-రానున్న ఎన్నికల్లో వైకాపా కు 30 స్థానాలు కూడా మృగ్యమే
-ఎంపీలను కూలీల మాదిరిగా పరిగణించే పద్ధతి కాదు
-ఐదు నుంచి ఏడు శాతానికి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంకు పెంచుకునే ఛాన్స్
-జనవరి రెండవ వారంలో రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా షర్మిళ ను నియమించే అవకాశం
-జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంతో ఆట ఆడుకుంటున్న ప్రజలు
-జీతం పెంచమని సమ్మె చేస్తామంటున్న వాలంటీర్లు
-వాలంటీర్ వ్యవస్థ అవసరమా? అన్న చర్చ రెండవసారి సర్వత్రా కొనసాగుతోంది
-అహంకారాన్ని ఎవరు సహించరు… అదే అహంకారం జగన్మోహన్ రెడ్డి కొంప ముంచింది
-చెట్లను నరికి వేయడం ద్వారా సమాజానికి ఏమని సందేశం ఇస్తున్నారు?
-ఈ మూడు నెలలైనా చెట్లను నరకకుండా అధికారులు చర్యలు తీసుకోవాలి
-నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు
రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సోదరి షర్మిళ రాజకీయ రంగ ప్రవేశం వైకాపాకు గుదిబండగా మారనుందా?, షర్మిళ రాష్ట్ర రాజకీయాలలో అడుగుపెట్టకపోయినా సర్వేల అంచనాల మేరకు వైకాపా ఔట్, షర్మిల రాజకీయ రంగ ప్రవేశంతో ఔట్ కు నో డౌట్ అనే పరిస్థితులు నెలకొంటాయని నరసాపురం ఎంపీ, వైకాపా నాయకులు రఘురామ కృష్ణంరాజు తెలిపారు . మంగళవారం నాడు రచ్చబండ కార్యక్రమంలో భాగంగా ఆయన తన నివాసంలో మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ… రానున్న ఎన్నికల్లో వైకాపాకు 30 స్థానాలు దక్కడం కూడా మృగ్యమేనని అన్నారు. రానున్న ఎన్నికల్లో రాష్ట్ర రాజకీయాలలో వైయస్ షర్మిళ క్రియాశీలకంగా వ్యవహరించనున్నారు.
ఆమెకు జనవరి రెండవ వారంలో రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్ష పదవి కట్టబెట్టే అవకాశాలున్నాయి. అయినా, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశాలుఎంత మాత్రం లేవు. కాకపోతే, కాంగ్రెస్ పార్టీ తన ఓటు బ్యాంకును పెంచుకుని అవకాశాలు మెండుగా ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలోకి వస్తే… రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పడంతో పాటు, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను అడ్డుకుంటామని చెప్పే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అధికార వైకాపా మేజర్ ఓటు బ్యాంకు అయిన ఒక వర్గాన్ని షర్మిళ, ఆమె భర్త అనిల్ తీవ్రంగా ప్రభావితం చేసే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
ఈ వర్గాలను కాసింత కదిలించిన కాంగ్రెస్ పార్టీ తన ఓటు బ్యాంకును ఐదు నుంచి ఏడు శాతానికి పెంచుకునే అవకాశాలున్నాయి. గతంలో కాంగ్రెస్ పార్టీ నుంచి గంపగుత్తగా వైకాపా వైపు మళ్ళిన ఓటు బ్యాంకు, ఇప్పుడు తిరిగి కాంగ్రెస్ వైపు మళ్ళితే… ఆ ఓట్ల శాతాన్ని వైకాపా కోల్పోవడం ద్వారా, రానున్న ఎన్నికల్లో తీవ్రంగా నష్టపోతుందన్న రఘురామ కృష్ణంరాజు, వైకాపా గెలుస్తుందని భావిస్తోన్న 30 స్థానాలలో కూడా, గెలిచే అవకాశాలు లేకుండా పోతాయన్నారు. గతంలో కాంగ్రెస్ పార్టీ కి చెందిన 40 శాతం ఓటు బ్యాంకు, ఒక్క ఛాన్స్ ఇవ్వమని జగన్మోహన్ రెడ్డి చేసిన అభ్యర్థనకు 10 శాతం మంది తటస్థ ఓటర్లు వైకాపా వైపు ఆకర్షితులయ్యారు.
