– భట్టి విక్రమార్కపై పత్రికల్లో వస్తున్న కథనాల వెనుక ముఖ్యమంత్రి
– కేబినెట్ సహచరుడిపైనే లీకులు ఇప్పిస్తున్న సీఎం
– సీఎం తీరును భట్టి ఎందుకు ప్రశ్నించడం లేదు?
– భట్టి మాటలతో అది నిజమని తేలిపోయింది
– ఎమ్మెల్సీ డా. దాసోజు శ్రవణ్
హైదరాబాద్: సింగరేణి బొగ్గు గనుల టెండర్ల వ్యవహారంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన బామ్మర్ది సంతోషం కోసం, తన అనుయాయులకు మేలు చేకూర్చేలా భారీ కుంభకోణానికి తెరలేపారని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ డాక్టర్ దాసోజు శ్రవణ్ కుమార్ సంచలన ఆరోపణలు చేశారు. శనివారం తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మాటలే ఈ స్కామ్ నిజమని నిరూపిస్తున్నాయని పేర్కొన్నారు.
కుంభకోణం నిరూపితమైంది: సింగరేణి టెండర్ల వ్యవహారంపై భట్టి విక్రమార్క చేస్తున్న సమర్థనలు చూస్తుంటే, ఇందులో భారీ స్కామ్ జరిగిందనేది స్పష్టమవుతోంది. రేవంత్ రెడ్డి తన బామ్మర్ది కళ్లల్లో సంతోషం చూడటం కోసం బొగ్గు గనులను అప్పనంగా కట్టబెట్టాలని చూశారు. టెండర్లు రద్దు చేశామని చెబుతున్న భట్టి, అసలు ఏ కారణంతో రద్దు చేయాల్సి వచ్చిందో ప్రజలకు సమాధానం చెప్పాలి.
అంతా రేవంత్ రెడ్డి స్క్రీన్ ప్లే: భట్టి విక్రమార్కపై పత్రికల్లో వస్తున్న కథనాల వెనుక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డే ఉన్నారని శ్రవణ్ ఆరోపించారు. “భట్టిపై వార్తలు వేయించిన వ్యక్తి ఎవరు? ఆ కథ, స్క్రీన్ ప్లే మొత్తం రేవంత్ రెడ్డిదే. తన సొంత కేబినెట్ సహచరుడిపైనే లీకులు ఇప్పిస్తున్న సీఎం తీరును భట్టి ఎందుకు ప్రశ్నించడం లేదు? భట్టి ఎవరికి భయపడుతున్నారు?” అని నిలదీశారు.
హరీష్ రావుపై కక్షసాధింపు: బొగ్గు కుంభకోణాన్ని ఆధారాలతో సహా హరీష్ రావు బయటపెట్టగానే, ప్రభుత్వం తట్టుకోలేక సిట్ నోటీసులతో ఇబ్బందులకు గురిచేస్తోందని మండిపడ్డారు. ఒకే కేసుపై రెండు సిట్లు ఏర్పాటు చేయడం హాస్యాస్పదమని, ప్రభుత్వం నడుపుతోంది పోలీసులా లేక ప్రజాప్రతినిధులా అని ప్రశ్నించారు.
కేసీఆర్ పై అనుచిత వ్యాఖ్యలు: భట్టి తన 40 ఏళ్ల రాజకీయ జీవితం గురించి మాట్లాడుతున్నారు, కానీ 50 ఏళ్ల అనుభవం ఉన్న కేసీఆర్ ని సీఎం రేవంత్ రెడ్డి నోటికొచ్చినట్లు తిడుతుంటే ఎందుకు మౌనంగా ఉంటున్నారని ప్రశ్నించారు. ఎదుటివారిని గౌరవించినప్పుడే మీకు గౌరవం దక్కుతుందని హితవు పలికారు.
దోపిడీయే ఏకైక అజెండా: “తెలంగాణ రైజింగ్ – పాలన ఫాలింగ్” అన్నట్లుగా రాష్ట్ర పరిస్థితి తయారైందని శ్రవణ్ విమర్శించారు. గత రెండేళ్లలో ఒక్క విధానపరమైన పాలసీ రాలేదని, కేవలం “దోపిడీ పాలసీ” మాత్రమే నడుస్తోందని ఆరోపించారు. గాదె కింద పందికొక్కుల్లా ప్రభుత్వ ఖజానాను దోచుకుంటున్నారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
రియల్ ఎస్టేట్ మైండ్ సెట్: సీఎం రేవంత్ రెడ్డి రియల్ ఎస్టేట్ మైండ్ సెట్ తో పాలన సాగిస్తున్నారని, రాష్ట్రంలోని ప్రభుత్వ ఆఫీసులను కూడా రియల్ ఎస్టేట్ ఆఫీసులుగా మారుస్తారేమో అని ఎద్దేవా చేశారు. టీ-హబ్‌ను రిజిస్ట్రేషన్ ఆఫీసుగా మార్చాలని చూడటమే అందుకు నిదర్శనమన్నారు. పదేళ్లు సీఎంగా ఉండాలని కలలు కనే రేవంత్ రెడ్డి, ఒళ్ళు దగ్గర పెట్టుకుని ప్రజల కోసం పని చేయాలని, అక్రమాలకు పాల్పడితే కాలమే సమాధానం చెబుతుందని శ్రవణ్ హెచ్చరించారు.