అమరావతి: కర్నూలు జిల్లా, నాయకల్లు గ్రామం వద్ద వి. కావేరీ ట్రావెల్స్ బస్సు దారుణ అగ్ని ప్రమాదంలో మృతదేహాలు మాంసపు ముద్దలు, బూడిద కుప్పలుగా మారిపోయాయి. ఏ మృతదేహం ఎవరిదో గుర్తించడం అత్యంత క్లిష్టంగా మారింది. ఈ సంఘటన జరిగిన వెంటనే డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ఆదేశాల మేరకు ఆంధ్రప్రదేశ్ ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటర్ డైరక్టర్ పాలరాజు 16 ఫోరెన్సిక్ బృందాలతో ఘటనా స్థలాన్ని సందర్శించారు. ఈ 16 ఫోరెన్సిక్ బృందాలలో 10 డీఎన్ఏ విశ్లేషణ బృందాలు, 4 భౌతిక విశ్లేషణ బృందాలు, 2 రసాయన విశ్లేషణ బృందాలున్నాయి.
కర్నూలు బస్సు ప్రమాదంపై భౌతిక విశ్లేషణ బృందం వాహన నిర్మాణ లోపాలను, రోడ్డు పరిస్థితులను, బస్సు ఢీకొన్న కోణం వంటి అంశాలను విశ్లేషించగా…. రసాయన బృందం అగ్నివ్యాప్తి కారణాలు, డీజిల్ ట్యాంక్, పేలుడు పదార్థాల ప్రమేయం వంటి రసాయన ఆధారాలను పరిశీలించింది. ఈ రెండు బృందాల నివేదికలు బస్సు ప్రమాదం జరిగిన కారణాలపై స్పష్టతనందించడంలో కీలక పాత్ర పోషించాయి.
డీఎన్ఏ విశ్లేషణ బృందాలు మానవ శరీర భాగాల అవశేషాలను జాగ్రత్తగా సేకరించటంలో, మృతుల కుటుంబ సభ్యుల నుంచి రక్తనమూనాలు సేకరించి డీఎన్ఏ పరీక్షల కోసం ఏపీఎఫ్ఎస్ఎల్కు తరలించే ప్రక్రియను కూడా ఫోరెన్సిక్ అధికారులు సమన్వయం చేశారు. ఫోరెన్సిక్ బృందాలు ఘటనాస్థలంలో లభ్యమైన భౌతిక, రసాయన, జీవ నమూనాల సేకరణలో, సీన్ రీక్రియేషన్ లో కీలకపాత్ర పోషించాయి.
ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ఫోరెన్సిక్ సైన్స్ లాబోరేటరీలోని డీఎన్ఏ విభాగ నిపుణులు సమన్వయంతో విశ్లేషించి, నిరంతర కృషిచేశారు. అత్యాధునిక ఆటోమేటెడ్ డీఎన్ఏ ఎలక్ట్రాక్షన్ సిస్టమ్స్, ఎస్టీఆర్ ఆధారిత డీఎన్ఏ ప్రొఫైలింగ్ టెక్నాలజీ ఉపయోగించి కేవలం 13 గంటల వ్యవధిలోనే అన్ని 19 మృతదేహాలకు సంబంధించిన డీఎన్ఏ ప్రొఫైల్స్‌ను అభివృద్ధి చేశారు. వాటిని వారి బంధువుల నమూనాలతో సరిపోల్చి… నివేదికలు అత్యంత వేగవంతంగా సంబంధిత అధికారులకు అందించారు. దీంతో మృతదేహాలను వారి బంధువులకు ఖచ్చితంగా, త్వరితగతిన అప్పగించే అవకాశం కలిగింది. అత్యంత వేగవంతంగా 24 గంటల్లోపు అన్ని నివేదికలను ఇచ్చారు.
గత ఏడాదిగా ఆంధ్రప్రదేశ్ ఫోరెన్సిక్ పరిశోధన ప్రయోగశాల 24,389 నివేదికలను అత్యంత వేగవంతంగా సమర్పించింది. డీఎన్ఏ, నార్కో, పోక్సో, మర్డర్, రేప్ కేసుల్లో నివేదికలను 3 రోజుల్లో అందజేస్తోంది. నాణ్యమైన నివేదికల ఆధారంగా 78 శాతం శిక్షల్లో ఫోరెన్సిక్ నివేదికలు క్రియాశీలకపాత్రను పోషించాయి.
ఏపీఎఫ్ఎస్ఎల్ గత సంవత్సర కాలంలో ఎన్నో సంస్కరణలు, ఆధునిక సాంకేతిక పరికరాల వలన ఎన్నో ఫలితాలను సాధించగలిగింది. డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ఈ కేసులో ఏపీఎఫ్ఎస్ఎల్ బృందం చూపిన వేగవంతమైన చర్య, సాంకేతిక నైపుణ్యం, టీమ్ వర్క్, సమర్థతను అభినందిస్తూ నేడు డీజీపీ కార్యాలయంలో జరిగిన ఒక కార్యక్రమంలో వారిని అభినందిస్తూ ప్రశంసాపత్రాలను అందజేశారు