Suryaa.co.in

Editorial

జగనన్న చేతిలో కనిపించని షర్మిల రాఖీ

– ఇప్పటివరకూ జగన్‌కు రాఖీ కడుతున్న షర్మిల
– కొద్దికాలం నుంచి అన్నకు దూరంగా చెల్లి
– కుటుంబ విబేధాలతో హైదరాబాద్‌కు షర్మిల
– సొంతంగా రాజకీయ పార్టీ స్థాపన
– ఇడుపులపాయలోనూ తండ్రికి కలి‘విడి’గా నివాళులు
– ఈసారి జగనన్నకు రాఖీ కట్టని షర్మిల
– కాంగ్రెస్‌తో చర్చలకు ఢిల్లీకి వెళ్లిన చెల్లెమ్మ
– సోనియాతో భేటీ అయిన షర్మిల
– దానితో జగన్‌కు రాఖీ కట్టకుండా ముఖం చాటేసిన షర్మిల
– మంత్రులు, మహిళానేతలతోనే రాఖీ కట్టించుకున్న జగనన్న
– అసలు చెల్మెమ్మ కంటే కొసరు చెల్లెమ్మకే రాక్షాబంధన్‌
– అన్నకు రాఖీ కట్టని వైనంపై తెలుగుమహిళల వ్యంగ్యాస్ర్తాలు
– సొంత చెల్లినే పట్టించుకోని జగన్‌ మహిళలను ఏం కాపాడతారంటూ అనిత సెటైర్లు
– సోషల్‌మీడియాలో రాఖీ రచ్చ
( మార్తి సుబ్రహ్మణ్యం)

ఏపీ సీఎం జగ నన్న అసలు చెల్లెమ్మ కంటే కొసరు చెల్లెమ్మలతోనే రక్షాబంధన్‌ నిర్వహించడం చర్చనీయాంశమమయింది. ప్రతి ఏడాది సొంత చెల్లెలు షర్మిలతో రాఖీ కట్టించుకునే జగనన్న ఈసారి ఆమెకు బదులు మహిళా మంత్రులు, మహిళా నేతలతో రాఖీ కార్యక్రమం ముగించాల్సి వచ్చింది. దీనిపై ప్రత్యర్ధి పార్టీల మహిళా నేతలు వ్యంగ్యాస్ర్తాలు సంధిస్తున్నారు.

రాఖీ పండుగ రోజు అందరి కళ్లూ ఆ ఇద్దరిపైనే. ప్రధానంగా రాజకీయవర్గాల దృష్టి అంతా, ఆ ఇద్దరి కలయికపైనే కేంద్రీకృతమయింది. వారిద్దరిలో ఒకరు ఏపీ సీఎం-వైసీపీ అధినేత జగన్మోహన్‌రెడ్డి. మరొకరు ఆయన చెల్లెలు-వైస్సార్‌టీపీ అధినేత్రి షర్మిల.

విషయం ఏమిటంటే.. రక్షాబంధన్‌ రోజు ఆ అన్నాచెల్లెలు కలుస్తారా? లేదా? అన్నకు రాఖీ కట్టి, ‘అన్నా.. నీ అనురాగం. ఎన్నో జన్మల పుణ్యఫలం’ అని అను‘రాగాలు’ కురిపిస్తారా? లేదా? అన్నదే ఆ ఉత్కంఠ . అయితే అన్నకు రాఖీ కట్టేందుకు చెల్లి వస్తుందా ? రాదా? అన్న ఉత్కంఠకు, చివరాఖరకు తెరపడింది. అన్నకు రాఖీ కట్టేందుకు, చెల్లెమ్మ రానేలేదు.

రక్షాబంధన్‌ పండుగ సందర్భంగా ప్రతి ఏడాదీ.. అన్న జగన్మోహన్‌రెడ్డికి, రాఖీ కట్టడం ఆనవాయితీగా వస్తోంది. అన్నకు రాఖీ కట్టిన తర్వాత, చెల్లికి జగనన్న స్వీటు తినిపించే ఫొటోలు విడుదల చేసేవారు. గూగుల్‌లో వాటి పాత చిత్రాలు, వీడియోలు ఇంకా దర్శనమిస్తుంటాయి.

