– విమానాన్ని అనుసరించిన భారత వాయుసేన ఫైటర్ జెట్
– సాయంత్రం 5.30 గంటలకు భారత్‌కు చేరుకున్న షేక్ హాసీనా
– షేక్ హసీనా విమానాన్ని అనుసరించిన వాయుసేన ఫైటర్ జెట్స్
– భారత్ దౌత్య కార్యాలయం వద్ద భద్రత కట్టుదిట్టం
– ఢాకాకు ఎయిరిండియా విమాన సర్వీసులు రద్దు
ఢిల్లీ: బంగ్లాదేశ్ ప్రధానమంత్రి పదవికి రాజీనామా చేసిన షేక్ హసీనా సోమవారం సాయంత్రం 5.30 గంటలకు భారత్‌కు చేరుకున్నారు. ఆ దేశంలోని ప్రస్తుత పరిస్థితుల్లో పదవికి రాజీనామా చేసిన ఆమె సురక్షిత ప్రాంతానికి చేరుకోవాలని భావించారు. ఈ క్రమంలో సాయంత్రం భారత్‌కు వచ్చారు. ఇక్కడి నుంచి ఆమె నేరుగా లండన్ వెళ్లనున్నారు.
షేక్ హసీనా బంగ్లాదేశ్‌కు చెందిన సీ-130 విమానం భారత గగనతలంలోకి ప్రవేశించిన వెంటనే భారత వైమానిక దళం యుద్ధ విమానాలు గాల్లోకి ఎగిరాయి. కొద్దిసేపు సీ-130 విమానాన్ని భారత ఫైటర్స్ జెట్స్ అనుసరించాయి. ఈ సీ-130 విమానంలో షేక్ హసీనా భారత్ చేరుకున్నారు. ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు భారత వాయుసేన, సైన్యం ముందే సిద్ధమైనట్లుగా విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి.
బంగ్లాదేశ్‌లోని హింసాత్మక ఘటనల దృష్ట్యా ఆ దేశంలోని భారత దౌత్య కార్యాలయం వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. అదే సమయంలో ఢిల్లీలోని బంగ్లాదేశ్ దౌత్య కార్యాలయం వద్ద కూడా భద్రతను పెంచారు.
బంగ్లాదేశ్ తాజా పరిణామాల నేపథ్యంలో ఎయిరిండియా విమానాలను రద్దు చేసింది. ఇప్పటికే టిక్కెట్లను కొన్న ప్రయాణికులకు అన్ని విధాలుగా సహకరిస్తామని తెలిపింది. ప్రయాణికులు, సిబ్బంది భద్రత అత్యంత కీలకమని వెల్లడించింది.