ముఖ్యమంత్రి ఈ నెలలోనే లక్షా 25వేల సామాజిక పింఛన్లు తొలగించాడు.

• రాజశేఖర్ రెడ్డి వర్థంతిని సామాజికభద్రతా విద్రోహదినంగా జరుపుకోవాల్సిన దుస్థితిని జగన్ కల్పించాడు.
• వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులు జగన్మోహన్ రెడ్డి నిర్వాకంతో బోరుమంటున్నారు.
• అనుభవలేమి, అవగాహానారాహిత్యంతో అలవిగానీ హామీలిచ్చిన జగన్, ముఖ్యమంత్రై మూడేళ్లవుతున్నా రూ.3వేల పింఛన్ ఇవ్వలేకపోయాడు.
• రాజశేఖర్ రెడ్డి జయంతి సందర్భంగా రూ.2,250 పింఛన్ ని, రూ.2,500లు చేస్తానన్నాడు. వర్థంతి వచ్చినా అది నెరవేరలేదు.
• ఒకనెల పింఛన్ మరోనెలలో ఇవ్వమని చెప్పడం దుర్మార్గం.
• అత్తాకోడళ్లు, తల్లీకూతుళ్లు ఒకేరేషన్ కార్డులోఉంటే, వారిద్దరికీ పింఛన్లు తీసేశారు. ఈకేవైసీ పేరుతో మరిన్ని పింఛన్లకు ముఖ్యమంత్రి ఎసరుపెట్టారు.
• దివ్యాంగులు, కిడ్నీరోగులకు ఇవ్వాల్సిన పింఛన్లలోనూ కోతపెట్టారు.
• ఆవుచేలో మేస్తే, దూడగట్టున మేస్తుందా అన్నట్లుగా వాలంటీర్లు పింఛన్లచెల్లింపుల్లో లబ్ధిదారులపై జులుం ప్రదర్శిస్తున్నారు.
* టీడీపీ శాసనసభ్యులు డోలా బాలవీరాంజనేయస్వామి
1వ తేదీనాడు వృద్ధులు, వితంతువులు, వికలాంగులకు జగన్ ప్రభుత్వం తీవ్రమైన నిరాశమిగిల్చిందని, ఈ నెలకు సంబంధించి లక్షా25 వేల పింఛన్లను తొలగించిందని, వృద్ధులు, వికలాంగులకు అండ గా ఉంటామని గతంలో, పాదయాత్రలో ప్రగల్భాలు పలికిన జగన్మోహన్ రెడ్డి నేడు వారినోట్లో మట్టికొట్టడం ఎంతవరకు న్యాయమని టీడీపీ శాసన సభ్యులు డోలా బాలవీరాంజనేయ స్వామి ప్రశ్నించారు. బుధవారం ఆయన తననివాసం నుంచి జూమ్ ద్వారా విలేకరులతో మాట్లాడారు.
ఆ వివరాలు ఆయన మాటల్లోనే…
ఈ ముఖ్యమంత్రి ఈనెలలో లక్షా 25వేల సామాజిక పింఛన్లు తొలగించాడు. ప్రకాశంజిల్లాలో మొత్తం 9,600పింఛన్లు ప్రభుత్వం తొలగిస్తే, వాటిలో కొండెపి నియోజకవర్గంలోనే 8,600 వరకు పింఛన్లు తీసేశారు. గడచిన మూడునెలలనుంచీ చూస్తే రాష్ట్రవ్యాప్తంగా 2లక్షల 28వేలపింఛన్లను ప్రభుత్వం తొలగించింది. ఈ విధంగా ప్రభుత్వం కావాలనే ఇటువంటి దుష్టచర్యలకు పాల్పడుతోంది.
