అమరావతి: 2025 సంవత్సరానికి కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ప్రతిష్ఠాత్మక “కేంద్రీయ గృహమంత్రి దక్షిత” పతకానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఫొరెన్సిక్ సైన్స్ లాబొరేటరీ(ఏపీఎఫ్ఎస్ఎల్) డీఎన్ఏ విభాగంలో సహాయ సంచాలకుడిగా విధులు నిర్వహిస్తున్న బొమ్మకంటి ఫణిభూషన్ ఎంపికయ్యారు. ఈ సందర్భంగా డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ఫణిభూషన్ ను అభినందిస్తూ… ఫణిభూషన్ ఎంపిక రాష్ట్రానికి గర్వకారణమన్నారు. ఆయన అందించిన సేవలకు కేంద్ర ప్రభుత్వం “గృహమంత్రి దక్షత” పతకాన్ని ప్రకటించిందన్నారు.
ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ ఫొరెన్సిక్ విభాగంలో ప్రభుత్వం తీసుకువచ్చిన అనేక సంస్కరణలు, నిధులు, శాస్త్రీయ పరికరాల లభ్యత, నేరస్థల పరిశీలన, మార్గదర్శకాలు, త్వరితగతిన నేరస్థల సందర్శన, నైపుణ్యసహిత నివేదికలు, దీర్ఘకాలిక జాప్య నివేదికలను తక్షణమే నివేదించటం వంటివి ఇప్పుడు సత్ఫలితాలను ఇస్తున్నాయని అన్నారు. ఆంధ్రప్రదేశ్ ఫోరెన్సిక్ సైన్స్ లాబోరేటరీ సంక్లిష్టమైన కేసుల పరిష్కారంలో దేశంలోనే ప్రధమస్థానం సాధిస్తుందని డైరెక్టర్ పాలరాజు, ఐజీపీ అభిలషించారు. ఈ అవార్డుకు ఎంపికైన ఫణిభూషణ్ ను ఈ సందర్భంగా అభినందించారు.
కాగా, ఈ పతకం ప్రతి సంవత్సరం అక్టోబర్ 31వ తేదీన సర్ధార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా ప్రకటిస్తారు. పనిలో నిబద్ధత, వృత్తిపరమైన ఉన్నత ప్రమాణాలను ప్రోత్సహించడానికి ఈ అవార్డు ప్రదానం చేస్తున్నట్టు హోం వ్యవహరాల మంత్రిత్వశాఖ తెలిపింది.
శ్రీ ఫణిభూషణ్ మధ్యప్రదేశ్లోని డాక్టర్ హరిసింగ్ గౌర్ విశ్వవిద్యాలయం నుంచి ఫోరెన్సిక్ సైన్సులో ఎంఎస్సీ పట్టా పొందారు. ఆయన 1997 ఏపీఎఫ్ఎస్ఎల్లో శాస్త్రీయ సహాయకుడిగా చేరి 2005లో శాస్త్రీయ అధికారిగా ఎదిగి, అనంతరం 2013లో సహాయ సంచాలకులుగా పదోన్నతి పొందారు. 28 ఏళ్ళకు పైగా విశిష్ట సేవలతో, టాక్సికాలజీ, సెరాలజీ, డీఎన్ఏ విశ్లేషణ, నేరస్థల నిర్వహణ రంగాలలో విశేష నైపుణ్యం సంపాదించి, అనేక క్లిష్టమైన కేసుల పరిష్కారంలో టెక్నికల్ మార్గదర్శకత్వం అందించారు.