Suryaa.co.in

Andhra Pradesh

అక్రమ ప్రహరీలు కూలిస్తే ప్రభుత్వాన్ని కూల్చాలా?

-కూల్చడానికి ఇదేమన్నా సినిమా సెట్టింగా?
-పవన్ కళ్యాణ్ రాజకీయాలకు పనికిరాడు
-ఇప్పటంలో ఒక్క ఇల్లు కూడా కూల్చలేదు
-ప్రహరీలు, టాయిలెట్లు మాత్రమే కూల్చారు
-రహదారి విస్తరణ కోసం ఎప్పుడో మార్కింగ్‌
-నోటీసులూ ఇచ్చారు. అది కక్ష సాధింపు కాదు
-రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు

ఉన్మాదిలా మారిన పవన్‌:
ఈరోజు మంగళగిరి నియోజకవర్గంలో ఇప్పటం గ్రామాన్ని జనసేన అధ్యక్షుడు పవన్‌కళ్యాణ్‌ సందర్శించారు. ఈ సందర్భంగా ఒక ఉన్మాదిలా, బరి తెగించి ఇష్టం వచ్చినట్లు మాట్లాడారు. ఈ ప్రభుత్వాన్ని కూల్చిపారదొబ్బండి అని కూడా అన్నారు. అంటే ఆయన ఎంత ఫ్రస్టేషన్‌లో ఉన్నాడో, ఎంత అవివేకంగా ఉన్నాడో, ఎంత అర్థరహితంగా ఉన్నాడో ఆ ఒక్క మాటతోనే అర్ధం అవుతుంది. గత నెల 17వ తేదీన కూడా దాదాపు అలాగే మాట్లాడాడు. కూల్చి పారదొబ్బడానికి ఇదేమన్నా సినిమా సెట్టింగా? షూటింగ్‌ కాగానే కూల్చి వేయడానికి. ఇది ప్రజలు ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నుకున్న ప్రభుత్వం. అది ప్రజలకు మాత్రమే ఉంది. కానీ ఆ ఎన్నికలకు ఇంకా చాలా దూరం ఉంది. ఆలోగానే చంద్రబాబు సహకారంతో ఈ ప్రభుత్వాన్ని కూల్చేయాలని ఒక ఉన్మాదిలా పవన్‌ మాట్లాడుతున్నాడు.

ఇప్పటం ఎందుకొచ్చారు?:
అసలు ఇప్పటం గ్రామానికి మీరెందుకు వచ్చారు? అసలు ఇప్పటంలో ఏం జరుగుతోంది? ఇవాళ ఈనాడులో ఒక పెద్ద వార్త రాశారు. కక్షతో ఇప్పటంలో 53 ఇళ్లు కూల్చివేత అని ఒక పచ్చి అబద్ధపు వార్త రాశారు. దాన్ని పట్టుకుని, చంద్రబాబు సలహాతో ఇప్పటం వచ్చి రంకెలు వేసి వెళ్లాడు. పవన్‌కళ్యాణ్‌ పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఈ ఏడాది మార్చి 14న ఇప్పటంలో పవన్‌కళ్యాణ్‌ నిర్వహించారు. ఆ సభకు గ్రామస్తులు భూమి ఇచ్చారు. ఆ సందర్భంగా గ్రామానికి రూ.50 లక్షలు ఇస్తానన్న పవన్‌ ఆ మాట నిలబెట్టుకోలేదు. అయితే తన సభకు భూమి ఇచ్చాడన్న విషయాన్ని మనసులో పెట్టుకుని కక్షతో గ్రామంలో ఇళ్లు కూలగొడుతున్నారని పవన్‌కళ్యాణ్‌ ఆరోపించారు.

