( ఇంద్రాణి)
ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అక్టోబర్ 28 నాడు న్యాయవ్యవస్థలోని ఒక లొసుగుపట్ల తీవ్రమైన ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. 2023 లో తిరుమల తిరుపతి వేంకటేశ్వర స్వామి దేవస్థానం వారి పరకామణిలో జరిగిన ఒక దొంగతనం కేసును లోక్ అదాలత్ లో రాజీ చేసుకోవటానికి అనుమతించే ముందు కేసు పూర్వాపరాలను పరిశీలించవలసిన కనీస బాధ్యతను సదరు కోర్టు న్యాయాధికారి నిర్వర్తించనందుకు ఆగ్రహించిన హైకోర్టు, అవార్డును సస్పెండ్ చేసింది. సదరు న్యాయాధికారిని ప్రోటోకాల్ బాధ్యతల నుండి తప్పించవలసిందిగా రిజిస్ట్రార్ ని ఆదేశించింది.
తిలాపాపం తలా పిడికెడు అనే సామెత తెలిసిందే. తిరుమల తిరుపతి దేవస్థానం వారి పరకామణిలో దొంగతనం చేసిన రవికుమార్ కేసు అనేక మలుపులు తిరిగి, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు వారి ప్రత్యేక చొరవ వలన రవికుమార్ ను మరలా బోనులో నిలబెట్టే పరిస్థితి వచ్చింది. ఈకేసు పూర్వాపరాలను గమనిస్తే ప్రజలే కాదు, దేవదేవుడు కూడా ఆయన ట్రస్టీలను నమ్మలేరు.
దొంగతనం జరిగింది, తిరుమల వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో తిరుమల సెక్యూరిటీ అండ్ విజిలెన్స్ పరకామణి ఇంచార్జ్ ఆఫీసర్ సతీష్ కుమార్ ఫిర్యాదు చేశారు. అప్పటికి దానిని చాలా చిన్నకేసుగా పరిగణించి ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్స్ 379, 381 క్రింద కేసు నమోదు చేశారు. ఛార్జ్ షీట్ కూడా దాఖలు చేశారు. ఆశ్చర్యకరంగా దొంగతనం చేసిన వ్యక్తి, ఫిర్యాదు ఇచ్చిన విజిలెన్స్ ఆఫీసర్ రాజీ పడతామని చెప్పి లోక్ అదాలత్ లో పిటిషన్ వేశారు. అదాలత్ లో సెటిల్ అయింది, అవార్డు కూడా ఇవ్వటం జరిగింది.
ఈ కేసులో అవార్డు ఇచ్చిన న్యాయాధికారి బాధ్యతాయుతంగా వ్యవహరించలేదని హైకోర్టు భావించి, సదరు న్యాయాధికారిపైన చర్యలకు ఉపక్రమించింది. ఒక వ్యక్తితో మొదలైన ఈకేసు రాష్ట్రంలో ఉన్న వ్యవస్థలన్నిటి లోపాలను ఎత్తి చూపింది. ముందుగా హైకోర్టు ఇంత తీవ్రంగా నిరసించిన ఆ న్యాయాధికారి చేసిన పొరపాటును గమనిస్తే, టీటీడీ అనేది ఒక పెద్దవ్యవస్థ.
అందులో పనిచేస్తున్న వ్యక్తే దొంగతనం చేసినప్పుడు 409 ఇండియన్ పీనల్ కోడ్ ప్రకారం క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ అంటే ఒక ప్రభుత్వ ఉద్యోగి తాను పనిచేసే సంస్థలో దొంగతనం చేస్తే పెట్టవలసిన కేసును నమోదు చేయలేదని సదరు న్యాయాధికారి గమనించలేదు. 409 క్రింద నమోదు అయిన కేసుల్లో పది సంవత్సరాల నుండి యావజ్జీవం వరకు శిక్షపడే అవకాశమున్నది.
