Suryaa.co.in

Editorial

ఎన్నికల వరకూ మళ్లీ సోముకే అధ్యక్ష కిరీటం

– ప్రకటించిన బీజేపీ నాయకత్వం
– కలసివచ్చిన నద్దా పునర్నియామకం
– సీనియర్ల ఆశలు ఆవిరి
( మార్తి సుబ్రహ్మణ్యం)

ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజును ఎన్నికల వరకూ తిరిగి అధ్యక్షుడిగా కొనసాగించాలని పార్టీ నాయకత్వం నిర్ణయించింది. ఆ మేరకు బీజేపీ జాతీయ సహ ప్రధాన కార్యదర్శి శివప్రకాష్‌జీ పార్టీ నిర్ణయాన్ని ప్రకటించారు. ఎన్నికల నేపథ్యంలో జాతీయ అధ్యక్షుడిగా, నద్దాను తిరిగి అధ్యక్షుడిగా ప్రకటించిన విషయం తెలిసిందే.

అందులో రాష్ట్ర అధ్యక్షులను కూడా ఎన్నికలు ముగిసే వరకూ అధ్యక్షులుగా కొనసాగిస్తూ, నద్దా నిర్ణయం తీసుకున్నారు. ఆ క్రమంలో సాంకేతికంగా పార్టీ నియమావళి ప్రకారం పదవీకాలం పూర్తయినప్పటికీ, సోము వీర్రాజు ఎన్నికలయ్యే వరకూ అధ్యక్షులుగా కొనసాగనున్నారు. ఆ మేరకు ఆయన నియామకాన్ని రాష్ట్ర కార్యవర్గం కూడా ఆమోదించింది.

కాగా.. సోము వీర్రాజును తొలగిస్తారంటూ, కొద్దినెలల నుంచి పార్టీ వర్గాల్లో జరుగుతున్న ప్రచారానికి దీనితో తెరపడినట్టయింది. రానున్న ఎన్నికల వరకూ సోము వీర్రాజు రాష్ట్ర అధ్యక్షుడిగా కొనసాగుతారు. నద్దాతోపాటు దేశంలోని అన్ని రాష్ట్రాల అధ్యక్షులను, తిరిగి కొనసాగించాలన్న నిర్ణయమే దానికి కారణం. ఒకరకంగా నద్దాను తిరిగి కొనసాగించడం సోము వీర్రాజు కలసివచ్చింది.

ఇదిలాఉండగా సోము స్థానంలో, అధ్యక్షుడిగా పలువురి పేర్లు కూడా ప్రచారంలోకి వచ్చాయి. కోర్ కమిటీ సభ్యులతో సోము వీర్రాజుకు సరిపడకపోవటం, సీనియర్లు ఆయన పనితీరుపై నాయకత్వానికి ఫిర్యాదు చేసిన నేపథ్యంలో, ఆయన మార్పుపై ఊహాగానాలు వెలువడ్డాయి. ఇటీవలి రాష్ట్ర కార్యవర్గ సమావేశాలకు సైతం కోర్‌కమిటీ సభ్యులు డుమ్మా కొట్టిన విషయం తెలిసిందే. తాజా ప్రకటనతో వారి ఆశలు ఆవిరయినట్టయింది.

ఇదిలాఉండగా.. నద్దాను జాతీయ అధ్యక్షుడిగా కొనసాగించిన నేపథ్యంలో, సోము వీర్రాజును కూడా తిరిగి కొసాగిస్తారా? లేదా? అని సీనియర్లు ఆసక్తిగా వేచిచూశారు. పార్టీ నిర్ణయం బట్టి, తమ రాజకీయ భవిష్యత్తు కార్యాచరణ ప్రకటించాలని భావించారు. మరి ఇప్పుడు ఆయననే ఎన్నికల వరకూ అధ్యక్షుడిగా కొనసాగించిన నేపథ్యంలో, సీనియర్ల నిర్ణయం ఎలా ఉండబోతోందో వేచిచూడాలి.

LEAVE A RESPONSE