January 24, 2026

స్పెష‌ల్ ఫ్లైట్ ర‌హ‌స్య జీవోలు బ‌య‌ట‌పెట్టండి

– బిల్లుల ఇన్‌వాయిస్ లు బ‌హిర్గ‌తం చేయాలి
– 5 రోజుల్లో ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ 11 స‌ర్వీసులు
: వైయ‌స్సార్సీపీ రాష్ట్ర అధికార ప్ర‌తినిధి పుత్తా శివ‌శంక‌ర్‌ రెడ్డి డిమాండ్‌

తాడేప‌ల్లి: సీఎం చంద్ర‌బాబుతో పాటు డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, మంత్రి నారా లోకేష్ లు ప్ర‌త్యేక విమానాలు, హెలిక్యాప్ట‌ర్ల‌లో తిరిగే ఖ‌ర్చుల ఇన్‌వాయిస్‌లు, బిల్లుల చెల్లింపుల‌కు సంబంధించిన ప్ర‌భుత్వం జారీ చేసిన ర‌హ‌స్య జీవోల‌ను బ‌య‌ట‌పెట్టాల‌ని వైయ‌స్సార్సీపీ రాష్ట్ర అధికార ప్ర‌తినిధి పుత్తా శివ‌శంక‌ర్‌ రెడ్డి డిమాండ్ చేశారు.

తాడేప‌ల్లిలోని పార్టీ కేంద్ర కార్యాల‌యంలో ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ దేశంలోని ఏ ముఖ్య‌మంత్రీ, ఏ బిజినెస్ మ్యాన్ కూడా సీఎం చంద్ర‌బాబు, డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, మంత్రి నారా లోకేష్‌లు మాదిరిగా హైద‌రాబాద్ నుంచి షటిల్ స‌ర్వీసులు చేయ‌ర‌ని, వారం వారం హైద‌రాబాద్‌లో ఏం ప‌ని ఉంటుంద‌ని ఆయ‌న ప్ర‌శ్నించారు. చంద్ర‌బాబు విమాన ప్ర‌యాణాల‌కు ఏడాదిలో రూ. 56 కోట్లు ఖ‌ర్చు చేశార‌ని జీఏడీ వెల్ల‌డించింద‌ని, అంత‌క‌న్నా ఎక్కువ‌గా ప్ర‌త్యేక విమానాల్లో తిరుగుతున్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, నారా లోకేష్‌ల‌కు ఎంత ఖ‌ర్చు అయ్యుంటుంద‌ని ప్ర‌శ్నిస్తూ, వారికి ఆ డ‌బ్బులు ప్ర‌భుత్వం కాక ఎక్క‌డి నుంచి వ‌చ్చిందో వెల్ల‌డించాల‌ని డిమాండ్ చేశారు.

డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఈనెల 19వ తేదీ నుంచి 23వ తేదీ వ‌ర‌కు రోజూ హైద‌రాబాద్ – విజ‌య‌వాడ మ‌ధ్య ప్ర‌త్యేక విమానాల్లోనే తిరిగాడ‌ని, ఒకే ఒక్క రాత్రి మాత్ర‌మే విజ‌య‌వాడ‌లో బ‌స చేశాడ‌ని శివశంక‌ర్‌ వెల్ల‌డించారు. ఈ ఐదు రోజుల్లోనే 11 సర్వీసెస్ రాను పోను, మధ్యలో ఒక హెలికాప్టర్ సర్వీస్.. ఉప‌యోగించుకున్నాడ‌ని చెప్పారు. ప‌వ‌న్ క‌ళ్యాణ్ 21వ తేదీన మధ్యాహ్నం 2 గంటలకి వచ్చి మళ్లీ 7 గంటలకి వెళ్లిపోయాడ‌ని, కేవలం నాలుగు గంటలే ఇక్కడ ఉండి వెళ్లారని చెప్పారు.

మళ్లీ 22వ తేదీన ఉద‌యం 10.42 గంటలకు ఇక్కడ దిగి, ఇక్కడి నుంచి ప్రత్యేక హెలికాప్టర్ లో కోటప్పకొండకి వెళ్లి, అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి ఆ ఒక్క రోజు రాత్రి మాత్ర‌మే విజ‌య‌వాడ‌లో స్టే చేసి మళ్లీ య‌థావిధిగా త‌ర్వాత రోజు హైదరాబాద్‌కి వెళ్లిపోయాడ‌ని తెలిపారు. ఆంధ్ర రాష్ట్రంలో పరిపాలన చేయడానికి వారికి అధికారం ఇస్తే, రాష్ట్రంలో ఒక్క రోజు కూడా నిద్రించడానికి తీరిక లేదా? సౌకర్యాలు లేవా? అని ప్ర‌శ్నించారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ని టూరిస్ట్ ప్లేస్‌గా మార్చేసి ప్ర‌తిరోజూ ప్ర‌త్యేక విమానాలు, హెలిక్యాప్ట‌ర్ల‌లో తిర‌గ‌డానికి వారికి ప్ర‌భుత్వం నుంచి కాకుండా డ‌బ్బులు ఎలా వ‌చ్చాయో చెప్పాల‌ని డిమాండ్ చేశారు.

 

Total Visitors: 2,517,146