“ఏ గాలితో చేరితే గాలి గాంధర్వమౌతున్నదో
ఏ మోవిపై వాలితే మౌనమే మంత్ర మౌతున్నదో
ఆ శ్వాసలో నే లీనమై ఈ మోవిపై నే మంత్రమై నిను చేరనీ మాధవా” అని అన్న,
“తరలిరాదా తనే వసంతం తన దరికి రాని వనాల కోసం…” అని అన్న,
“వెన్నెల దీపం కొందరిదా? అడవిని సైతం వెలుగుకదా” అని అని అన్నమయ్యను పుణికి పుచ్చుకున్న,
“తెలవారదేమో స్వామీ…” అంటు అచ్చంగా అన్నమయ్య కృతి వంటి కృతి రాసిన,
“విరిసిన ప్రతి పువ్వు కురిసిన చిరునవ్వు…” అని చెప్పిన,
“నిగ్గుదీసి అడుగు ఈ సిగ్గులేని జనాన్ని
అగ్గితోటి కడుగు ఈ సమాజ జీవచ్ఛవాన్ని” అని అని
మహాకవి సుబ్రమణియ బారతియార్‌ను గుర్తుకు తెచ్చిన,
“గాలివాటు గమనానికి కాలిబాట దేనికి…” అని కణ్ణదాసన్ స్థాయిలో అని
“ఎప్పుడూ ఒప్పుకోవద్దురా ఓటమి
ఎప్పుడూ వదులుకోవద్దురా ఓరిమి” అని దిశానిర్దేశం చేసిన –
సీతారామశాస్త్రి జయంతి ఇవాళ.
వేటూరి తరువాత సినిమా ద్వారా వచ్చిన గొప్పకవి సీతారామశాస్త్రి. భావం, భాష, రచనా సంవిధానం వీటి పరంగా శాస్త్రిగారికి సములైన కవులు ఆయన కాలంలో సినిమాలోనే కాదు సినిమా బయట కూడా లేరు. సినిమాకు బయట ఆ, ఈ అవార్డులు పొందిన ఏ తెలుగు కవీ ఆయనకు సాటిరాడు.
తెలుగు దౌర్భాగ్యం కొద్దీ తెలుగులో ప్రముఖ కవులు(?) అయిపోయిన శివారెడ్డి, అఫ్సర్, గోపి వంటి వాళ్లకు అంతుపట్టని ‘అసలైన కవిత్వం’ సీతారామ శాస్త్రిలో పుష్కలంగా ఉంది. తెలుగులో కవిత్వం సినిమాలో ఉన్నంతగా బయటలేదు అన్న క్షేత్రవాస్తవాన్ని అవగతం చేసుకోగలిగే మనోవికాసం, తెలివిడి “కవులం”, “విమర్శకులం” అని అరుస్తున్న వికృత స్వభావులకు లేదు.
వ్యక్తిగా కూడా ఉన్నతంగా బతికారు శాస్త్రి. గత కొన్ని దశాబ్దులుగా ఒక తెలుగు కవి ఎంత చవకబాఱుగా, ఎంత దగుల్బాజీగా, ఎంత అధమంగా బతుకుతున్నాడో మనకు తెలిసిందే. సీతారామశాస్త్రి ఉన్నతంగా బతికారు.
సీతారామశాస్త్రి RSS వ్యక్తి. దాన్ని ఆయన బహిరంగంగానే చెప్పుకునే వారు. దానివల్ల తనకు హాని జరుగుతుందని తెలిసినా, తాను నష్టపోతానని తెలిసినా ఆయన తాను RSS వ్యక్తిని అన్న దాన్ని దాచుకోలేదు. సీతారామశాస్త్రి ఎంత ఉన్నతమైన వ్యక్తో దీన్ని బట్టి తెలుస్తోంది. ఆయన RSS వ్యక్తి కావడంవల్ల ప్రభుత్వం నుండి కవి నామ నీచులకు దక్కినవెన్నో ఆయనకు రాలేదు.
పలువురు అకవులు, అసాంఘీకశక్తులు, ఆనైతిక శక్తులు కమ్యూనిస్ట్‌లం, ఆ వాదం వాళ్లం, ఈ వాదం వాళ్లం అని అరుస్తూ కవులు, ప్రముఖ కవులు అయిపోవడం మనకు తెలుసు. సీతారామ శాస్త్రిగారు అందుకు భిన్నంగా ఒక నిజమైన మనిషై ఆపై నికార్సైన కవి అయ్యారు.