అయితే, ఇప్పుడు 10 శాతం మంది తటస్థ ఓటర్లు టిడిపి, జనసేన కూటమి వైపు షిఫ్ట్ అయ్యారు. వైకాపా వైపు మళ్ళిన 40% కాంగ్రెస్ ఓటు బ్యాంకులో, ఐదు నుంచి ఏడు శాతం ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ తన వైపు తిప్పుకోగలిగితే… వైకాపా సాధిస్తుందని భావిస్తున్న 30 స్థానాలు కూడా మృగ్యమే అవుతాయన్నారు . రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ సారథ్య బాధ్యతలను స్వీకరించే షర్మిళ, ఆ పార్టీ ఎన్నికల వ్యూహకర్త సునీల్ కనుగోలు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ప్రచారాన్ని నిర్వహించనుండడంతో , కచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంకు పెరిగే అవకాశాలు ఉన్నాయి.
జగనన్న వదిలిన బాణం, వదిలేసిన బాణంగా తిరిగి జగనన్న వైపే దూసుకు వస్తుందా అన్న చర్చ సర్వత్రా కొనసాగుతోంది. జగన్మోహన్ రెడ్డి జన్మదినోత్సవం సందర్భంగా షర్మిళ, తన అన్నకు కనీసం శుభాకాంక్షలు తెలియజేయలేదు. కానీ క్రిస్మస్ పర్వ దినోత్సవం సందర్భంగా తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కు కానుక పంపడం, దానికి లోకేష్ ప్రతిస్పందిస్తూ క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. రాజకీయ పార్టీలు వేరైనా, ఇద్దరు నాయకుల మధ్య స్నేహపూర్వక వాతావరణం ఆహ్వానించదగ్గదే. వారిద్దరూ రాజకీయ ప్రత్యర్ధులు మాత్రమే… శత్రువులేమీ కాదు. జగన్మోహన్ రెడ్డి మాత్రం తన సొంత పార్టీ నాయకులను కూడా తన రాజకీయ శత్రువులు గానే పరిగణిస్తుంటారు. ఇది మంచి సాంప్రదాయం కాదని రఘురామకృష్ణం రాజు అన్నారు.
ఎవరికి కాకా పట్టాల్సిన అవసరం నాకు లేదు… నాకంటూ వ్యక్తిత్వం ఉంది
రాజకీయాలలో ఎవరికి కాకా పట్టాల్సిన అవసరం నాకు లేదని, నాకంటూ ఒక వ్యక్తిత్వం ఉన్నదని రఘురామకృష్ణం రాజు స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అహంకారపూరిత వైఖరిని ఎన్నికల అనంతరం గెల్చిన ఆరు నెలల వ్యవధిలోనే తాను వ్యతిరేకించడం జరిగిందని పేర్కొన్నారు. కొంతమంది గతిలేక, మతిలేక కొంతకాలం ఆయన అహంకారపూరిత వైఖరిని భరించారు. అహంకారాన్ని ఎవరు కూడా సహించరు. అదే అహంకారం జగన్మోహన్ రెడ్డి కొంపముంచిందనడం లో ఎటువంటి సందేహం లేదు.
జగన్మోహన్ రెడ్డి అహంకారాన్ని భరించలేక ఎమ్మెల్యేలు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, శ్రీదేవి, మంగళగిరి ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి వంటి వారు పార్టీ వీడారు. పైకి చెప్పుకో లేని వారు ఇంకా ఎంతోమంది పార్టీలో ఉన్నారు. ఎవరైనా మినిమం రెస్పెక్ట్ కోరుకుంటారు. జగన్మోహన్ రెడ్డిని అతిగా ప్రేమించిన వారైనా కూడా మినిమం రెస్పెక్ట్ ఇవ్వనప్పుడు తమ దారి తాము చూసుకుంటారు. ఇప్పటికే కొంతమంది ఎమ్మెల్యేలు పార్టీ వీడగా, ఇంకెంతో మంది అదే దారిలో నడిచేందుకు సిద్ధంగా ఉన్నారు.
ఈస్ట్ గోదావరి కి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు, విశాఖపట్నం జిల్లాకు చెందిన ఒక ఎమ్మెల్సీ కూడా త్వరలోనే పార్టీ వీడనున్నారని వార్తా కథనాలు వస్తున్నాయి. వీరంతా టిడిపి జనసేన కూటమిలో చేరనున్నట్టు తెలుస్తోంది. పులివెందులలోనే జగన్మోహన్ రెడ్డికి పరాభవం ఎదురైనట్టుగా పత్రికల్లో వార్తా కథనాలను చూశామని, పులివెందులలో ఆయన పాల్గొన్న సభకు పెద్దగా జనం హాజరు కాలేదని రఘురామకృష్ణం రాజు పేర్కొన్నారు.
