– జూబ్లీహిల్స్ తీర్పుతో కాంగ్రెస్‌కి బుద్ధి
– షేక్‌పేట రోడ్ షోలో కేటీఆర్
హైదరాబాద్: జూబ్లీహిల్స్ నియోజకవర్గం లో ప్రజలు ఇచ్చే తీర్పుతో కాంగ్రెస్‌కి బుద్ధి వస్తుందని, కాంగ్రెస్ పరాజయం తప్పదని భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్అన్నారు. కాంగ్రెస్ పార్టీ మోసాలు, ఘోరాలపై ఆగ్రహంగా ఉన్న ప్రజానీకం ఆ పార్టీని తిరస్కరిస్తారని ఆయన పేర్కొన్నారు. జూబ్లీహిల్స్ లో జరిగే ఎన్నికల్లో కాంగ్రెస్ డిపాజిట్ కోల్పోతేనే రాష్ట్ర ప్రజలకు ఆ పార్టీ ఇచ్చిన 420 హామీలు, ఆరు గ్యారెంటీలు అమలు అవుతాయని కేటీఆర్ వ్యాఖ్యానించారు.
కేవలం ఓటమి భయంతోనే కాంగ్రెస్ పార్టీ ఆపదమొక్కులకు పోతున్నదని, అందుకే ఇన్ని రోజులు గుర్తుకురాని మైనార్టీల నుంచి ప్రభుత్వ ఉద్యోగులు, సినీ కార్మికుల దాకా అందరికీ ఏదో చేస్తామని మరోసారి మోసం చేసే ప్రయత్నం చేస్తున్నదని కేటీఆర్ విమర్శించారు.రెండేళ్లలో ఒక్క హామీని కూడా కాంగ్రెస్ నిలబెట్టుకోలేదని, ఏ ముఖం పెట్టుకొని ఓట్లడుగుతున్నారో చెప్పాలని కేటీఆర్ వ్యాఖ్యానించారు.
‘ఇక్కడ 4 లక్షల మంది కాంగ్రెస్‌కు బుద్ధి చెబితే 4 కోట్ల మంది ప్రజలకు మేలు జరుగుతుంది’ అని కేటీఆర్ అన్నారు. కాంగ్రెస్ చిత్తు చిత్తుగా ఓడిపోతేనే హామీలన్నీ అమలవుతాయని చెప్పారు. పొరపాటున కాంగ్రెస్‌కు ఓటేస్తే, ‘నేనేం చేయకపోయినా వీళ్లు మళ్లీ నాకే ఓటేస్తారని రేవంత్ రెడ్డి అనుకుంటారు’ అని హెచ్చరించారు. జూబ్లీహిల్స్ ప్రజలు అమాయకులని, పైసలు ఇస్తే ఓట్లేస్తారని రేవంత్ రెడ్డి అనుకుంటున్నారని అన్నారు.
కాంగ్రెస్ వాళ్లు వచ్చి పైసలు ఇస్తే తీసుకోమని, కానీ ఓటు మాత్రం కారు గుర్తుకు వేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ‘రూ. 5 వేలు ఇస్తే తీసుకొని.. మరి మిగితా బాకీ డబ్బులు ఎప్పుడు ఇస్తారని ప్రశ్నించాలి’ అని సూచించారు. కారు గుర్తుకు ఓటేసి మాగంటి సునీతను భారీ మెజార్టీతో గెలిపించాలని, కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రిగా రావాలంటే, జైత్రయాత్ర ఇక్కడి నుంచే ప్రారంభం కావాలని కేటీఆర్ కోరారు.
కేటీఆర్ షేక్‌పేటలో రోడ్ షోలో పాల్గొని, జూబ్లీహిల్స్ లో పార్టీ తరఫున ఎన్నికల్లో పోటీ చేస్తున్న దివంగత మాజీ ఎమ్మెల్యే గోపీనాథ్ సతీమణి మాగంటి సునీత తరఫున ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘జూబ్లీహిల్స్ మళ్లీ కొడుతున్నాం’, ‘ఇక్కడ గెలుపు పక్కా.. కానీ మెజార్టీ ఎంతో తేలాల్సి ఉంది’ అని విశ్వాసం వ్యక్తం చేశారు
కేటీఆర్ మాట్లాడుతూ… రెండేళ్ల కాంగ్రెస్ పాలనలో ఏ ఒక్కరికీ మేలు జరగలేదని, అరచేతిలో స్వర్గం చూపిస్తూ 420 హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చారని విమర్శించారు. కాంగ్రెస్ ఇచ్చిన వాగ్దానాలైన వృద్ధులకు రూ. 4 వేల పెన్షన్, యువతులకు రూ. 2500, ఆడబిడ్డలకు స్కూటీ వంటివి అమలు కాలేదని ప్రశ్నించారు. కేసీఆర్ ఉచితంగా ఇచ్చిన 20 వేల లీటర్ల ఫ్రీ వాటర్ కూడా ఇవ్వలేని సత్తా ఈ ప్రభుత్వానికి లేదని మండిపడ్డారు. పేదలకు పథకాలు ఇచ్చే తెలివి లేదని, కేసీఆర్ పథకాలు కంటిన్యూ చేసే తెలివి కూడా లేదని ఎద్దేవా చేశారు. బతుకమ్మ చీరలు, రంజాన్ తోఫా, క్రిస్మస్ గిఫ్ట్ వంటివి కూడా ఇప్పుడు ప్రజలకు అందట్లేదని అన్నారు. రెండేళ్లలో ఒక్క హామీని కూడా కాంగ్రెస్ నిలబెట్టుకోలేదని, ఏ ముఖం పెట్టుకొని ఓట్లడుగుతున్నారో అర్థం కావడం లేదని కేటీఆర్ వ్యాఖ్యానించారు.
గత 2023 ఎన్నికల్లో హైదరాబాద్‌లో కాంగ్రెస్‌కు ఒక్క సీటు కూడా రాలేదని, జూబ్లీహిల్స్‌లో కూడా మాగంటి గోపినాథ్‌ను గెలిపించారని గుర్తుచేసి, ప్రస్తుతం దురదృష్టవశాత్తూ కన్నుమూసిన గోపీనాథ్ గారి సతీమణి మాగంటి సునీతను ఆశీర్వదించాలని కోరారు.