అదాలత్ కు వచ్చినప్పుడు ముఖ్యంగా 381 సెక్షన్ ఉన్నప్పుడు క్రింది కోర్టు న్యాయాధికారి, దొంగిలించబడిన సొత్తు ఎవరికి చెందుతుందో, వారి అభిప్రాయం తెలుసుకోవటం అవసరం అని ఎందుకు భావించలేదు అనేది పెద్ద ప్రశ్న. టీటీడీ తరఫున ఒక విజిలెన్స్ అధికారి దేవస్థానపు సొత్తుకు యజమాని అని సదరు న్యాయాధికారి నిర్ణయానికి ఎలా వచ్చారో అర్థం అవదు, మరింత సందేహాస్పదమైన అంశం.. దొంగతనం నేరారోపణతో ముద్దాయిగా ఉన్న వ్యక్తి , లోక్ అదాలత్ అవార్డు ఇచ్చిన రోజు కోర్టుకు హాజరవకపోవటం.
అలా హాజరు కావలసిన అవసరం లేదు అని చెప్పటానికి న్యాయాధికారి కేరళ హైకోర్టు ఇచ్చిన ఒక తీర్పును ఉటంకించటానికి, ఎంత కసరత్తు చేసివుంటారో అనిపిస్తుంది. ఆ కసరత్తు, టీటీడీ సొత్తును దొంగిలించి రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయిన వ్యక్తితో ఒక విజిలెన్స్ అధికారి ఎందుకు రాజీ పడుతున్నాడు అనే సందేహ నివృత్తి చేసుకునే ప్రయత్నం చేసిఉంటే బాగుండేది.
ఈరోజు ప్రోటోకాల్ వలన సంక్రమించే బాధ్యతలకు దూరంగా ఉండవలసిన అవసరం ఉండేది కాదు. దొంగగా నేరారోపణ చేయబడిన రవికుమార్ చేసిన దానాన్ని టీటీడీ ఆగమేఘాలమీద ఒప్పుకోవలసిన అవసరం ఏమున్నదో అప్పటి పాలకమండలి చెప్పవలసిన విషయం. కానీ హైకోర్టు ఈ విషయానికి సంబంధించిన కేసును విచారిస్తూ ఆంధ్రప్రదేశ్ సీఐడీ ని పార్టీగా కలిపి, కేసుకు సంబంధించిన పోలీసు రికార్డ్సును, రవికుమార్ చేసిన దానానికి సంబంధించిన రికార్డ్స్ ను సేకరించి న్యాయస్థానానికి సమర్పించవలసిందిగా ఆదేశాలు జారీచేసింది. ఈ దర్యాప్తును సీఐడీ లో ఐజీ ర్యాంక్ అధికారికి అప్పచెప్పవలసిందిగా ఆదేశించింది.
కానీ పోలీసు యంత్రాంగం కనీసపు స్పందన కనపరచలేదు. తదుపరి విచారణ సమయంలో తాము ఆదేశించిన రికార్డ్ ను స్వాధీన పరచుకున్నారా అని అడిగినప్పుడు, పోలీసువారు సమయానికి సీఐడీ ఐజీ స్థానంలో ఎవరూ లేనందున హైకోర్టు ఆదేశాలను అమలు చేయలేక పోయాము అంటూ సమాధానం ఇచ్చారు. ఏదో ఒక ర్యాంకు ఆఫీసర్ ను కేసు దర్యాప్తుకు అనుమతించవలసిందిగా న్యాయస్థానాన్ని అభ్యర్థించారు.
ఇక్కడ మనకు అర్థంకాని విషయం.. ప్రముఖమైన వ్యవస్థల్లో కీలకమైన అధికారులను నియమించటంలో ప్రభుత్వ వైఫల్యం. ఎప్పటినుండి సీఐడీలో ఐజీ స్థాయి అధికారి లేరో కానీ, కోర్టు ఆదేశాలు ఇచ్చిన పదిహేను రోజుల వరకైతే లేనట్లే. ఆంధ్రప్రదేశ్ లో సరిపడా అధికార యంత్రాంగం లేదా లేక ఎవరికి ఇవ్వాలా అనే ఆలోచనలోనే ప్రభుత్వం ఉన్నదా అనే సందేహం సహజంగానే కలుగుతున్నది.
