Suryaa.co.in

Andhra Pradesh

సారూ…పోస్టల్‌ బ్యాలెట్‌పై అంత గోప్యత ఎందుకు?

-అసలు రాష్ట్రంలో ఎంతమంది ఉద్యోగులను ఎలక్షన్‌ విధుల్లోకి తీసుకున్నారు?
-ఎంత మందికి ఫారం 12 ఇచ్చారు… ఎంతమంది సబ్మిట్‌ చేశారు?
-ఎందుకని పోస్టల్‌ బ్యాలెట్‌ ఓటింగ్‌ను చీకట్లో పెడుతున్నారు?
-మొదటిరోజు రాష్ట్రంలో పోస్టల్‌ బ్యాలెట్‌ ఓటింగ్‌ పర్సంటేజ్‌ ఎంత?
-రాష్ట్రంలో ఎన్నికల ప్రక్రియ పారదర్శకంగా నిర్వహించడం మీ బాధ్యత కాదా?
-ఫార్మాట్‌ 1లు చెప్పకుంటే రేపు కౌంటింగ్‌ ఎలా ట్యాలీ అవుతుంది?
-ప్రతిపక్ష పార్టీల అభ్యర్థులపై దాడుల్లో ఏం చర్యలు తీసుకున్నారు?
-వైసీపీ దుష్ప్రచారాలు ఎందుకు అరికట్టడం లేదు?
-నిజాలు చెబుతుంటే మాపై సీఐడీ దర్యాప్తు ఎంతవరకు సమంజసం?
-రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారిపై టీడీపీ నేత కొమ్మారెడ్డి పట్టాభిరామ్‌ ప్రశ్నల వర్షం

మంగళగిరి టీడీపీ ప్రధాన కార్యాలయంలో ఆదివారం టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభి రామ్‌ మీడియా సమావేశంలో మాట్లాడారు. పోస్టల్‌ బ్యాలెట్‌ ఓటింగ్‌లో గోప్యతపై ఏపీ ఎన్నికల ప్రధాన అధికారి ముకేష్‌కుమార్‌ మీనాకు ప్రశ్నల వర్షం కురిపించారు. పోస్టల్‌ బ్యాలెట్‌పై అంత గోప్యత ఎందుకని ప్రశ్నించారు. అసలు పోస్టల్‌ బ్యాలెట్‌పై అన్ని పార్టీలకు అధికారికంగా సమాచారం ఇచ్చారా? రాష్ట్రంలో ఎంతమంది ఉద్యోగులను ఎలక్షన్‌ విధుల్లోకి తీసుకున్నారు? జిల్లాల వారీగా ఎంతమందిని విధుల్లోకి తీసు కున్నారో ఆ జాబితాను ఎందుకని బయటకు చెప్పడం లేదు? ఎంతమందికి ఫారం 12 ఇచ్చారు. ఎంత మంది ఫామ్‌ 12 సబ్మిట్‌ చేశారు?

పోస్టల్‌ బ్యాలెట్‌ సెంటర్లలో అంతా గందరగోళం నెలకొంది. అక్కడ ఇక్కడ అని పోస్టల్‌ బ్యాలెట్‌ సెంటర్ల చుట్టూ ఎండలో ఉద్యోగులను తిప్పుతూ ఇబ్బంది పెడుతున్నారు. ఎందుకని పోస్టల్‌ బ్యాలెట్‌ ఓటింగ్‌ను దాచి పెడుతున్నారు? మీ వైఫల్యాలను కప్పి పుచ్చుకోవడానికి ఓటింగ్‌ పర్సెంటేజ్‌ దాచిపెడుతున్నారా? అసలు ఎన్ని ఫార్మాట్‌ 1లు మీ దగ్గరకు వచ్చాయి. మొదటిరోజు రాష్ట్రంలో పోస్టల్‌ బ్యాలెట్‌ ఓటింగ్‌ పర్సంటేజ్‌ ఎంత? రాష్ట్రంలో ఎన్నికల ప్రక్రియ సజావుగా, పారదర్శకంగా నిర్వహించడం మీ బాధ్యత కాదా? ఫార్మాట్‌ 1లు చెప్పకుంటే రేపు కౌంటింగ్‌ ఎలా ట్యాలీ అవుతుంది. ఏం చూసి ట్యాలీ చేసుకోవాలి? పోస్టల్‌ బ్యాలెట్‌ సమాచారం కోసం ఎన్నిసార్లు ఎన్నికల కమిషన్‌ చుట్టూ మా పార్టీ నేతలు తిరగాలి. తక్షణమే పోస్టల్‌ ఓటింగ్‌పై పూర్తి సమాచారాన్ని పబ్లిక్‌ డొమైన్‌లో పెట్టండి సార్‌ అని విజ్ఞప్తి చేశారు.