రేవంత్ రెడ్డిని అభినందించిన సొంత పార్టీ ఎంపీలపై అగ్గి మీద గుగ్గిలమైన జగన్మోహన్ రెడ్డి
సహచర ఎంపీలతోపాటు , సన్నిహిత మిత్రులైన ఎంపీలకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన విందుకు హాజరైన వైకాపా ఎంపీలపై రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అగ్గి మీద గుగ్గిలం అయినట్లు తెలిసిందని రఘురామ కృష్ణంరాజు వెల్లడించారు. అదే రోజు వైకాపా ఎంపీలకు, విజయసాయిరెడ్డి కూడా ఓ విందును ఇచ్చారు. ఆ విందుకు నన్ను పిలవ లేదు . విజయసాయిరెడ్డి ఇచ్చిన విందుకు హాజరైన వైకాపా ఎంపీలు, రేవంత్ రెడ్డి ఆహ్వానించకపోయినప్పటికీ, ఆయన్ని అభినందించేందుకు వచ్చారు.
రేవంత్ రెడ్డి కూడా వారిని సాదరంగా ఆహ్వానించి, ఒక్కొక్కరిని పేరు పెట్టి పలకరించి తన సంస్కారాన్ని చాటుకున్నారు . అయితే, రేవంత్ రెడ్డి ని అభినందించేందుకు వెళ్లిన సొంత పార్టీ ఎంపీలపై జగన్మోహన్ రెడ్డి అగ్గి మీద గుగ్గిలమై, రానున్న ఎన్నికల్లో టికెట్లు లేవని అన్నారట. ఇప్పటికే ఎంపీలను ఎమ్మెల్యేలుగా పోటీ చేయమని చెప్పిన జగన్మోహన్ రెడ్డి, ఇప్పుడు ఎమ్మెల్యే టికెట్లు కూడా ఇస్తారో , ఇవ్వరో తెలియని పరిస్థితి నెలకొంది. జగన్మోహన్ రెడ్డి ప్రియ మిత్రుడు ఒకరు జనసేన వైపు చూస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి టికెట్ ఇవ్వరని భావించారో, లేకపోతే ఇచ్చిన నెగ్గననే నిర్ణయానికి వచ్చారో తెలియదు కానీ జనసేన కౌగిలిలో ఒదిగిపోవాలని చూస్తున్నారు. ఎంపీలను కూలీలుగా పరిగణించడం మంచి పద్ధతి కాదు.
గతంలో నేను ప్రధానమంత్రిని కలిశానని, 300 మంది ఎంపీలకు విందు ఇచ్చానని జగన్మోహన్ రెడ్డి నాతో అరువు దెబ్బలాట ఆడారు . ఆ మనస్తత్వం ఇప్పటికీ ఆయనకు మారలేదు. ఉన్నత పదవిలో కొనసాగుతున్న వ్యక్తి, ఇటువంటి మనస్తత్వాన్ని కలిగి ఉండడం దారుణం. రేవంత్ రెడ్డి ఇచ్చిన ఇచ్చిన విందుకు విజయసాయిరెడ్డి, మిథున్ రెడ్డిలు మినహా మిగిలిన వారంతా హాజరయ్యారు. మిథున్ రెడ్డి ఊర్లో లేకపోవడం వల్ల హాజరు కాకపోగా, విజయ సాయి మాత్రమే ఆహ్వానించని విందుకు హాజరు కాలేదు. జగన్మోహన్ రెడ్డి సొంత పార్టీ ఎంపీలపై అలిగారన్నది నిజం. అనవసరంగా అంతా అలక అవసరమా? అని రఘురామకృష్ణం రాజు ప్రశ్నించారు.
కడప లోక్ సభ స్థానం నుంచి షర్మిళ పోటీ చేస్తారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే ఆమె రాజ్యసభ కు వెళ్తారనేది నిజం. వైకాపా తరపున కడప లోక్ సభ స్థానం నుంచి కొత్త వారి పేరు వినిపిస్తోంది. అవినాష్ రెడ్డి ఎమ్మెల్యేగా పోటీ చేస్తారని అంటున్నారు. కడప లోక్ సభ స్థానం నుంచి ఎవరు పోటీ చేస్తారన్నది మరి కొన్ని రోజుల్లో తేలనుంది. నేను టిడిపి, జనసేనతో కలిసే కూటమి తరపున పోటీ చేస్తాను. కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా రఘురామకృష్ణంరాజు మాట్లాడుతున్నారని, పెడర్థాలను వెతక వద్దని రఘురామ కృష్ణంరాజు కోరారు.
