– దర్శి ఇస్తేనే చేస్తానని జగన్‌కు స్పష్టీకరణ
– ఒంగోలు నుంచి పోటీ చేయమని సుధీర్‌కు జగన్ ఆఫర్
– అసలు పోటీకే దూరం కావాలని శిద్దా కుటుంబ నిర్ణయం?
– ఆస్థాన పండితుల సలహా మేరకే శిద్దా నిష్క్రమణ
– తాజాగా బాలినేనితో తండ్రీకొడుకల భేటీ
– శిద్దాపై పనిచేయని జగన్ విభజించు పాలించు సూత్రం
– బాలినేనిని బలహీనపరిచేందుకే తెరపైకి సుధీర్ పేరు
– బాలినేని బలమేమిటో తెలిసిన శిద్దా కుటుంబం
– అందులో అసలు పోటీకే విముఖత వ్యక్తం
– బాలినేని నిర్ణయం కోసం శిద్దా ఎదురుచూపులు
(మార్తి సుబ్రహ్మణ్యం)
వైసీపీ అధినేత-ఏపీ సీఎం జగన్ విభజించే పాలించే సూత్రం.. మాజీ మంత్రి శిద్దా రాఘవరావు విషయంలో అడ్డం తిరిగింది. మాజీ మంత్రి, తన సమీప బంధువైన బాలినేని శ్రీనివాసరెడ్డి హవాకు చెక్ పెట్టేందుకు, జగన్ వ్యూహాత్మకంగా తెరపైకి తెచ్చిన శిద్దా కుటుంబం… జగన్ వ్యూహంలో చిక్కుకోకుండా, లౌక్యంగా తప్పుకోవడం ప్రకాశం జిల్లా రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.
కొద్దిరోజుల క్రితం మాజీ మంత్రి శిద్దా రాఘవరావు- ఆయన తనయుడు,టిటిడి బోర్డు సభ్యుడైన సుధీర్‌లకు తాడేపల్లి నుంచి పిలుపు వచ్చింది. వరసగా రెండురోజులు వారు పార్టీ అధినేత, సీఎం జగన్‌తో భేటీ అయ్యారు. ఒకసారి మార్కాపురం, మరోసారి గిద్దలూరు వెళ్లాలని సూచించిన జగన్.. తాజాగా ఒంగోలు అసెంబ్లీ నుంచి బరిలోకి దిగాలని, శిద్దా రాఘవరావు తనయుడైన సుధీర్‌కు సూచించారు. తాను ఇంకా 30 ఏళ్లు రాజకీయాల్లో ఉంటానని, మీ కొడుకు సుధీర్ భవిష్యత్తును తనకు వదిలేయాలని జగన్.. తన వద్దకు వచ్చిన శిద్దా రాఘవరావుకు సూచించినట్లు పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.
ప్రస్తుతం మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, ఒంగోలు అసెంబ్లీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. బాలినేని-మాగుంట-శిద్దా-కరణం బలరాం నలుగురూ ఒకే వర్గం అన్నది బహిరంగ రహస్యమే. వీరిని విడదీయడం ద్వారా, బాలినేనిని బలహీనం చేయాలన్నదే జగన్ వ్యూహమని వైసీపీ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ఆ వ్యూహంతోనే సుధీర్‌ను ఒంగోలుకు తీసుకువచ్చి, బాలినేనిని గిద్దలూరు పంపించాలన్నది జగన్ ఎత్తుగడ అని చెబుతున్నారు.