రవికుమార్ చేసిన దానానికి సంబంధించి టీటీడీ బోర్డు చేసిన రిజల్యూషన్స్, కరస్పాండెన్స్ స్వాధీనం గురించి కౌంటర్ వేశారా అనే ధర్మాసనం ప్రశ్నకు టీటీడీ స్టాండింగ్ కౌన్సెల్ చెప్పిన సమాధానం మరీ ఆశ్చర్యం కలిగిస్తుంది. ఎన్నిసార్లు బోర్డు మీటింగ్ పెట్టినా, చీఫ్ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ ఆఫీసర్ సెలవులో ఉండటం వలన పనికి ఆటంకం కలిగింది అంటూ మరికొద్ది సమయం గడువు కావాలనగానే హైకోర్టు తీవ్రమైన ఆగ్రహంతో యంత్రాంగం అంతా నిద్రావస్థలో ఉన్నారా అంటూనే టీటీడీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ను వ్యక్తిగతంగా కోర్టుకు హాజరు అవాలని ఆదేశించారు.
స్టాండింగ్ కౌన్సెల్ పదే పదే కోర్టును ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ను కోర్టుకు రావలసిందిగా ఇచ్చిన ఆదేశాన్ని ఆపమని కోరగా ఈఓని 20,000 రూపాయలు అడ్వకేట్ ఫండుకు చెల్లించమని ఆదేశిస్తూ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పర్సనల్ గా కోర్టుకు హాజరు అవటాన్ని మినహాయించారు. ఆ అధికారి 20,000 రూపాయలు కట్టటానికైనా సిద్ధపడ్డారు కానీ కోర్టుకు హాజరవటానికి ఇష్టపడలేదు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ యంత్రాంగం పని తీరు అలా ఉన్నది. ఒక దగ్గర అవసరమైన ఆఫీసర్ పోస్ట్ ఖాళీగా ఉన్నది, ఒక ఆఫీసర్ ఉండికూడా కోర్టు ఆదేశాలను అమలు పరచడు, కోర్టుకు రాడు, టీటీడీ రక్షణ బాధ్యతను నిర్వహించే మరో ఆఫీసర్ సెలవు పైన ఉంటాడు. హైకోర్టు ఆదేశాలు అమలులో జరుగుతున్న జాప్యం గురించి ప్రభుత్వానికి సలహాలు, సూచనలు ఇవ్వవలసిన అడ్వకేట్ జనరల్, ఆయన బృందం ఏం చేస్తున్నారో తెలియదు.
కోర్టు వ్యవహారాలకు ఖజానా నుండి కోట్ల రూపాయల చెల్లింపులు జరుగుతున్నాయి కానీ, ప్రతిష్టాత్మకంగా తీసుకోవలసిన కేసులు కూడా వీగిపోతున్నాయి. ప్రభుత్వ యంత్రాంగం న్యాయమూర్తుల ముందు చేతులు కట్టుకుని నిలబడవలసి వస్తున్నది. టీటీడీలో జరిగిన అంత పెద్ద కుంభకోణాన్ని బయటపెట్టటానికి రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం ఆరాటపడుతున్నదే కానీ, అధికార యంత్రాంగానికి చీమ కుట్టినట్లు కూడా లేదు.
హైకోర్టు న్యాయవ్యవస్థలో జరిగిన పొరపాటును కూడా సరిదిద్దే ప్రయత్నం చేస్తున్నది కానీ అధికారులు మాత్రం నిద్రను నటిస్తున్నారు. ఒక్క కేసు న్యాయవ్యవస్థలోని రెండు కోణాలను ఆవిష్కరించటం అరుదైన ఘటన. ఏది ఏమైనా ఇప్పటికే న్యాయవ్యవస్థ పట్ల అంపశయ్య మీద ఉన్న ప్రజల నమ్మకం, టీటీడీ కేసులో హైకోర్టు స్పందించిన విధానంతో ఉత్తరాయణాన్ని మరి కొంత కాలం వాయిదా వేసిందనే చెప్పాలి.
న్యాయస్థానాలు అన్ని కేసుల్లో ఇలాగే స్పందిస్తే ప్రజల నమ్మకం పునరుజ్జీవం చెందే అవకాశం వుంటుంది. కర్ణుడు చావుకు నూటొక్క కారణాలు అన్నట్లు టీటీడీ లోనే కాదు, ఎక్కడ అవినీతి జరగటానికైనా వ్యవస్థలన్నీ తలాఒక చెయ్యి వేస్తున్నాయి అని మాత్రం అర్ధం అవుతున్నది.