పక్క రాష్ట్రాలతో సరిపడా జీతాలు ఇవ్వమని కోరుతున్న అంగన్వాడీలు
జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంతో ప్రజలు ఆటాడుకుంటున్నారని, ఈ ప్రభుత్వ తీరుపై అంగన్వాడీలు తీవ్ర నిరసనను వ్యక్తం చేస్తున్నారని రఘురామకృష్ణం రాజు తెలిపారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు కష్టపడి పసిపిల్లలను, బాలింతల బాగోగులను చూసుకునే అంగన్వాడీలకు ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోమని కోరుతున్నారు. పక్క రాష్ట్రాలలో అంగన్వాడీలకు ఇస్తున్నట్లుగా జీతాలను ఇవ్వమని కోరుతున్నారు. జగన్మోహన్ రెడ్డి ఒక్క రూపాయి గౌరవ వేతనంతో పని చేస్తున్నట్లుగానే, ప్రజా సంక్షేమం కోసం పనిచేస్తున్నామని చెబుతున్న వాలంటీర్లు, తమ వేతనాన్ని పెంచాలని ఇప్పుడు కోరుతున్నారు.
సేవా రత్న, సేవా వజ్ర వంటి అవార్డులు తమకు సరిపోవని, ప్రస్తుతం ఇస్తున్న జీతానికి అదనంగా మూడున్నర రెట్లు అధిక మొత్తం జీతాన్ని పెంచాలని సమ్మె చేస్తామని అంటున్నారు. వాలంటీర్లకు విధులు లేవు. సమ్మె ఎందుకు చేస్తారో అర్థం కావడం లేదు. ఈ ఒకటవ తేదీన పింఛన్ లబ్ధిదారులకు ఇవ్వడానికి డబ్బులు లేక, ప్రభుత్వ పెద్దలే వారి చేత సమ్మె చేయిస్తున్నారేమోనని రఘురామ కృష్ణంరాజు అన్నారు. ఒకటవ తేదీన వాలంటీర్లు ప్రతి ఇంటికి వెళ్లి అవ్వ, తాత అంటూ…మీ జగన్ బాబు డబ్బులు పంపించారని అని చెప్పి డబ్బులు ఇవ్వడమే వారి విధి. వాలంటీర్లు లేకపోతే, వచ్చే నష్టమేమీ లేదు. నేరుగా వారి బ్యాంక్ ఖాతాల్లోకి డబ్బులు వెళ్తాయి.
రాష్ట్రంలో మద్యం దుకాణాలలో తప్పితే, అన్నిచోట్ల పేటీఎం యాప్ ను ఉపయోగిస్తున్నారు. వృద్ధాప్య పింఛన్ లబ్ధిదారులకు మద్యం దుకాణాలతో పెద్దగా పని ఉండదు. వారి రోజు వారి ఖర్చుల కోసం పేటీఎం ద్వారా డబ్బులు ఖర్చు చేసుకునే వెసులుబాటు అన్నిచోట్ల లభిస్తుంది. వాలంటీర్లు చేసే మరొక పని ఇంటింటికి బియ్యం సరఫరా చేయడం. వాలంటీర్లు లేకపోయినా పౌరసరఫరాల శాఖ దుకాణాలు ఉన్నాయి. ప్రతి వార్డులోను సచివాలయం ఉండడంతో పాటు సచివాలయ సిబ్బంది ఉన్నారు. వారిని ఈ సేవల కోసం ఉపయోగించుకోవచ్చు. ఎన్నికల సమయంలో ఇదొక వంకగా పెట్టుకొని గౌరవ వేతనాన్ని ఉద్యోగిస్థాయిలో ఉద్యోగి కానీ వ్యక్తికి ఇచ్చే అవకాశం ఉంటుందా? అని ప్రశ్నించిన రఘురామ కృష్ణంరాజు, విజయసాయిరెడ్డి, సుబ్బారెడ్డి, రామకృష్ణారెడ్డి, చెవిరెడ్డి చెప్పారని ఉద్యోగాలు ఇచ్చారు.
అది ప్రభుత్వ ఉద్యోగం అయితే… రాజ్యాంగ నిబంధనల ప్రకారం నోటిఫికేషన్ జారీ చేసి, పరీక్షలు నిర్వహించి ఉద్యోగానికి అర్హులను ఎంపిక చేయాలి. రెడ్లు చెప్పారని చెప్పి ఉద్యోగం ఇవ్వడం కుదరదు. సేవ చేయడానికి ముందుకు వచ్చారని , వారికి గౌరవ వేతనాన్ని ఇస్తున్నట్టుగా జగన్మోహన్ రెడ్డి రచయితల సంఘం పేర్కొంది. ఇప్పుడు వాలంటీర్లు 18000 అడుగుతున్నారని, 18000 కాదు 12000 ఇస్తామంటే కుదరదు. డెఫినిట్ గా వాలంటీర్ వ్యవస్థ మొత్తానికి ఎసరు వస్తుంది. వాలంటీర్ వ్యవస్థ అనేదే ఉండదు.
