Suryaa.co.in

Editorial

శహభాష్ శ్వేత.. చెప్పినట్లే డాక్టరయింది!

– మురిసిపోయిన చంద్రబాబు
( మార్తి సుబ్రహ్మణ్యం- హైదరాబాద్)
ఆ అమ్మాయికి అప్పుడు ఏడేళ్ల వయసు. జూబ్లీహిల్స్ ఓబుల్‌రెడ్డి పబ్లిక్‌స్కూల్‌లో సెకండ్ క్లాస్ చదువుతోంది. అది చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రి అయినప్పటి రోజులు. ఆ స్కూల్‌లో జరిగిన ఓ ఫంక్షన్‌కు చంద్రబాబు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఫంక్షన్ తర్వాత చిన్నారులతో ముచ్చటిస్తున్నారు. అందులో దామచర్ల శ్వేత అనే చిన్నారిని బాబు పలకరించారు. పెద్దయ్యాక ఏమవుతావ్ అని ఆసక్తిగా అడిగారు. అందుకు ఆ చిన్నారి ఏమాత్రం తడుముకోకుండా ‘నేను డాక్టరవునవుతా సార్’ అని చెప్పింది. సీన్ కట్ చేస్తే.. ఆ చిన్నారి శ్వేత అనుకున్నట్లుగానే డాక్టరయింది. కిమ్స్‌లో ఎంబీబీఎస్‌లో చదివి, ఇప్పుడు ‘డాక్టర్ శ్వేత జనరల్ ఫిజిషియన్’గా మారింది. అయితే తాను చెప్పినట్లుగానే డాక్టరయ్యానని చంద్రబాబుకు చెప్పడానికి చాలాసార్లు ప్రయత్నించినా, ఆయనను కలిసేందుకు కుదరలేదట.
తాజాగా ఆయన బేగంపేట ఎయిర్‌పోర్టుకు వస్తున్నారని తెలుసుకున్న శ్వేత.. తెలంగాణ టీడీపీ రాష్ట్ర తెలుగు మహిళా ప్రధాన కార్యదర్శి సూర్యదేవర లత,జూబ్లీహిల్స్ టీడీపీ ఇన్‌చార్జ్ జి.వి.జి.నాయుడును కలసి..చంద్రబాబును కలవాలన్న తన కోరిక వెల్లడించింది. వెంటనే లత ఆమెను తీసుకుని చంద్రబాబు వద్దకు వెళ్లారు. ఆ సందర్భంలో ఏడేళ్ల వయసులో ఓబుల్‌రెడ్డి స్కూల్‌లో, చంద్రబాబుతో దిగిన ఫొటోను చంద్రబాబుకు చూపించిన శ్వేత… మీకు మాట ఇచ్చినట్లు తాను డాక్టరయ్యానని చెప్పడంతో, చంద్రబాబు తెగ మురిసిపోయారు. శ్వేత పట్టుదలను మెచ్చుకున్నారు. ఆమె కుటుంబ వివరాలు అడిగారు. ఎక్కడ ప్రాక్టీసు చేస్తున్నావని అడిగారు. ఆ పాత ఫొటోపై సంతకం చేయడంతో డాక్టర్ శ్వేత ఉబ్బితబ్బిబ్బయింది. బాబును కలవాలన్న తన కోరిక నెరవేర్చినందుకు ఆమె, పార్టీ నేత లతకు కృతజ్ఞత తెలిపారు. ఈ ఫొటో ఇప్పుడు సోషల్‌మీడియాలో వైరల్ అవుతోంది. పైన వైఎస్-జగన్ ఫ్లెక్సీ-కింద బాబును కలిసిన డాక్టర్ ఫొటోలు పెట్టి ‘రాజన్న రాజ్యంలో ఆ అమ్మాయి ఎందుకు ఏడ్చిందో.. తర్వాత జగనన్న వచ్చాక ఎందుకు నవ్విందో తెలియదు గానీ.. బడిలో చంద్రబాబు చేతులమీదుగా బహుమతి అందుకున్న సమయంలో అనుకున్న సంకల్పం నెరవేరింది. ఈ డాక్టరమ్మకు మాత్రం చంద్రబాబు స్ఫూర్తి’ అన్న కామెంట్స్‌తో ఉన్న ఈ రెండు ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

LEAVE A RESPONSE