– రఘురామ్ కనస్ట్రక్షన్ సంస్థకి రూ.954 కోట్లతో అండర్ గ్రౌండ్ కేబుల్ వర్క్ కాంట్రాక్ట్
– పెద్దిరెడ్డి సిఫారసు కారణంగా 30 శాతం నిధులు అదనంగా రూ.1300 కోట్లకు కాంట్రాక్ట్?
– కాంట్రాక్ట్ అప్పగించి ఏడాది కావస్తున్నా ఇప్పటికీ పనులు ప్రారంభించని రఘురామ్ కనస్ట్రక్షన్స్
– రఘురామ్ కనస్ట్రక్షన్స్ సంస్థ వెనుకంజ వేస్తే ఈపీడీసీఎల్ కు రూ.500కోట్ల నష్టం
– ఎక్సెస్ నిధులతో కాంట్రాక్ట్ ఓకే కావడానికి పది శాతం ముడుపుల ఆరోపణలు?
– 25 శాతం ఎక్సెస్ ప్రతిపాదనతో పనులు
– ఈపీడీసీఎల్ కు వెయ్యి కోట్ల రూపాయల నష్టం
– ‘యూరో ఎగ్జిమ్’ అనే వెస్టిండీస్ బ్యాంకు పేరిట బ్యాంకు గ్యారంటీ
– రుషికొండ భవనం కోసం రూ.12 కోట్ల వ్యయంతో కంటైనర్ సబ్ స్టేషన్
– రూ.2.5 కోట్ల నుండి రూ.3 కోట్ల వ్యయంతో నిర్మించ వచ్చు
– రూ.9 కోట్ల ప్రజాధనం వృధా
ముఖ్యమంత్రికి తెలుగునాడు విద్యుత్ కార్మిక సంఘం నేతల ఫిర్యాదు
– ఆ రెండు డిస్కంలలో ఇంకా వైసీపీ హవా!
– పాత అక్రమాలు కప్పిపుచ్చుతున్న ఆ ఇద్దరు సిఎండీలు?
(మార్తి సుబ్రహ్మణ్యం)
కూటమి సర్కారు గద్దెనెక్కి వందరోజులు దాటుతున్నా.. ఆ రెండు డిస్కమ్‌లలో ఇంకా వైసీపీ వాసనలే ఘుమఘుమలాడుతున్నాయి. నాటి సీఎం జగన్, నాటి మంత్రి పెద్దిరెడ్డి కనుసన్నల్లో నడిచిన ఆ కంపెనీకి, అతి ప్రేమతో కట్టబెట్టిన పనులు ఇప్పుడు ఈపీడీసీఎల్ కొంపముంచబోతున్నాయి. పాలకుల ఆశీస్సులతో వ ందలకోట్ల కాంట్రాక్టు దక్కించుకున్న సదరు కంపెనీ ఇప్పటికీ పనులు మొదలెట్టలేదు. ఒకవేళ ఆ కంపెనీ ఇప్పుడు ఆ పనులు తనవల్ల కాదని చేతులెత్తేస్తే.. ఈఎస్‌పిడిసిఎల్ నెత్తిన అక్షరాలా వెయ్యి కోట్ల రూపాయల పిడుగు ఖాయం. జగన్ మళ్లీ సీఎం అవుతారన్న ఆశతో, రిషికొండ రాజప్రాసాద వెలుగుల కోసం 12 కోట్లతో నిర్మించిన కంటైనర్ సబ్‌స్టేషన్ అసలు విలువ మూడు కోట్లరూపాయలేనట. ఇవన్నీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు, టీడీపీ అనుబంధ కార్మిక సంఘ నేతలు చేసిన ఫిర్యాదులే! అసలు కూటమి సర్కారు ఏర్పడి మూడునెలలు దాటుతున్నా, ఇంకా ఎస్పీడీసీఎల్, ఈపీడీసీఎల్ బాసులు మాత్రం.. దేదీప్యమానంగా వె లిగిపోతుండమే ఆశ్చర్యం. మరి ఆ కంపెనీపై చర్యల కొరడా ఝళిపిస్తారా? ఇద్దరు బాసుల స్థానంలో కొత్త అధికారులను నియమిస్తారా? అన్నదే ఇప్పుడు చర్చ.
రాష్ట్రంలో టిడిపి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి వంద రోజులు పూర్తయింది. రాష్ట్ర వ్యాప్తంగా కూటమి ప్రభుత్వ వంద రోజుల విజయాలను ‘ఇది మంచి ప్రభుత్వం’ పేరుతో ప్రచారం చేస్తున్నారు.
టీడీపీ, జనసేన, బిజెపి నేతలు ‘ఇది మంచి ప్రభుత్వం’ అంటూ ఇంటింటా ప్రచారం చేస్తుంటే.. వైసీపీ అస్మదీయ అధికారులు మాత్రం ‘ఇది మంచి ఛాన్స్’ అంటూ పండుగ చేసుకుంటున్నారు. ఎక్కడ ఆ పండుగ? ఏమిటి ఆ ఛాన్స్ అని ఆశ్చర్యపోతున్నారా?.. అయితే ఈ వివరాలు చదవండి..