ఇప్పటికే వాలంటీర్ వ్యవస్థను చూసుకొని, పార్టీ క్యాడర్ ని దూరం చేసుకున్నారు. ప్రజలకు, పార్టీకి మధ్య వారదులుగా వాలంటీర్లను పెట్టుకున్నారు. ఇప్పుడు వాలంటీర్లు డబ్బులు అడుగుతున్నారు. సొంత డబ్బులు ఇచ్చుకొని ఎన్నికల పనులను చేయించుకుంటారేమో చూడాలి. ప్రజలపై పన్నులు వేసి, వాలంటీర్లకు ఖర్చు పెడతామంటే ?, రెండవసారి వాలంటీర్ వ్యవస్థ అవసరమా అన్న చర్చ రాష్ట్రవ్యాప్తంగా కొనసాగుతుంది. ఆడుదాం ఆంధ్ర కార్యక్రమానికి జనాల సమీకరణ బాధ్యతను సచివాలయ సిబ్బందికి, వాలంటీర్లకు అప్పగించారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి హాజరైన ఆడుదాం ఆంధ్ర కార్యక్రమానికి ప్రజలు పెద్దగా హాజరు కాలేదు. ఇక మంత్రులు, ఎమ్మెల్యేలు హాజరయ్యే ఆడుదాం ఆంధ్ర కార్యక్రమానికి ఇక ప్రజలు హాజరవుతారా అని రఘురామకృష్ణంరాజు ప్రశ్నించారు.
ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా రోజాకు బ్యాటింగ్ మెలుకువలను నేర్పిన జగన్మోహన్ రెడ్డి, బౌలింగ్ వేసి ఆమె వికెట్ ను తీసేస్తారా?, రోజా తన వికెట్ జగన్మోహన్ రెడ్డికి దక్కకుండా బ్యాటింగ్ చేయాలని రఘురామకృష్ణంరాజు సూచించారు. ఆడుదాం ఆంధ్ర కార్యక్రమాన్ని అట్టహాసంగా గుంటూరు జిల్లా లయోలా పబ్లిక్ స్కూల్ ఆవరణలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రారంభించారు. ఆడుదాం ఆంధ్ర కార్యక్రమానికి బ్రాండ్ అంబాసిడర్ అయిన అంబటి రాయుడు, టికెట్ ఇవ్వనని జగన్మోహన్ రెడ్డి చెప్పడంతోనే ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరు కాలేదు. ప్రభుత్వ ఖర్చుతో పోస్టర్లు వేసుకోవడానికి ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం ఉపయోగపడుతుందన్న రఘురామకృష్ణంరాజు, 18 సంవత్సరాలు దాటిన విద్యార్థుల ఓట్లను ఓడుపుగా లాక్కోవడానికి ఈ ప్రయత్నం చేస్తున్నారని అన్నారు.
చెట్లను నరికేసే వార్తలు సాక్షి దినపత్రికలో ప్రచురించరు… ఈనాడు, ఆంధ్రజ్యోతిలో ప్రచురించిన ముఖ్యమంత్రి చూసే ఛాన్స్ లేదు
ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా ఎపుగా ఎదిగిన చెట్లను నేలమట్టం చేస్తున్నారు. చెట్లను నరికి వేసిన వార్తలు సాక్షి దినపత్రికలో ప్రచురించే ఛాన్సే లేదు. ఈనాడు, ఆంధ్రజ్యోతి దినపత్రికలలో ప్రచురించిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆ వార్తలను చూడరు. ముఖ్యమంత్రికి తెలియకుండానే, అధికారులే చెట్లను నరుకుతున్నారా అన్న అనుమానం కలుగుతోంది. చెట్లను నరకడం ద్వారా సమాజానికి ఎటువంటి సందేశాన్ని ఇస్తున్నారని రఘురామ కృష్ణంరాజు ప్రశ్నించారు.
ఈ మూడు నెలలైనా అధికారులు చెట్లను నరికి వేయడం మానివేయాలన్నారు. లేకపోతే ప్రజలు క్షమించారని హెచ్చరించారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి హెలికాప్టర్ ప్రయాణానికి అడ్డుగా ఉన్నాయనో, జనం ఆయన్ని చూడడానికి అడ్డుగా ఉన్నాయనో, దేనికి చెట్లను నేలమట్టం చేస్తున్నారో అర్థం కాని పరిస్థితి నెలకొందన్నారు.