కవుల దుర్గుణాలు లేనివారు సీతారామశాస్త్రి. కులం, మతం, ప్రాంతీయత, బూతు, తాగుడు, పాదాలు నాకడం, కమ్యూనిజమ్ వీటి ప్రాతిపదికన ఒక దగుల్బాజీగా ఆయన ఎదగలేదు. ప్రతిభతో ఎదిగారు. ఉన్నతమైన మనిషిగా ఎదిగారు. చరిత్ర ఆయ్యారు.
మంచి అభిరుచి ఉన్నవారు ఆయన. సంగీతం పరంగా కూడా మంచి ఆలోచన ఉన్నవారు ఆయన. తెలుగు అభిజ్ఞ వర్గం ఇంకా ఘంటసాల సంగీతంలోనే ఉండిపోయిన పరిస్థితిలో శాస్త్రి ఎ.ఆర్. రహ్మాన్ సంగీతం గొప్పతనాన్ని కూడా అర్థం చేసుకుని చెప్పే వారు.
సీతారామశాస్త్రికి జాతీయ ఉత్తమగేయ రచయిత అవార్డ్ ఎందుకు రాలేదు? 2,400 పై చిలుకు పాటలు, అందులో ఎన్నో విలువైన పాటలు రాసిన సీతారామ శాస్త్రికి జాతీయ ఉత్తమగేయరచయిత అవార్డ్ రాలేదు. బాధాకరం. (తెలుగులో మొత్తం 75,000 పైచిలుకు పాటలు వస్తే వేటూరి 5,000 పై చిలుకు రాసి మొదట స్థానంలో ఉన్నారు)
శాస్త్రి విషయంలో కొంతమంది తమ కులం మలం నైచ్యాన్ని వాంతి చేసుకున్నారు…
ఊళ్లో మురికి కాలువలుంటాయి;
ఇదిగో వాళ్లూ ఉన్నారు.
శ్రీశ్రీ చెప్పినట్టు వాళ్లకు కవిత కరక్కాయ;
కవి అంటే వాళ్లకు చుక్కెదురు.
పందులు, కుక్కలు తేనె తాగవు;
వాళ్లు ఔన్నత్యాన్ని అందుకోరు.
ఏనుగును చూసి కుక్కలు మొరుగుతాయి,
వాళ్లు సుకవుల్ని చూసి మొరుగుతారు.
కుక్కలు కూడా ఏనుగు వెళ్లిపోయాక మొరగవు;
వాళ్లు మరణించిన కవిపై మొరుగుతారు.
కుక్కలు నయం
కుక్కలకు కులం అవసరం లేదు;
వాళ్లు కులం, కులం అంటూ
మలం తింటూంటారు.
వెన్నెలను చీముగా పరిగణించే వాళ్లు వాళ్లు;
పుండు రసిని పూసుకుని వీధిన పడతారు.
దేనికైనా పట్టే చీడపురుగులు;
వాళ్లు శవాలపై చిల్లర ఏరుకోడానికి ఎగబడతారు.
ఎదగలేనివాళ్లు పగిలిపోయిన మనస్తత్వాలతో,
చదువురానివాళ్లు విరిగిపోయిన బుద్ధులతో
వికృత జీవులై రాద్ధాంతం చేస్తున్నారు;
తమ వికారాన్ని వాంతి చేస్తున్నారు.
కళకు కులమూ. మతమూ, ప్రాంతమూ ఉండవు;
చెడ్డవాళ్లకు సభ్యత, సంస్కారం, విజ్ఞత ఉండవు.
గంధాన్ని దుర్గంధం చేసేద్దామని ఉన్మాదులు ప్రయత్నిస్తున్నారు;
నాణ్యతను నలిపెయ్యాలనుకుంటున్నారు నాసిరకంగాళ్లు.
బతుకు నిండా బూతుని నింపుకుని
బాగు అన్నదాన్ని భగ్నం చెయ్యాలని చూస్తున్నారు.
వెన్నెలకు మసి అంటదు కదా!
ఆకాశం ఆకాశమే కదా!!