ఆ పనులు ఎప్పుడో చేపట్టారు:
పవన్‌ ఆరోపణల్లో ఏ మాత్రం వాస్తవం లేదు. ఇది ఒక కట్టుకధ. ప్రజలు దీన్ని తెలుసుకోవాలి. ఎందుకంటే మార్చి 14న జనసేన ఆవిర్భావ సభ ఇప్పటంలో జరిగింది. అయితే అంతకు ముందే గ్రామంలో రహదారి విస్తరణ పనులు మొదలయ్యాయి. పెదవడ్లపూడి నుంచి ఇప్పటం మీదుగా హైవే వరకు రహదారి విస్తరణ చేపట్టారు. మంగళగిరి తాడేపల్లి కార్పొరేషన్‌ అధికారులు అలా చాలా చోట్ల రహదారుల విస్తరణ చేపట్టారు. అందులో భాగంగానే, ఈ ఏడాది జనవరి, ఫిబ్రవరిలో మార్కింగ్‌ చేశారు. ఆ తర్వాత నోటీసులు కూడా ఇచ్చారు. మరోవైపు ఇప్పటికే ఒకవైపు తూర్పున అక్రమ కట్టడాలు కూల్చి, డ్రెయిన్‌ కూడా కట్టారు. ఇవాళ రెండో వైపున డ్రెయిన్‌ కోసం అక్రమ కట్టడాలు కూలిస్తే, అక్కడికి వెళ్లిన పవన్‌కళ్యాణ్‌ కక్షపూరితంగా అన్న కలర్‌ ఇచ్చి, వైయస్సార్‌ కాంగ్రెస్‌ మీద లేనిపోని విమర్శలు చేస్తున్నారు. దీన్ని ప్రజలు గమనించాలి.

రెచ్చగొట్టడమే ధ్యేయం:
పవన్‌కళ్యాణ్‌ ఎప్పుడైతే ముసుగు తీసి, చంద్రబాబుతో కలిసిపోయారో అప్పటి నుంచి ఉన్మాదిలా వ్యవహరిస్తున్నాడు. కులాలు, ప్రాంతాలు, మతాల మధ్య చిచ్చు పెట్టాలని, ఆవేశపూరితంగా ప్రసంగాలు చేస్తున్నాడు. అందులో భాగంగానే ఇవాళ ఉదయం ఫ్లైట్‌లో వచ్చాడు. విప్పటం గ్రామంలో షార్ట్‌ ఫిలిమ్‌గా ఆవేశంగా మాట్లాడాడు. తిరిగి వెళ్లిపోయాడు. అంతే రావడం, ప్రజలను రెచ్చగొట్టేలా మాట్లాడడం. తిరిగి వెళ్లడం. ఇవాళ ఇంకో మరో మాట కూడా అన్నాడు. వైయస్సార్‌ విగ్రహాన్ని తొలగించకుండా, మహాత్మాగాంధీ, ఇందిరాగాంధీ, జవహర్‌లాల్‌ నెహ్రూ విగ్రహాలను తొలగించారని ఆరోపించారు. ఇది అబద్ధం. కార్పొరేషన్‌ అధికారులు ఏ ఒక్క విగ్రహం కూడా తొలగించలేదు. ఇది వాస్తవం. పంచాయతీ ఆఫీస్‌ ముందు ఉన్న జాతీయ నాయకుల చిన్న సైజ్‌ విగ్రహాలను పంచాయతీ సెక్రటరీ తీసి పక్కన పెట్టారు. పనులు పూర్తయ్యాక, వాటిని తిరిగి ఏర్పాటు చేస్తారు. వైయస్సార్‌గారి విగ్రహం కూడా రోడ్లకు అడ్డమైతే దాన్ని కూడా తొలగిస్తారు. అంతే కానీ దాన్ని తొలగించడం లేదంటూ లేనిపోని విమర్శలు చేస్తున్నారు. మేమేదో అన్యాయం చేస్తున్నట్లు మాట్లాడుతున్నారు. ఇప్పటం గ్రామంపై ఎందుకు రాజకీయం చేస్తున్నారు. ఆ గ్రామం ప్రశాంతతకు మారుపేరు. అక్కడ అన్ని కులాల వారు సయోధ్యతో ఉంటున్నారు. అక్కడికి పోయి కులాల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం ఏమిటి? గ్రామ అభివృద్ధి కోసం ఆక్రమణలు తొలగిస్తే, ప్రభుత్వాన్నే కూల్చేయాలని మాట్లాడే అజ్ఞాని అని మాట్లాడే వ్యక్తి పవన్‌కళ్యాణ్‌.

ఇదే నా సవాల్‌:
అంతే కాకుండా ఇళ్లు మొత్తం పడగొట్టారని ఆరోపిస్తున్నారు. నేను ఛాలెంజ్‌ చేస్తున్నాను. ఈనాడు పత్రికలో రాసినట్లు ఒక్క ఇల్లు కూడా కూలగొట్టలేదు. కేవలం ప్రహరీలు మాత్రమే. రోడ్డు కబ్జా చేసి కట్టిన టాయిలెట్లు, మెట్లు మాత్రమే తొలగించారు.దాన్ని కూడా పెద్దగా చూపుతూ, మొత్తం ఇళ్లను కూల్చినట్లు రాశారు. దీన్ని ప్రజలు అర్ధం చేసుకోవాలని కోరుతున్నాను.