ఫారం 12 సీక్రెట్‌ డాక్యుమెంటా?
వారంలో ఎన్నికలు ఉన్నాయి. విస్తృతంగా ప్రచారాలు జరుగుతున్నాయి. మరోవైపు ఫారం 12 సమర్పించి పోస్టల్‌ బ్యాలెట్‌ ఓటింగ్‌ను ఓటర్‌ ఫెసిలిటేషన్‌ సెంటర్‌లలో ఉద్యోగస్తులు వినియోగించుకునేందుకు ఏర్పాటు చేశారు. పోస్టల్‌ బ్యాలెట్‌ ఓటింగ్‌ను చీకట్లో ఎందుకు పెడుతున్నారు? పోస్టల్‌ బ్యాలెట్‌ ఓటింగ్‌పై ఎందుకు అంత గోప్యం పాటిస్తున్నారో సీఈఓ సమాధానం చెప్పాలి. పోస్టల్‌ బ్యాలెట్‌ను ఎందుకు దాచిపెడుతున్నారు అదేమైనా సీక్రెట్‌ డాక్యుమెంటా?

పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లకు విలువ లేదా?
ఎన్నికల కమిషన్‌ ఇచ్చిన సర్క్యులర్‌ ఏంటి.. రాష్ట్రంలో అమలవుతున్నది ఏంటి? ప్రతి నియోజకవర్గంలోని ఆర్వో పరిధిలోని ఫెసిలిటేషన్‌ సెంటర్లలో ఎన్ని పోస్టల్‌ ఓట్లు నమోదు అయ్యాయి అనేది ఫార్మాట్‌ 1లో నింపాలి కదా. అసలు ఎన్ని ఫార్మాట్‌ 1లు మీ దగ్గరకు వచ్చాయి. అసలు పోస్టల్‌ ఓట్లను మీరు పట్టించు కుంటున్నారా? ఉద్యోగస్తుల ఓట్లు, పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లకు మీ దృష్టిలో విలువ లేదా? పోస్టల్‌ ఓట్లను మీరు కౌంటింగ్‌ చేయరా? ఎందుకని దృష్టి పెట్టడం లేదని ప్రశ్నించారు. ఎంతమంది ఓటర్లు ఉన్నారో చెప్పరు, డ్యూటీలోకి ఎంతమందిని తీసుకున్నారో చెప్పరు. ఫారం 12 ఎన్ని వచ్చాయో చెప్పరు. జిల్లాల వారీగా ఆ సమాచారం రాజకీయ పార్టీలకు ఇవ్వరు. మీ చుట్టూ మా పార్టీ నాయకులు ఎన్నిసార్లు తిరగాలి సార్‌. మిమ్మల్ని బ్రతిమిలాడుకోవాలా? పోస్టల్‌ బ్యాలెట్‌ సమాచారాన్ని ఎందుకు తొక్కి పెడుతున్నారు. పోస్టల్‌ బ్యాలెట్‌ ఓటింగ్‌ సాయంత్రం ఆరు గంటలకు క్లోజ్‌ అయినా ఓటింగ్‌ శాతాన్ని ఎందుకని చెప్పలేదు అని నిలదీశారు.

పబ్లిక్‌ డొమైన్‌లో పెట్టాలి
అసలు ఏపీలో ఎంతమందికి పోస్టల్‌ బ్యాలెట్‌ వినియోగించుకునే అవకాశం కల్పించారు? ఎందుకని దాన్ని దాస్తున్నారు. ఎంతమంది ఓటర్లు ఉన్నారో కూడా తెలియకూడదా? వెంటనే సీఈఓ మీనా ఈ సమాచారాన్ని బయట పెట్టాలి. ఉద్యోగులను మండుటెండలో కాళ్లు అరిగెలా తిప్పుతున్నారు. ఫారం 12 ఇచ్చిన ప్రదేశంతో సంబంధం లేకుండా ఆ ఉద్యోగస్తులకు ఓటు ఎక్కడైతే ఉందో అక్కడే ఓటు వినియోగించుకునే అవకాశం కల్పించాలి. తక్షణమే పోస్టల్‌ ఓటింగ్‌పై పూర్తి సమాచారాన్ని పబ్లిక్‌ డొమైన్‌లో పెట్టాలి. ప్రతిరోజూ మీడియా కు ఆ సమాచారాన్ని విడుదల చేయాలని కోరారు.