‘జనరంజకత్వం కోసం’ అని కవులు, కళాకారులు కొన్ని చేస్తూ ఉంటారు. కానీ సీతారామశాస్త్రి అలా కాకుండా తాను ఒక ఉన్నతమైన స్థాయిలో ఉండి ఆ స్థాయికి జనాలను తీసుకెళ్లారు. గొప్ప విషయం ఇది. నిజమైన, మేలైన కళాకారుడి లక్షణం ఇది.
ప్రజల్లో లేని వాళ్లను, పెద్ద శాతం ప్రజలకు పట్టని వాళ్లను ప్రజా కవులు అంటున్న గోల తెలుగులో మాత్రమే ఉన్న వికారం. ప్రపంచంలో మరే భాషలోనూ ఈ దుస్థితి లేదు. ప్రజా కవి అన్న మాట తెలుగులో భ్రష్టుపట్టినట్టుగా, దుర్వినియోగం అయినట్టుగా మరే భాషలోనూ అవలేదు. సీతారామశాస్త్రి ప్రజల్లో ఉన్న ప్రజా కవి; ప్రజలకు నచ్చిన కవి; ప్రజలు మెచ్చిన కవి.
‘సీతారామశాస్త్రి కాలాలు మెచ్చే కవి’ కూడా!
ఒక వ్యక్తిగా, కవిగా శాస్త్రి కులం, మతంవల్ల నికృష్టంగా బతకలేదు! కవి నామ నీచుల్లా చవకబారుగా, అసాంఘీకంగా, అనైతికంగా బతకలేదు. ప్రతిభతో, జనామోదంతో ఉన్నతంగా బతికారు. ఉన్నతమైన కవి, ఉన్నతమైన మనిషి సీతారామశాస్త్రి.
“తలవాకిట ముగ్గులు వేకువకే అందం”
తెలుగులో వచ్చిన గొప్ప డబ్బింగ్ పాట. డబ్బింగ్ సినిమాల పాటలప్పుడు ఒక భాషలో రాశాక దాన్ని చిత్రీకరించాక తరువాత మఱో భాషలో రాస్తున్నప్పుడు మూల భాష భావాల్ని తీసుకోకుండా స్వతంత్రించి రాయడం గొప్ప విషయం. అలా రాసిన కవి ప్రత్యేకంగా అభినందనీయుడు. అదిగో అలాంటి అభినందనీయమైన గొప్ప పని చేశారు సిరివెన్నెల సీతారామశాస్త్రి.
1990లో తమిళ్ లో వచ్చిన ‘కిళ్షక్కువాసల్’ సినిమా తెలుగులో ‘తూర్పుసిందూరం’గా డబ్ అయింది. ఆ సినిమాలో తమిళ్ష్ భాషలో కవి వాలి రాశాక ఆ పాట చిత్రీకరణ అయ్యాక తెలుగులో సీతారామశాస్త్రి మూలానికి అతీతంగా అంతకన్నా మిన్నగా రాశారు.
రండి పరికిద్దాం…
సినిమాలో నాయకుడు వీధి భాగవతాలు (తెరుక్కూత్తు) ఆడుతూ పొట్ట పోసుకుంటూంటాడు. అతడు పాడే పాట ఇది.
తమిళ్ష్ పాటకు నా అనువాదం:
పల్లవి:
అహ ఇంటి ఇంటికీ వాకిలి గడప కావాలి
వీధిభాగవతానికీ, పాటకూ తాళగతి కావాలి
సింహద్వారం లేని ఇల్లూ, ఒక తాళం లేని పాటా
తత్తితరిగిడ తరిగిడ తరిగిడ తధింగిణ తోం
తెలుగు పల్లవి
తల వాకిట ముగ్గులు వేకువకే అందం
శ్రుతి కుదరని పాటకు లేదు కదా అందం
నడి వీధులలో వేదం ఈ జానపదం సత్యం
తత్తితరిగిడ తరిగిడ తరిగిడ తధింగిణ తోం
తమిళ చరణం 1
అల ఆడుతుంది లోతైన సముద్రం వఱకు
అందులో ముత్యాలు తీసే వాడి కష్టం
ఈ ఊరుకు తెలియదు
లో మనసులో వేల భారాలు
అవి పాటలో వెళతాయి దూరాలు
అవి ఎవరికీ అర్థం కావు
ఒకటి లేకుండా రెండూ లేదు
మగాడు లేకుండా ఆడదీ లేదు
ఆడది లేకుండా ఎవరూ లేరు
శోకం లేనీ వాళ్లూ లేరు
వాకిలి లేని ఇల్లూ, తాళం లేని పాటా
తత్తితరిగిడ తరిగిడ తరిగిడ తధింగిణ తోం
తెలుగు చరణం 1
అరె గలగల మోగిన పాదం
ఆ ముచ్చట మువ్వల నాదం
అది పెరుగును ఏనాడూ
గోపాలుని ఆటల మైకం
రేపల్లెగ మారును లోకం
జగమంతా తూగాడూ
దేహం ఉంటే రోగం ఉంది
సౌఖ్యమూ, చింతా ఉంది
పెదవిలోన నవ్వులు ఉంటే
దుఃఖమెలా నిలబడుతుంది?