రెక్కీ అంటూ డ్రామా:
అంతే కాదు, మొన్న ఒక రెండు రోజులు మరో ఎపిసోడ్‌ నడిపారు. పవన్‌ను అంతమొందించడానికి కుట్ర జరుగుతోందని ఆరోపించారు. ఎవరు నిర్వహించారు రెక్కీ? గుజరాత్‌ వాళ్లకు రూ.250 కోట్లు ఇచ్చి రెక్కీ నిర్వహించారట. ఆయనకు ప్రత్యేక భద్రతా బలగాలు కావాలట. దానిపై ఎల్లో మీడియాలో పదే పదే డిస్కషన్‌లు పెట్టి, ఊదరగొట్టారు. కానీ చివరకు తేలింది ఏమిటి? తెలంగాణ పోలీసులు వాస్తవాలు చెప్పారు. కారుమీద గుజరాత్‌ నెంబర్‌ ఉంటే, వాళ్లు గుజరాత్‌ వాళ్లు కారని, ఎదురుగా పబ్‌లో తాగిన వారు, దాని ముందు డ్యాన్స్‌లు వేశారని తేల్చారు. నిజానికి గుజరాత్‌ వాళ్లకు రూ.250 కోట్లు ఇవ్వడం ఎందుకు? అందులో సగం పవన్‌కళ్యాణ్‌కు ఇస్తే, తోక ఊపుకుంటూ తనే వస్తాడు. ప్యాకేజీ ఇస్తే ఇంటి చుట్టూ తిరుగుతాడు. దాన్ని లేనిపోని హైప్‌ చేసి, ప్రభుత్వానికి అంటగట్టి అర్ధంలేని విమర్శలు చేస్తున్నారు.

గ్రాఫ్‌ పెంచుకునే ప్రయత్నం:
పవన్‌కళ్యాణ్‌ ఈ పక్కన. చంద్రబాబు ఆ పక్కన. ఆయన మీద నిన్న నందిగామలో ఎవరో రాయి విసిరారట. అదో పెద్ద హత్యాయత్నం అట. చంద్రబాబు మీద రాళ్లు వేశారు. పవన్‌పై రెక్కీ చేశారని ప్రచారం చేస్తున్నారు. కానీ అవన్నీ ఫాల్స్‌. ఆ ఫాల్స్‌ మాటలతో ప్రజలను నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు. ఆ విధంగా ప్రజల్లో తమకు పడిపోతున్న గ్రాఫ్‌ను పెంచుకోవాలని చూస్తున్నారు. ప్రజలు ఇవన్నీ గమనించాలి. ఇప్పటంలో అభివృద్ధి పనులు ఎప్పటి నుంచో జరుగుతున్నాయి. పవన్‌ సభకు భూములు ఇస్తే కక్ష సాధించడం ఏమిటి? ఇవాళ వాస్తవానికి తెలుగుదేశం పార్టీ వారికి కూడా అన్ని పథకాలు వర్తింప చేస్తున్నాం. నా నియోజకవర్గంలో నేనే స్వయంగా చూశాను. టీడీపీ వారికి కూడా పెన్షన్లు ఇస్తున్నాం. అక్రమ కట్టడాలు, రోడ్డు కబ్జాలను తొలగిస్తే, ప్రభుత్వాన్ని కూల్చేయాలని మాట్లాడుతున్న పవన్‌కళ్యాణ్‌ రాజకీయాలకు పనికి రాడని, ఆయన ఒక అజ్ఞాని అని ప్రజలు గుర్తించాలి. ఆయన అసత్య ప్రచారాలు నమ్మొద్దని కోరుతున్నాం.

