద్ధాంతాలు మార్చుకోద’’ని కుండ బద్దలు కొట్టారు.
మనం ఏ పార్టీ చుట్టూ తిరిగి నాలుగు ఎంపీ, నాలుగు ఎమ్మెల్యే సీట్లు అడగటం కోసం రాజకీయాల్లో లేమని స్పష్టం చేశారు. ‘మనం ఒక ఎంపీ, నాలుగు ఎమ్మెల్యే సీట్ల కోసం పొత్తు పెట్టుకోం. దానికోసం టీడీపీ చుట్టూనో, వైసీపీ చుట్టూనో తిరగం. ఆంధ్రాలో మన లక్ష్యం సీఎం సీటు. దానికోసం మీరు కష్టపడి పనిచేయండి. మిగిలింది మేం చూసుకుంటాం’ అని చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి.
ఈ సందర్భంగా పార్టీ అధ్యక్షురాలు పురందేశ్వరిపై, సంతోష్జీ ప్రశంసల జల్లు కురిపించారు. చత్తీస్గఢ్లో కార్యకర్తలు ఇప్పటికీ, ప్రభారీ బాగా పనిచేసిందని గుర్తు చేస్తుంటారని పురందీశ్వరిని మెచ్చుకున్నారు. ఆమెకు పార్టీ దన్నుగా ఉంటుందని హామీ ఇచ్చారు.