రాజశేఖర్ రెడ్డి వర్థంతిని సామాజికభద్రతా విద్రోహదినంగా జరుపు కోవాల్సిన దుస్థితిని జగన్ కల్పించాడు. ఈనెలలో చాలా మంది వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులు జగన్మోహన్ రెడ్డి నిర్వాకంతో బోరుమంటున్నారు. అనుభవలేమి, అవగాహానారాహిత్యంతో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అలవిగానీ హామీలిచ్చిన జగన్, ముఖ్యమంత్రై మూడేళ్లవుతున్నా రూ.3వేలపింఛన్ ఇవ్వలేకపోయాడు. గతంలో చంద్రబాబునాయుడు ఇచ్చినమాటకు కట్టుబడి, రూ.200గా ఉన్న పింఛన్ ను రూ.2వేలకు పెంచారు. అర్హులైన ప్రతిఒక్కరకీ ఠంఛన్ గా ఒకటోతేదీనే పింఛన్లు అందించిన ఘనత టీడీపీప్రభుత్వానిది. కానీ జగన్మోహన్ రెడ్డి ఎంతో ఆర్భాటంగా పింఛన్ల పెంపుపై తొలిసంతకం చేసి, చెల్లింపులకు వచ్చేసరికి అర్హులకు అరచేతిలోవైకుంఠం చూపిస్తున్నాడు. ఇస్తామన్న రూ.3వేలు ఇవ్వకుండా ఉన్నవాటిని తొలగించడం ముఖ్యమంత్రి చేతగానితనం కాదా?
గతంలో రాజశేఖర్ రెడ్డి జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, ప్రతిఏటా పింఛన్ రూ.250 చొప్పున పెంచుతామని చెప్పాడు. అలాచెప్పాక రూ.2,250 లు చేశారు.. తరువాతదాన్ని, రూ.2,500లు చేస్తానన్నాడు. తండ్రి జయంతిపోయి, రేపువర్థంతి వచ్చినా, కొడుకు ప్రభుత్వంలో అది నెరవేరలేదు. అదీ ఈ ముఖ్యమంత్రి పనితనం. పింఛన్లు పెంచకపోగా లబ్ధిదారులకు కోతపెడుతున్నారు. ఒకనెల పింఛన్ మరోనెలలో ఇవ్వ మని చెప్పడం దుర్మార్గం. రకరకాల కారణాలవల్ల కొందరు వృద్ధులు, దివ్యాంగులు పింఛన్ తీసుకోలేకపోవచ్చు. మరోనెలలో పింఛన్ తీసుకునే అవకాశం వారికిలేకుండా చేయడం ముమ్మాటికీ దుర్మార్గమే.
అత్తాకోడళ్లు, తల్లీకూతుళ్లు ఒకేరేషన్ కార్డులోఉండి, వారిలో ఒకరు విధివక్రీకరించి విధవగా ఉండి, మరొకరు వృద్ధులైతే వారిద్దరికీ పింఛన్లు తీసేశారు. ఈకేవైసీ పేరుతో మరిన్ని పింఛన్లకు ముఖ్యమంత్రి ఎసరు పెట్టారు. దివ్యాంగులు, కిడ్నీరోగులకు ఇవ్వాల్సిన పింఛన్లలోనూ కోతపెట్టారు. ఆవుచేలో మేస్తుంటే, దూడగట్టున మేస్తుందా అన్నట్లుగా వాలంటీర్లు పింఛన్లచెల్లింపులో చేతివాటం ప్రదర్శిస్తూ, లబ్ధిదారులపై జులుం ప్రదర్శిస్తున్నారు. గ్రామాల్లోకివెళ్లి పింఛన్లు తీసుకునేవారెవరో, వారిపరిస్థితేమిటో ప్రభుత్వం ఎందుకు తెలుసుకోలేకపోతోంది? కొన్ని గ్రామాల్లో వయస్సు, అర్హతలతో పనిలేకుండా వైసీపీకార్యకర్తలు, సానుభూతిపరులన్న ఒకేఒక్క కారణంతో పింఛన్లు ఇస్తున్నారు. దానిపై వాలంటీర్లు, ప్రభుత్వం ఏం సమాధానం చెబుతుంది?
రేషన్ కార్డుల్లో మార్పులుచేర్పులు అనేవి వాలంటీర్లు చేయాల్సినపని. వారే ఆ పనిచేస్తారని ప్రభుత్వమే చెప్పింది. రేషన్ కార్డుల్లో పెళ్లై వేరేప్రాంతాలకు వెళ్లినవారు, మరణించినవారి పేర్లను ప్రభుత్వం తీసేయకుండా, దాన్ని సాకుగాచూపి, అర్హులైన వారిపింఛన్లు తొలగించడమేంటని తాము ప్రశ్నిస్తున్నాం. ముఖ్యమంత్రి ఇప్పటికైనా సామాజిక పింఛన్ల పంపిణీలో మానవత్వంతో వ్యవహరించి, తొలగించిన పింఛన్లన్నింటినీ పున రుద్ధరించాలని డిమాండ్ చేస్తున్నాం.

Leave a Reply