మీడియా ప్రశ్నలకు సమాధానంగా..
ప్రిప్లాన్‌తో ఇద్దరూ కుట్ర:
పవన్‌కళ్యాణ్‌పై రెక్కీ అనేది వాస్తవం కాదని తెలంగాణ పోలీసులు తేల్చారు కదా? అది జరిగింది హైదరాబాద్‌లో. కాబట్టి మేము పోలీసులను ప్రభావితం చేసే అవకాశమే ఉండదు కదా? హైదరాబాద్‌లో తెలంగాణ పోలీసులు పవన్‌కళ్యాణ్‌ రెక్కీ అన్నది అవాస్తవమని తేల్చి చెప్పారు. అయినా ఇవాళ కూడా దాన్నే ప్రస్తావించి, నన్ను చంపడానికి రూ.250 కోట్లు ఇచ్చి రెక్కీ చేశారని పిచ్చి మాటలు మాట్లాడారు.
మరోవైపు చంద్రబాబు కూడా తనను చంపడానికి రాళ్లతో దాడి చేశారని చెప్పడం.. అన్నీ బోగస్‌. ఈ రెండూ ప్రిప్లాన్‌ ప్రకారం చేస్తున్న కుట్రలు మాత్రమే. జగన్‌మోహన్‌రెడ్డిపై బురద చల్లడం కోసం అద్బుత కధనాలు చెబుతున్నారు. కొంచెం ఇంగిత జ్ఞానంతో ఆలోచిస్తే, అర్ధం అవుతుంది.

స్థిరత్వం లేని పవన్‌:
గోడలు పడగొడితేనే ఈ ప్రభుత్వాన్ని పడగొట్టాలని, ఇడుపులపాయలో హైవే నిర్మిస్తానని పవన్‌ అంటున్నారు. ఆయనలో ఏదో కొంత తేడా ఉంది. దాన్ని సరిచేసుకోవాలి. అది రాజకీయాల్లో మంచిది కాదు. మొన్న కూడా చూశారు. కాళ్లకు వేసుకోవాల్సినవి చేతిలో పట్టుకున్నాడు. పిచ్చి పిచ్చిగా మాట్లాడారు. అందుకే పవన్‌ వెంట ఉన్నవారికి, వారి సైకో ఫ్యాన్స్‌కు విజ్ఞప్తి చేస్తున్నాను. కుక్క తోక పట్టుకుని గోదావరి ఈదవద్దు. పవన్‌కు స్థిరత్వం లేదు. సరైన రాజకీయాలు చేయండి. 175 సీట్లు పోటీ చేయండి. మాకేం అభ్యంతరం లేదు. ఓట్లు చీలనివ్వను. ఏమిటా మాటలు?

ఆ డబ్బు ఎందుకు ఇవ్వలేదు?:
నేను ఒకటే అడుగుతున్నాను. మార్చి 14న ఇప్పటం సభలో పవన్‌ ప్రకటించారు. గ్రామానికి రూ.50 లక్షలు ఇస్తానని ఎందుకు ఇవ్వలేదు? దాన్ని ఆ గ్రామస్తులు కూడా గుర్తు చేశారు. ఇవాళ హడావిడిగా వచ్చాడు. వాహనం మీద కూర్చుని ఊరేగింపుగా వచ్చాడు. పిచ్చిగా మాట్లాడాడు. ఇది సినిమా అనుకుంటున్నాడో. షూటింగ్‌ అనుకుంటున్నాడో. ఇవన్నీ పిచ్చి చేష్టలు. వాటిని నమ్మి యువకులు మోసపోకూడదు.

రాజకీయాలకు పనికిరాడు:
పవన్‌కళ్యాణ్‌ రాజకీయాలకు పనికి వచ్చే మనిషి కాదు. ఆయన ఒక ఉన్మాది. ఆయనను నమ్మి ఎవరైనా వెళ్తే జీవితాంతం ఇబ్బంది పడతారు. అసలు వైయస్సార్‌సీపీలో గుండాలు ఎవరున్నారు? పవన్‌ ఇంటి దగ్గర్లో ఉన్న పబ్‌లో తాగిన ఇద్దరు, ఆయన ఇంటి దగ్గర డ్యాన్స్‌ చేస్తే, వారి నీడ చూసి భయపడిన పవన్, మాపై విమర్శలు, ఆరోపణలు చేయడం ఏమిటి? రెక్కీ చేశారని చెప్పడం ఏమిటి? నీ దగ్గరే గుండాలు ఉన్నారు. మాకు వారి అవసరం లేదు. మీ అబద్దాలను ఎవరు నమ్ముతారు? కక్ష కట్టి ఇళ్లు కూల్చారా? మళ్లీ చెబుతున్నా. సవాల్‌ చేస్తున్నా. ఈనాడుకు చెబుతున్నా. రామోజీరావుకు చెబుతున్నా.. ఇప్పటంలో ఒక్క ఇల్లు కూడా కూల్చలేదు. కేవలం ప్రహరీలు మాత్రమే కూల్చారు. అయినా ఇళ్లు కూల్చారని చెప్పడం దారుణం.

LEAVE A RESPONSE