– శ్రీ దక్షిణామూర్తి, గణపతి, శివలింగ, స్కందమాత, నందీశ్వర, నవగ్రహ దేవతా విగ్రహ ప్రతిష్ఠాపన
– కంచి కామకోటి పీఠాథిపతి శంకర విజయేంద్ర సరస్వతి మహా స్వామి కరమకమాలచే ప్రతిష్ఠాపన
– హాజరైన కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, మంత్రి శ్రీధర్‌బాబు, మాజీ మంత్రి తలసాని, ఇంద్రకిరణ్‌రెడ్డి, ఎన్విఎస్ఎస్ ప్రభాకర్
సికింద్రాబాద్: సికింద్రాబాద్ శ్రీనివాసనగర్‌లో అత్యంత పురాతన శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామి దేవాలయంలో జీర్ణోద్థరణ కార్యక్రమం భక్తుల జయజయధ్వానాల నడుమ ఘనంగా జరిగాయి. ఆరు దశాబ్దాల క్రితం.. నడిచేదేవుడు శ్రీ కంచి పరమాచార్య స్వహస్తాలతో ప్రతిష్ఠించిన శ్రీ ప్రసన్న వేంకటేశ్వర స్వామి ఆలయాన్ని, భక్తుల విరాళాలతో మరింత అభివృద్ధి పరిచేందుకు జీర్ణోద్ధరణకు రెన్యువేషన్ కమిటీ సంకల్పించింది.
ఆ ప్రకారం సుమారు 10 కోట్ల అంచనా వ్యయంతో ప్రారంభించిన జీర్ణోద్ధరణ నిర్మాణ కార్యక్రమం.. చైర్మన్ బసవరాజు శ్రీనివాస్, వైస్ చైర్మన్ తమ్మన వేణుగోపాలరావు, సభ్యుల పర్యవేక్షణతో విజయవంతంగా పూర్తయింది. వీరి కృషి-దాతల చేయూత ఫలితంగా ఆలయ నిర్మాణం త్వరగా పూర్తయింది. తమిళనాడు నుంచి వచ్చిన శిల్పులు తమ ప్రత్యేకత చాటుకున్నారు.
ఆలయంలో నూతనంగా ప్రతిష్ఠించిన శ్రీ దక్షిణామూర్తి, గణపతి, శివలింగ, స్కందమాత, నందీశ్వర, నవగ్రహ దేవతా విగ్రహ ప్రతిష్ఠాపన కంచి పీఠాథిపతి శ్రీశ్రీశ్రీ శంకర విజయేంద్ర సరస్వతి మహా స్వామి కరకమాలతో జరిగింది. ఈ కార్యక్రమాలకు శ్రీ జగద్గురు శంకరాచార్య పుష్పగిరి మహా సంస్థానం పీఠాథిపతి శ్రీశ్రీశ్రీ అభినవోద్దండ విద్యాశంకర భారతీ మహాస్వామి, విజయవాడ శ్రీమద్ అష్టాక్షరీ పీఠాథిపతి శ్రీశ్రీశ్రీ త్రిదండి అష్టాక్షరీ సంపత్‌కుమార్ రామానుజ జీయర్‌స్వామి వేంచేసి, భక్తులకు అనుగ్రహ భాషణం చేశారు.
ఆలయంలో జరుగుతున్న మహా కుంభాభిషేకానికి కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, రాష్ట్ర మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, సనత్‌నగర్ ఎమ్మెల్యే-మాజీ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్, మాజీ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, దేవదాయశాఖ కమిషనర్ శైలజా రామయ్యర్, సీనియర్ ఐఏఎస్ అనితా రామచంద్రన్, మాజీ ఎమ్మెల్యే ఎన్విఎస్ఎస్ ప్రభాకర్, కార్పోరేటర్లు సామల హేమ, కందిశైలజ, నగర బీజేపీ నేత రాచమల్లు కృష్ణమూర్తి, పద్మారావునగర్ డివిజన్ బీఆర్ఎస్ ఇన్చార్జి గుర్రం పవన్‌కుమార్ గౌడ్ పాల్గొని స్వామివారి ఆశీస్సులు అందుకున్నారు.
వీరికి ఆలయ కార్యనిర్వహణాధికారి కొడకండ్ల అపర్ణ రాజేష్‌కుమార్, కమిటీ సభ్యులు పెండ్యాల ఆత్మారామ సుబ్రహ్మణ్యం, చివుకుల బాల భాస్కర్, గోపాలకృష్ణన్ నారాయణన్, శివశంకరన్, కె.కె.లక్ష్మీనారాయణ, జెఆర్ ఉమేష్, డాక్టర్ సుజయ్ ప్రకాష్ రమణన్, మావూరి గాయత్రి స్వాగతం పలికారు.