వీధులలో వేదం ఈ జానపదం సత్యం
తత్తితరిగిడ తరిగిడ తరిగిడ తధింగిణ తోం
తమిళ చరణం 2
కొత్త అల్లుడు, అమ్మాయిని చూడు
రెండు ఎద్దులను కట్టిన బండి
ఎప్పుడూ వర్ధిల్లాలి కలకాలం ఒక మల్లెల పానుపు వేసి
ఆ మన్మధ విద్యను చూపు
నేను జోలను వినాలి
బట్టలు లేని ఒళ్లూ లేదు
అల లేని కడలీ లేదు
శబ్దం లేని గంటా లేదు
ఆశ లేని మనసూ లేదు
వాకిలి లేని ఇల్లూ, తాళం లేని పాటా
తత్తితరిగిడ తరిగిడ తరిగిడ తధింగిణ తోం
తెలుగు చరణం 2
ప్రతి మనిషికి మనసుంటుంది
వేరొకరిది అయిపోతుంది
అందుకోసమె పెళ్లాడు
తొలి ముచ్చట ముద్దరపడితె
ఆ జంటకు నిద్దర చెడితె
ఆ కేళికి వెయ్యేళ్లు
రాతిరుంటే ఉదయం ఉంది
కలత ఉంటే కులుకూ ఉంది
ఊసులాడు పండగ వేళ
ఆశలకే బలమొస్తుంది
నడి వీధులలో వేదం
ఈ జానపదం సత్యం
తత్తితరిగిడ తరిగిడ తరిగిడ తధింగిణ తోం
“తలవాకిట ముగ్గులు వేకువకే అందం” అని సీతారామశాస్త్రి రాయడం చాలా గొప్పగా ఉంది. ఇంత మంచి ఎత్తిగడతో ఒక డబ్బింగ్ పాట రాయడం చాలా గొప్ప విషయం. బహుశా తెలుగులో ఒక డబ్బింగ్ పాట ఇంత గొప్ప ఎత్తుగడతో రావడం ఇదే తొలిసారేమో?!
తెలుగు చరణాలు తమిళ్ కన్నా ఎంతో మిన్నగా ఉన్నాయి. “తొలి ముచ్చట ముద్దరపడితె
ఆ జంటకు నిద్దర చెడితె
ఆ కేళికి వెయ్యేళ్లు” అని ఎంతో గొప్పగా అన్నారు శాస్త్రి. ఇంకా
“గోపాలుని ఆటల మైకం
రేపల్లెగ మారును లోకం” అనీ, “దేహం ఉంటే రోగం ఉంది
సౌఖ్యమూ, చింతా ఉంది
పెదవిలోన నవ్వులు ఉంటే
దుఃఖమెలా నిలబడుతుంది?” అనీ, “ప్రతి మనిషికి మనసుంటుంది
వేరొకరిది అయిపోతుంది” అనీ అనడం గొప్పగా ఉన్నాయి.
తమిళ్ష్ మూలం ఎంత మాత్రమూ సీతారామశాస్త్రి
తెలుగు సాహిత్యానికి దీటైంది కాదు.
ఇలా ప్రశంసనీయమైన గొప్ప సాహిత్యాన్ని పండించారు సీతారామ శాస్త్రి; ఒక మేలైన కవిగా పండారు సీతారామశాస్త్రి.
‘భారతీయతా భావాల భవ్యకవి సీతారామశాస్త్రి’

9444012279