– జపాన్ ట్రాఫిక్ నియంత్రణలో పాదచారులకు ప్రాధాన్యత
– ప్రతిసారి మూడు వేల మంది దాటే షిబుయా క్రాసింగ్ ఒక అద్భుతం
– ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు
(టోక్యో నుంచి సింగరేణి ప్రత్యేక ప్రతినిధి): మహానగర ట్రాఫిక్ నియంత్రణలో జపాన్ దేశం ఆదర్శప్రాయమని ముఖ్యంగా టోక్యో నగరంలో షిబుయా క్రాసింగ్ ఒక అద్భుతమని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు పేర్కొన్నారు. మూడు రోజుల జపాన్ పర్యటనలో భాగంగా ఆయన మంగళవారం సాయంత్రం టోక్యో నగరంలో హచుకో రైల్వే స్టేషన్ వద్ద గల షిబుయా క్రాసింగ్ ను సందర్శించారు.
ఒకేసారిగా 3,000 మంది బాటసారులు ఎటువంటి ఆటంకం లేకుండా రోడ్లు దాటడానికి చేసిన ఏర్పాటును ఆయన పరిశీలించారు. రోజుకు కనీసం 5 లక్షల మంది పాదచారులు ఒక్క చిన్న ప్రమాదం జరగకుండా ఈ రైల్వే మరియు రోడ్డు కూడలి నుండి దాటుతుంటారని, ప్రపంచంలోనే ఇది అతి పెద్ద రక్షణతో కూడిన పాదచారుల క్రాసింగ్ అని ఆయన ప్రశంసించారు.
హైదరాబాద్ లో అత్యంత రద్దీగా ఉండే కూడళ్లలో షిబుయా తరహా ట్రాఫిక్ నియంత్రణ పద్ధతిని అమలు జరపనున్నామని భట్టి విక్రమార్క తెలిపారు. షిబుయా క్రాసింగ్ వద్ద భారత ఎంబసీ అధికారులు అక్కడ వినియోగిస్తున్న అత్యాధునిక సాంకేతికతను ఉప ముఖ్యమంత్రికి వివరించారు. ఆర్థిక శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి శ్రీ రామకృష్ణారావు, ఇంధన శాఖ కార్యదర్శి రోనాల్డ్ రోస్, సింగరేణి సిఎండీ ఎన్.బలరామ్ ఈ సందర్శనలో పాల్గొన్నారు.