ఆంధ్రప్రదేశ్ తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (ఏపీఇపిడిసిఎల్), ఆంధ్రప్రదేశ్ దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (ఏపీఎస్పీడిసిఎల్) లలో పరిస్థితి చూస్తే ఇంకా వైసీపీ హవా నడుస్తుందనే విమర్శలు వినిపిస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా మూడు డిస్కంలుగా విద్యుత్ పంపిణీ సంస్థలు పని చేస్తున్నాయి. ఏపీ ఇపిడిసిఎల్, ఏపీ సిపిడిసిఎల్, ఏపీ ఎస్పీడిసిఎల్.. ఈ మూడు డిస్కంలలో ఏటా వేల కోట్ల రూపాయల టర్నోవర్ జరుగుతుంది.
ఇంతటి కీలక డిస్కంలలో సాధారణంగా రాష్ట్రంలో ఏ ప్రభుత్వ అధికారంలో ఉంటే, ఆ ప్రభుత్వ విధానాలకు అనుగుణంగా నడుచుకునే అధికారులకు ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ (సిఎండి)లుగా అవకాశం ఇస్తుంటారు. రాష్ట్రంలో ప్రభుత్వాలు మారినప్పుడల్లా కీలక శాఖల్లో అధికారులు మారుతూనే ఉంటారు.
ఐఎఎస్, ఐపిఎస్ అధికారుల ప్రాధమ్యాలు మారుతుంటాయి. రాష్ట్ర ప్రభుత్వ కీలక శాఖల ఉన్నతాధికారుల మాదిరిగానే డిస్కంల సిఎండిలు మారడం కూడా సంప్రదాయంగా వస్తోంది. కానీ ఈసారి రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం కుప్పకూలి, టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చినా ఆ రెండు డిస్కంల విషయంలో మాత్రం ఇంకా మార్పులు జరగలేదు.
టీడీపీ కూటమి అధికారంలోకి రాగానే.. ఆంధ్రప్రదేశ్ మధ్య ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (ఏపీ సిపిడిసిఎల్) సిఎండిగా ఐఏఎస్ అధికారి పంతంశెట్టి రవిని నియమించారు. జూలై 22వ తేదీన బాధ్యతలు చేపట్టిన రవి, ఇటీవల విజయవాడ వరదల సమయంలో సమర్థవంతమైన సేవలు అందించారు.
వరదల కారణంగా దెబ్బతిన్న డివిజన్లలో, విద్యుత్ పునరుద్ధరణ పనులు యుద్ధప్రాతిపదికన చేయించారు. కానీ ఏపీ ఈపీడీసీఎల్, ఏపీ ఎస్పీడిసిఎల్ లలో మాత్రం, ఇందుకు పూర్తి భిన్నమైన పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఈపీడీసీఎల్ సిఎండి ఇ. పృథ్వీ తేజ 2023 ఏప్రిల్ 18వ తేదీన బాధ్యతలు చేపట్టగా.. ఎస్పీడిసిఎల్ సిఎండి సంతోష్ రావు 2023 ఏప్రిల్ 21న ఆ హోదాలోకి వచ్చారు.
వీరిద్దరూ అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన రెడ్డికి, అప్పటి విద్యుత్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డికి అత్యంత సన్నిహితులులన్న ముద్ర.. నాటి మీడియా కథనాలు వెల్లడించాయి. జగన్మోహన రెడ్డి, పెద్దిరెడ్డి ఏం చెబితే అది ఈ రెండు డిస్కంలలో తుచ తప్పకుండా జరిగిపోయేవన్న విమర్శలు మీడియాలో వెల్లువెత్తిన విషయం తెలిసిందే.
ఈపీడీసీఎల్ లో అండర్ గ్రౌండ్ కేబుల్ వర్క్ పనులు నిర్వహించడానికి, రఘురామ్ కనస్ట్రక్షన్ అనే సంస్థకి కాంట్రాక్ట్ కట్టబెట్టారు. రూ.954 కోట్ల విలువైన ఈ పనిని, అప్పటి మంత్రి పెద్దిరెడ్డి సిఫారసు కారణంగా 30 శాతం నిధులు అదనంగా రూ.1300 కోట్లకు ఆ సంస్థకు కట్టబెట్టారు. ఎక్సెస్ నిధులతో కాంట్రాక్ట్ ఓకే కావడానికి పది శాతం నిధులు ముడుపులు చేతులు మారాయనే ఆరోపణలు ఉన్నాయి. దీనిపై అప్పట్లోనే మీడియాలో కథనాలు వెలువడిన విషయం తెలిసిందే.