అయితే బాలినేని మాత్రం తాను ఒంగోలు తప్ప ఎక్కడా పోటీ చేసేది లేదని.. అది కూడా మాగుంటతోపాటు, తాను సిఫార్సు చేసిన వారికి టికెట్లు ఇస్తేనే పోటీ చేస్తానని జగన్‌కే నేరుగా చెప్పినట్లు తెలుస్తోంది. ఫలితంగా ఒంగోలు పార్లమెంటు సీట్ల వ్యవహారం పెండింగ్‌లో పడింది. అయితే అటు సీఎం జగన్, ఇటు బాలినేని మధ్య ప్రాంతీయ సమన్వయకర్త విజయసాయిరెడ్డి నలిగిపోతున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
కాగా తమ కుటుంబసభ్యులతో చర్చించి చెబుతామని, శిద్దా సీఎం జగన్‌కు స్పష్టం చేశారు. నిర్ణయం ఏదైనా పాజిటివ్‌గా ఉండాలని జగన్ వ్యాఖ్యానించారట. ఆ ప్రకారంగా కుటుంబసభ్యులు, శ్రేయోభిలాషులతో చర్చించిన తర్వాత.. దర్శి నుంచి టికెట్ ఇస్తే పోటీ చేయాలని, లేకపోతే అసలు పోటీకి దూరంగా ఉండాలని సూచించినట్లు సమాచారం.
బాలినేని సహకారం లేకపోతే, జిల్లాలో ఎక్కడా గెలిచే పరిస్థితి లేదని స్పష్టంగా తెలిసిన శిద్దా కుటుంబం.. అన్ని పరిస్థితులను అంచనా వేసుకుని, ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఒంగోలులో మేయర్ సహా, పార్టీ కార్పొరేటర్లంతా బాలినేని వర్గీయులే కాబట్టి.. వారి సహకారం లేనిదే తాము గెలిచే పరిస్థితులు లేవన్నది శిద్దా కుటుంబానికి స్పష్టంగా తెలుసు.
పైగా ఎంపి మాగుంట శ్రీనివాసరెడ్డి సైతం, పోటీకి దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నారన్న వార్తల నేపథ్యంలో.. తాము వారందరినీ వ్యతిరేకించి పోటీకి దిగడం వల్ల, ఎలాంటి ప్రయోజనం ఉండదని శిద్దా ఒక అంచనాకు వచ్చారంటున్నారు. అందరినీ ధిక్కరించి పోటీకి దిగితే.. ప్రభుత్వ వ్యతిరేకత స్పష్టంగా ఉన్న ఈ సమయంలో, ఓటమి కొనితెచ్చుకోవడమేనని శిద్దా అనుచరులు భావిస్తున్నారు.
కాగా తాజా పరిస్థితులపై చర్చించేందుకు శిద్దా,ఆయన తనయుడు సుధీర్ హైదరాబాద్‌లో ఉన్న బాలినేనితో భేటీ అయినట్లు తెలుస్తోంది. తనకు దర్శి ఇస్తే పోటీ చేస్తానని, లేకపోతే అసలు పోటీనే చేయకూడదని భావిస్తున్నట్లు తండ్రీకొడుకులు, బాలినేనికి స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. అయితే మాగుంటకు సీటు ఇప్పించేలా ప్రయత్నిద్దామని, అది కాకపోతే అంతా కలసి సమిష్టి నిర్ణయం తీసుకుందామని బాలినేని చెప్పినట్లు తెలుస్తోంది.
దానితో శిద్దా కుటుంబం.. బాలినేని తీసుకునే నిర్ణయం కోసం ఎదురుచూస్తున్నట్లు తెలుస్తోంది. కాగా దీనిపై వివరణ కోరేందుకు శిద్దా రాఘవరావు, ఆయన తనయుడు సుధీర్‌కు పలుసార్లు ఫోన్ చేసినా స్పందించలేదు. కాగా ఇప్పటి సమాచారం ప్రకారం.. ఎంపి మాగుంటకు వైసీపీ సీటు ఇవ్వకపోతే, బాలినేనితోపాటు… మాగుంట, కరణం బలరాం, శిద్దా కలసి మూకుమ్మడిగా ఒకేసారి టీడీపీలో చేరే అవకాశాలు లేకపోలేదని తెలుస్తోంది.