అయితే మధ్యలో అన్నాచెల్లెల మధ్య అగాధం ఏర్పడి, చెల్లెమ్మ షర్మిల ఆంధ్రా విడిచి తెలంగాణ బాట పట్టారు. తెలంగాణలో వైఎస్సార్‌టీపీ స్ధాపించి, పాదయాత్ర కూడా నిర్వహించారు. తల్లి విజయమ్మ కూడా తన వైసీపీ గౌరవాధ్యక్ష పదవికి రాజీనామా చేసి, కూతురు షర్మిల వెంటే నడిచారు. అంతవరకూ బాగానే ఉంది. అయితే చిన్నాన్న వివేకానందరెడ్డి హత్యకేసులో షర్మిల ఇచ్చిన సాక్ష్యం, సోదరి డాక్టర్‌ సునీత వాదనను సమర్ధించేలా ఉండటం వైసీపీ వర్గాల్లో కలకలం రేపింది.

అంతకుముందు వరకూ.. వైఎస్‌ జయంతి-వర్థంతి కార్యక్రమాలకు జగనన్నతో కలసి, సకుటుంబ సపరివార సమేతంగా హాజరైన దశ్యాల్లో కూడా, హటాత్తుగా మార్పులొచ్చాయి. అన్న జగన్‌-చెల్లి షర్మిల వేర్వేరుగానే ఇడుపులపాయకు వెళ్తున్నారు. చెల్లి-తల్లి అక్కడి నుంచి వెళ్లిపోయారన్న సమాచారం వచ్చిన తర్వాతనే, అన్న వెళుతున్న పరిస్థితి.

అయితే ఈ పరిస్థితిలో ఏమైనా మార్పులొచ్చి, కనీసం రక్షాబంధన్‌రోజు రాఖీ అయినా కడుతుందేమోనని, చాలామంది భావించారు. ఎంతైనా అన్నాచెల్లెళ్లు కదా? అదీ ఆశ! అయితే ఈ రాఖీ పండగ రోజు అన్నా చెల్లెలు కలవలేదు. అయితేనేం..? జగనన్నకు బొలెడుమంది చెల్లెమ్మలు. ఆయనది జగమంత కుటుంబం. మహిళా మంత్రులు, పార్టీ మహిళా ఎమ్మెల్యేలు నేతలు వచ్చి, అన్నయ్యకు ఆప్యాయంగా రాఖీ కడితే, అన్నయ్య కూడా ఆనందించి.. వారి తలపై చేయి పెట్టి ఆశీర్వదించారు.

అయితే రాఖీ పండగ ముందురోజు.. చెల్లెమ్మ-బావ ఢిల్లీకి వెళ్లి, కాంగ్రెస్‌ నేతతో భేటీ అయ్యారు. ప్రధానంగా పార్టీ సుప్రీం సోనియాగాంధీని కలసి, తన వైఎస్సార్‌టీపీని కాంగ్రెస్‌లో విలీనం చేసే ముచ్చట్లలో మునిగిపోయారు. అందువల్ల చెల్లెమ్మ విలీనం ఊసులో పడి, అన్నయ్యకు రాఖీ కట్టడం మర్చిపోయినట్లున్నారు.

మరి ఇలాంటి అవకాశాన్ని వైసీపీ ప్రత్యర్ధులు ఊరికనే విడిచిపెట్టరు కదా? సరిగ్గా అదే జరిగింది. తెలుగుమహిళ రాష్ట్ర అధ్యక్షురాలు, ఫైర్‌బ్రాండ్‌ వంగలపూడి అనిత.. చెల్లితో రాఖీ కట్టించుకోలేని జగనన్న తీరుపై, వ్యంగ్యాస్ర్తాలు సంధించారు.

సొంత చెల్లి-తల్లినే ఇంటినుంచి గెంటేసిన జగనన్న, రాష్ట్రంలోని మహిళలందరినీ కాపాడతానని చెప్పడం, పెద్ద జోకని సెటైర్లు సంధించారు. ‘ముందు మీ చెల్లికి న్యాయం చేయండి. రాష్ట్రంలో మహిళలందరికీ న్యాయం చేసినంతపుణ్యం’ అని ఎద్దేవా చేసిన వీడియోలు, సోషల్‌మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.

LEAVE A RESPONSE