– ఉరికొయ్యలు లేవు.. తలారులూ లేరు
– పేరు కే ఉరి! అమలు హుళక్కే!!
నిన్న శుక్రవారం నాడు… ఆంధ్ర రాష్ట్రం లో ఉరిశిక్ష పడిన ఖైదీల సంఖ్య మరో ఐదు పెరిగింది. ఇప్పటికే వెయిటింగ్ లో ఉన్న వారి సంఖ్య పది అంటున్నారు. నిన్నటి చిత్తూరు కోర్టు తీర్పుతో, వీరి సంఖ్య మొత్తం 15 మంది కావచ్చునని అనధికార లెక్కలు చెబుతున్నాయి.
2015 లో చిత్తూరు నగర పాలక సంస్థ మేయర్ గా ఉన్న కఠారి అనూరాధ, ఆమె భర్త మోహన్ రావు ను కాల్చి మర్డర్ చేసిన కేసులో, వారి మేనల్లుడు చింటూ తో సహా ఐదుగురు నిందితులకు చిత్తూరు ఆరవ అదనపు జిల్లా జడ్జి శుక్రవారం ఉరిశిక్ష విధించారు. 2021 లో అబ్దుల్ సమద్ అనే అతనికి, అతని గ్యాంగ్ కి ఒంగోలు లోని ఒక సెషన్స్ కోర్టు ఉరి శిక్షలు విధించింది.
దారి దోపిడీలు, హై వే హత్యలతో వీరి ఆరాచకాలు అప్పట్లో మారు మోగి పోయాయి.వీరికి తోడు, ప్రకాశం జిల్లాలోనే 2022 లో దూదేకుల సిద్ధయ్య అనే అతనికి ఒంగోలు లోని పొక్సో సెక్షన్ కింద నేరాలు విధించే కోర్టు ఉరి శిక్ష విధించింది. ఏడేళ్ల బాలిక పై అతను అత్యాచారానికి పాల్పడ్డాడు అనేది అభియోగం.
అయితే, వీరెవరినీ సమీప భవిష్యత్ లో ఉరి తీసే అవకాశమే లేదు. ఇందుకు అనేక కారణాలు.
1.నిందితులను ముద్దాయిలుగా పరిగణించి, ఉరి శిక్ష (లు) విధించినవి అన్నీ సెషన్స్ కోర్టులే.
2.ముద్దాయిలు అప్పీల్ చేసుకోడానికి నాలుగు ద్వారాలు వారికి అందుబాటులో ఉన్నాయి.
3.హై కోర్టు, సుప్రీం కోర్టు, రాష్ట్ర గవర్నర్,భారత రాష్ట్ర పతి.
4.ఈ నాలుగు ద్వారాలలో ఏది దయ తలచినా, ముద్దాయి బయట పడి పోతాడు.
ఈ నాలుగు మూసుకుని పోయాయి అనుకున్నప్పటికీ ; ఉరి శిక్ష అమలు కావడం అనేది…. శిక్ష విధించడమంత తేలిక కాదు.
మన రాష్ట్రమే తీసుకుంటే ; రాష్ట్రం లో నాలుగు సెంట్రల్ జైళ్లు ఉన్నాయి. రాజమండ్రి, విశాఖపట్నం, నెల్లూరు, కడప. రాష్ట్రం లో ఉన్న వంద కు పైబడి ఉన్న సెషన్స్ కోర్టుల్లో….. ఏ కోర్టు ఉరి శిక్ష విధించినప్పటికీ, శిక్షకు గురైన వారిని ఈ నాలుగింటి లోనే ఏదో ఓ సెంట్రల్ జైలు లో నిర్బంధిస్తారు.
విశేషం ఏమిటంటే…ఉరిశిక్ష అమలుకు అవసరమైన ఏర్పాట్లు ఏ ఒక్క సెంట్రల్ జైలు లోనూ లేవు.
అనధికారికం గా ప్రాణాలు తీసేయాలంటే…. ఏ పోలీస్ స్టేషన్ లో అయినా ఏ కుర్ర ఎస్ ఐ అయినా సరిపోతాడు గానీ ; చట్టబద్దం గా, అధికారికం గా మేజిస్ట్రీట్, వైద్యుడు, జైలు సూపరింటెండెంట్ సమక్షం లోనే ప్రాణాలు తీయాలి కాబట్టి ; ఒక “తలారి” కావాలి. ఇప్పుడు రాష్ట్రం లోని ఏ సెంట్రల్ జైలు లోనూ తలారి లేడు. ఉరికంబం లేదు. మెడకు తగిలించాల్సిన తాడు లేదు.
ఆంధ్ర లో చివరి సారిగా… నంబి కిష్టప్ప అనే అతనికి ఒక మర్డర్ కేసులో విధించిన ఉరిశిక్ష 1976 లో రాజమండ్రి సెంట్రల్ జైలు లో అమలు చేశారు. అంటే – 29,30 ఏళ్ళల్లో ఆంధ్ర లో ఒక్క ఉరి శిక్ష కూడా అమలుకు నోచుకోలేదు.
ఉరిశిక్ష కన్విక్ట్స్ కు కూడా రాజ్యాంగం అనేక హక్కులు కల్పించింది.
మానసిక, శారీరక అనారోగ్య పరిస్థితుల్లో ఉన్న ముద్దాయిని ఉరి తీయకూడదు. వారిని ఒంటరిగా జైలు గదిలో నిర్భందించ గూడదు. వారు చేసుకునే అప్పీళ్ళ పై అకారణ ఆలస్యం చేయగూడదు. అలా చేస్తే, రాజ్యాంగం ఊరుకోదు. ఆర్టికల్ 14, 21,22(1) ప్రకారం వారి ఉరితీత అమలు జరిగేవరకు వారిని సగౌరవం గా చూడాలి. విచారణ క్రమం లో లోపాలు ఉంటే, ఆర్టికల్ 32 ప్రకారం తీర్పు లోని లోపాలు ఎత్తి చూపించవచ్చు.
మొత్తం మీద ఈ కర్మకాండ అంతా ముగిసేసరికి, కొందరి విషయం లో ఉరిశిక్ష ను అమలు చేయాల్సిన అవసరం పడక పోవచ్చు.
ఈ మొత్తం ప్రక్రియను పరిగణన లోకి తీసుకుంటే… “ఉరిశిక్ష” అనేది సింబాలిక్ గా…. నిందితుల అరాచకాలకు బలైన వారి కుటుంబ సభ్యుల తక్షణ మానసిక ఉపశమనానికి పనికి వస్తుంది.ఒక రకం గా వారు జీవిత ఖైదీల వంటి వారే అనుకోవచ్చు. కాకపోతే వారికి పేరోల్, గట్రా ఉండవు.
– భోగాది వేంకటరాయుడు