సీఐడీ ఎంక్వైరీ ఎలా ఎదుర్కోవాలో తెలుసు
రాష్ట్రంలో ప్రతిపక్ష అభ్యర్థులపై చాలా దాడులు జరుగుతున్నాయి. మీరు ఎంతమందిపై చర్యలు తీసుకు న్నారు? ఎన్ని కేసులు పెట్టించారు? ఇవాళ రాష్ట్రంలో జగన్‌ రెడ్డి ల్యాండ్‌ గ్రాబింగ్‌ యాక్ట్‌తో ప్రజలు చాలా నష్టపోతున్నారు. ఆ నిజాలు తెలియజేయడం తప్పని వైసీపీ నుంచి ఫిర్యాదు రాగానే మీరు సీఐడీ ఎంక్వైరీ వేశారు. చట్టపరంగా దాన్ని ఎలా ఎదుర్కోవాలో మాకు తెలుసు. దానికి మేము భయపడం.

పెన్షన్లపై ఈసీ ఆదేశాలు పాటించరా…
ఎలక్షన్‌ కమిషన్‌ ఇచ్చిన సర్క్యులర్‌లో ఇంటింటికి వెళ్లి పింఛన్లు ఇవ్వొద్దని ఎక్కడైనా ఉందా? పింఛన్‌ దారులు ఇబ్బంది పడకుండా సజావుగా ప్రక్రియను కొనసాగించాలని చెప్పింది. కేవలం వాలంటీర్లను మాత్రమే దూరం పెట్టాలని చెప్పింది. ప్రత్యామ్నాయ మార్గాలను చూసుకోమని చెప్పంది. దాన్నే మేము ప్రశ్నించాం. ఎలక్షన్‌ కమిషన్‌ అంత స్పష్టంగా ఆదేశాలు ఇచ్చినా ఇక్కడ ఉన్న చీఫ్‌ సెక్రటరీ జవహర్‌ రెడ్డి, వైసీపీకి కొమ్ముకాస్తున్న కొంతమంది అధికారుల వల్ల వృద్ధులు అకారణంగా ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. అదే మేము చెబుతున్నాం.

వైసీపీ దుష్ప్రచారంపై ఎందుకు సీఐడీ కేసు పెట్టలేదు?
ఇవాళ వైసీపీ ఆధ్వర్యంలో రకరకాలుగా వాయిస్‌ కాల్స్‌, మెసేజ్‌లతో పింఛన్లను టీడీపే అడ్డుకుందని దుష్ప్ర చారం చేస్తుంటే దానిపై సీఐడీ ఎందుకు కేసు పెట్టడం లేదు. దానిపై ఫిర్యాదు చేశాం కదా. మేము నిజాలు చెబుతుంటే మాపై సీఐడీ కేసులు పెడుతున్నారు. మరో వైపు మీరు ఇచ్చిన ఆదేశాలు తుంగలో తొక్కి ఒక చీఫ్‌ సెక్రటరీ ఇష్టానుసారంగా వ్యవహరిస్తుండటం వల్ల వృద్ధుల ప్రాణాలు పోతుంటే ఆ నెపాన్ని టీడీపీపైకి నెట్టి విష ప్రచారం చేస్తుంటే మీరు వారిపై ఎటువంటి చర్యలు తీసుకోరా? ఎన్నికలప్పుడు ప్రజలకు నిజాలు చెప్పే హక్కు మాకు లేదా? మా నేతలు చంద్రబాబు, లోకేష్‌లు ఉన్న నిజాలే ప్రజలకు తెలియజేస్తుంటే సీఐడీ ఎంక్వైరీ వేశారు. తప్పు చేయనప్పుడు మేము భయపడం. ఎప్పటికైనా నిజానిదే గెలుపు. ఇప్పటికైనా వైసీపీ చేస్తున్న దుష్ప్రచారంపై వెంటనే ఎలక్షన్‌ కమిషన్‌ చర్యలు తీసుకోవాలి. జరుగుతున్న దాడులను ఉక్కు పాదంతో అణిచివేయాలి.

ఫారం 12 తీసుకోని వారికి అవకాశం
పోస్టల్‌ బ్యాలెట్‌పై వెంటనే దిద్దుబాటు చర్యలు చేపట్టాలి. ఎవరికైతే ఫారం 12 ఇవ్వలేదో వారికి మళ్లీ మే 7, 8 తేదీలో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 వరకు వాళ్ల సొంత నియోజకవర్గాల్లో ఉన్న ఫెసిలి టేషన్‌ సెంటర్లలో ఇచ్చే అవకాశం ఉంది. ఉద్యోగస్తులు ఈ అవకాశం వినియోగించుకోవాలి. ఎన్నికల ప్రక్రియ సజావుగా జరగడానికి టీడీపీ అన్ని రకాలుగా అధికారులకు, ఎన్నికల కమిషన్‌కు సహకరిస్తుంది. అధికారంలో ఉన్న పార్టీలాగా గుండాయిజం, రౌడీయిజం చేయడం మాకు తెలియదు. ఎన్నికల కమిషన్‌ కూడా వెంటనే మేము అడిగిన సమాచారం అందించి పారదర్శక ఎన్నికలకు సహకరించాలని కోరారు.

LEAVE A RESPONSE