ఈ కాంట్రాక్ట్ అప్పగించి ఏడాది కావస్తున్నా.. రఘురామ్ కనస్ట్రక్షన్స్ సంస్థ మాత్రం, ఇప్పటికీ పనులు ప్రారంభించలేదు. పెద్దిరెడ్డి బినామీ సంస్థ కావడం వల్లనే, ఇప్పటికీ సిఎండి కార్యాలయం ఆ పనుల ఊసెత్తడం లేదనే విమర్శలు వస్తున్నాయి. ఇప్పుడు ఆ ప్రాజెక్టు అంచనా వ్యయం కూడా పెరిగిపోవడం వల్ల, రఘురామ్ కనస్ట్రక్షన్స్ సంస్థ కనుక వెనుకంజ వేస్తే ఈపీడీసీఎల్ సంస్థకు రూ.500కోట్ల మేరకు నష్టం రావడం ఖాయం.
పనులు ప్రారంభించని ఆ సంస్థ మీద చర్యలు తీసుకుందామన్నా.. ‘యూరో ఎగ్జిమ్’ అనే వెస్టిండీస్ బ్యాంకు పేరిట, బ్యాంకు గ్యారంటీ ఇచ్చి చేతులు దులుపుకున్నారు. భారతీయ రిజర్వు బ్యాంకు గుర్తింపు లేని యూరో ఎగ్జిమ్ బ్యాంకు గ్యారంటీని, అధికారులు ఏవిధంగా ఆమోదించారో ఆ బ్రహ్మదేవుడికే ఎరుక.
ఈపీడీసీఎల్ పరిధిలోనే అగ్రికల్చర్ సపరేట్ సిస్టమ్ నిమిత్తం జిల్లాల వారీగా టెండర్లు పిలవాలని, కేంద్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. ఐదు పాత జిల్లాలకు ఐదు యూనిట్లుగా టెండర్లు పిలవాల్సి ఉండగా.. జగన్మోహన రెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆదేశాల మేరకు రెండు పనులుగా టెండర్లు పిలిచి, 25 శాతం ఎక్సెస్ ప్రతిపాదనతో జగన్ బినామీలకు ఆ పనులు కట్టబెట్టారన్న ఆరోపణలు అప్పుడే వినిపించాయి.
సాధారణంగా విద్యుత్ శాఖలో పనులకు కాంట్రాక్టర్లే.. 20నుండి 25 శాతం లెస్ అంచనాతో టెండర్లు వేస్తుంటారు. కానీ ఈపీడీసీఎల్ సిఎండి మాత్రం, 25శాతం అదనపు నిధులతో ఈ వర్క్ ను ఆయా కాంట్రాక్టర్లకు కట్టబెట్టడం ద్వారా సంస్థకు వెయ్యి కోట్ల రూపాయల మేరకు నష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది. దీనికి కూడా యూరో ఎగ్జిమ్ బ్యాంక్ గ్యారంటీయే అంగీకరించడంతో , ఈపీడీసీఎల్ సంస్థ ఏమీ చేయలేని పరిస్థితి నెలకొంది.
తిరిగి రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వస్తుందనే భ్రమలో.. విశాఖ రుషికొండ చెంతనే జగన్మోహన రెడ్డి క్యాంపు కార్యాలయం అంటూ వందల కోట్లు వెచ్చించి, ఒక ఇంధ్ర భవనంలాంటి భవనం నిర్మించిన సంగతి తెలిసిందే. రుషికొండ భవనం కోసం రూ.12 కోట్ల వ్యయంతో కంటైనర్ సబ్ స్టేషన్ నిర్మించారు.
వాస్తవానికి రుషికొండ భవన సామర్ధ్యానికి అవసరమైన ఓపెన్ సబ్ స్టేషన్ రూ.2.5 కోట్ల నుండి రూ.3 కోట్ల వ్యయంతో నిర్మించ వచ్చు. కానీ జగన్మోహన రెడ్డి పట్ల అతి ప్రేమతో, ఈపీడీసీఎల్ సిఎండి, ఈ కంటైనర్ సబ్ స్టేషన్ నిర్మించడం వల్ల.. దాదాపు రూ.9 కోట్ల ప్రజాధనం వృధా అయింది.
కొత్త ప్రభుత్వంలో కొత్త సిఎండిలు వస్తే కనుక డిస్కంలలోని అనేక అవకతవకలు వెలుగులోకి వస్తాయి. కానీ జగన్మోహన రెడ్డి అస్మదీయ అధికార గణమే.. ఇంకా ఆ రెండు డిస్కంలలో తిష్ట వేసుకు కూర్చోవడంతో, పాత అక్రమాలు వెలుగులోకి రాకుండా పాతరేసే ప్రయత్నాలు చేస్తున్నారు.
ఇటీవల ఉద్యోగుల బదిలీల సందర్భంగా కూడా డిస్కంల పాత సిఎండిలు, కూటమి నేతల సిఫార్సులను పరిగణనలోకి తీసుకోకుండా.. సిబ్బందిని ఇబ్బందుల గురి చేశారని తెలుగునాడు విద్యుత్ కార్మిక సంఘం నేతలు ముఖ్యమంత్రికి కూడా ఫిర్యాదు చేశారు. ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం ఇపిడిసిఎల్, ఎస్పీడిసిఎల్ సంస్థలకు కొత్త సిఎండిలను నియమించాలని డిస్కంల సిబ్బంది కోరుతున్నారు.