Suryaa.co.in

Devotional

శివ తత్వం

ఆరోహణ తర్వాత
అవరోహణ తప్పదు
ముక్తాయింపుతో రాగం
పూర్ణాహుతితో యాగం
పరిపూర్ణ మారుతాయి…!!

పండుటాకులు
పంచభూతాలు కలిస్తేనే
కొత్త చిగుళ్ళకు చోటు లభిస్తుంది
మహా సాగరంలో నీరు
ఆవిరి అయితేనే
మబ్బు కరిగి కురుస్తుంది…!!

శివ తత్వంలో ఇవన్నీ స్ఫురిస్తూ…
నీ ఆట కదరా శివ ఇదంతా
విలయకారుడూ వినాశకుడూ కాదు
విలీన కర్తవు నీవే కదా శివయ్య…!!

శివ తత్వం వైవిధ్యభరితం
వైరుధ్యాలను నిర్వహించటం
నీకు మాత్రమే సాధ్యం…!!

అఖిల సంపదకు నెలవై
భస్మాన్ని పూసుకుంటావు
అన్నపూర్ణ ఇల్లాలై ఉండగా
భిక్షాం దేహీ అంటూ
పుర్రెతో భిక్షాటన చేస్తావు…!!

మూడు కన్నులతో
ఐదు మోములతో
స్థావర జంగమాల్లో కొలువుంటావు
లింగ స్వరూపుడుగా…!!

విష నాగును హారంగా ధరించి కంఠంలో గరాళాన్ని బిగించి
సిగలో
అమృత నిలయుడైన చంద్రుణ్ణి,
సిగముడిలో
ముక్తిని ప్రసాదించే సురగంగను
ఉంచడంలోనే
వైవిద్యభరితమైన నీ శివతత్వం
వైరుధ్యాల్ని నిర్వర్తించే
నీ సామర్థ్యం వ్యక్తమవుతున్నాయి
కదా శివయ్య…!!

పండు సమర్పించినా …
ఓ చెంబుడునీళ్లతో అభిషేకించినా
దండిగా దీవెనలు అనుగ్రహించే బోళాశంకరుడవు నీవు…!!

గమ్మత్తుగా మత్తు పెంచే
గారడీల ప్యాకేజీలతో….
ఇంటి ఖర్చు ఇంతింతై….
ధరల పిడుగు మోతతో….

ఏళ్ళు గడుస్తున్నా మారని
కన్నీటి వ్యధలు….
పాలకుల పాదముద్రల కింద వడలిన
పేద ,మధ్యతరగతి బ్రతుకులు మావి…

ఊసరవెల్లి నాయకులకి
“శివతత్వాన్ని” బోధించి
ఆత్మజ్ఞానాన్ని ప్రసాదించి
మా చీకటి బ్రతుకుల్లో
కాసింత వెలుగులు పంచు శివయ్య..!!

నలిగల రాధికా రత్న

LEAVE A RESPONSE