Suryaa.co.in

Andhra Pradesh

ఉద్యోగి ఓటు హక్కును తిరస్కరించరాదు

-స్పాట్‌లోనే ఫారం 12ను స్వీకరించి ఓటుహక్కును కల్పించండి
-రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముకేష్‌కుమార్‌ మీనా ఆదేశం

ఎన్నికల విధుల్లో ఉన్న ఉద్యోగి ఓటుహక్కును ఎట్టి పరిస్థితుల్లోనూ తిరస్కరించవద్దని, స్పాట్‌లోనే ఫారం 12 ను స్వీకరించి అర్హులైన ఉద్యోగులందరికీ ఓటుహక్కును కల్పించాలని రాష్ట్ర ప్రధాని ఎన్నికల ప్రధానాధికారి ముకేష్‌కుమార్‌ మీనా జిల్లా ఎన్నికల అధికారులు, ఆర్వోలకు ఆదేశాలు జారీ చేశారు. ఎన్నికల విధుల్లో ఉన్న కొందరు ఓటర్లు ఫారం-12ను సకాలంలో సమర్పించలేకపోవడం వల్ల తమ ఓటును వినియోగించుకోలేక పోతున్నారనే విషయం తమ దృష్టికి వచ్చిందని తెలిపారు. ఎన్నికల విధుల్లో ఉన్న ఏ ఉద్యోగి ఓటుహక్కును తిరస్కరించరాదని తెలిపారు. అనివార్య పరిస్థితుల కారణంగా ఎన్నికల విధుల్లో ఉన్న ఓటరు మే 1వ తేదీ లోపు ఫారమ్‌-12ను సమర్పించలేకపోతే ఏ ఆర్వో పరిధిలో ఆ ఉద్యోగి ఓటరుగా నమోదు అయ్యారో వారికి సమర్పించేందుకు, ఆ ఫెసిలిటేషన్‌ కేంద్రంలో ఓటుహక్కును వినియోగించుకునేందుకు అనుమతించాలని ఆదేశించారు.

ఈ నెల 7, 8 తేదీల్లో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఆ ఫెసిలిటేషన్‌ కేంద్రాలు పనిచేస్తాయని వివరించారు. ఉద్యోగులకు మంజూరు చేసిన స్పెషల్‌ క్యాజువల్‌ లీవ్‌ ను సద్వినియోగం చేసుకుంటూ పోస్టల్‌ బ్యాలెట్‌ ఫెసిలిటీ సెంటర్లో ఓటుహక్కు అవకాశాన్ని వినియోగించు కోవచ్చన్నారు. దీనికి ఆర్వోలు అందరూ సహకరించాలని కోరారు. ఓటర్ల వివరాలు, అపాయింట్‌మెంట్‌ ఆర్డర్‌ యొక్క నిర్ణీత ధృవీకరణ తర్వాత, పోస్టల్‌ బ్యాలెట్‌ ఇప్పటికే జారీ చేయబడలేదని నిర్ధారించుకున్న తర్వాత ఓటుహక్కును వినియోగించుకోవడానికి అనుమతించాలని సూచించారు. మార్గదర్శకాల అమలులో ఏమైనా తేడా వస్తే అందుకు సంబంధిత ఆర్వోలు బాధ్యత వహించాల్సి ఉంటుందని, తక్షణమే క్రమశిక్షణా చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు.

LEAVE A RESPONSE