వైసీపీ నేత టిడిపిలో చేరిక
అమరావతి: మంగళగిరి సమగ్రాభివృద్ధికి కలిసిరావాలన్నా యువనేత నారా లోకేష్ పిలుపునకు పెద్దఎత్తున స్పందన లభిస్తోంది. ఉండవల్లిలోని నివాసంలో యువనేత సమక్షంలో మంగళగిరి శివాలయం ట్రస్ట్ బోర్డు సభ్యురాలు వకుళాదేవి టీడీపీలో చేరారు.
ఉదయం మంగళగిరి శ్రీ గంగా భ్రమరాంబ సమేత మల్లేశ్వరస్వామివారి దేవస్థానం ట్రస్ట్ బోర్డ్ సభ్యురాలుగా తన పదవికి, వైఎస్ఆర్సిపీ పార్టీకి రాజీనామా చేసిన వకుళాదేవి టిడిపి లో చేరారు. నియోజకవర్గంలో నారా లోకేష్ ఆధ్వర్యంలో నిర్వహించిన అనేక సంక్షేమ కార్యక్రమాలు, స్త్రీ శక్తి కార్యక్రమం ద్వారా మహిళలు తమ కాళ్ల పై తాము నిలబడేందుకు లోకేష్ ఇచ్చిన సహకారం తనను ఎంతగానో ఆకట్టుకున్నాయని ఆమె అన్నారు.
మంగళగిరి అభివృద్ధి నారా లోకేష్ తోనే సాధ్యం అని బలంగా నమ్మి తన పదవికి, వైకాపా కు రాజీనామా చేసినట్టు ఆమె ప్రకటించారు. ఆమె కు పసుపు కండువా కప్పిన లోకేష్ సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా యువనేత మాట్లాడుతూ.. మంగళగిరి ప్రజలకు సేవ చేసేందుకు ఇక్కడకు వచ్చానని, పేదరికం లేని మంగళగిరిగా తయారుచేయడమే తన లక్ష్యమన్నారు. దేశంలోనే అభివృద్ధి, సంక్షేమానికి చిరునామాగా నియోజకవర్గాన్ని తీర్చిదిద్దుతానని, అందరూ కలసికట్టుగా పనిచేసే తనను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మంగళగిరి టౌన్ అధ్యక్షులు దామర్ల రాజు పాల్గొన్నారు.