-అందెశ్రీ పాటకు కీరవాణి సంగీతంపై వివాదం
– కీరవాణికి ఆస్కార్ వచ్చినప్పుడు సన్మానించిన కేసీఆర్
– ఇంకా ఆంధ్రావాళ్ల పెత్తనమేంటన్న ఆర్ఎస్ ప్రవీణ్
– అంతకుముందు తెలంగాణ మ్యుజీషియన్ అసోసియేషన్ అభ్యంతరం
– మేఘా కృష్ణారెడ్డి కాళేశ్వరం కట్టినప్పడు మాట్లాడలేదేం?
-యాదాద్రి డిజైన్ ఆనంద్ సాయి చేసినప్పుడు గొంతు పెగలలేదేం?
-అశోక్ తేజ అమరావతి గీతం రాసినప్పుడు అడ్డుకోలేదేం?
– బీఆర్ఎస్ పై సోషల్మీడియా వ్యంగ్యాస్త్రాలు
( మార్తి సుబ్రహ్మణ్యం)
“ఈమధ్యనే బీఆర్ఎస్లో చేరిన ప్రవీణ్ కుమార్ అసలు కేసీఆర్ స్కూలు సిలబస్ సరిగా స్టడీ చేసినట్లులేరు. సారు కెమిస్ట్రీ, పాలిటిక్స్, అకౌంట్స్ ఇంకా స్టడీ చేయకుండా మాట్లాడితే ఆయనకే ఇబ్బంది. ముందు ప్రవీణ్, కేసీఆర్ సారు స్కూలు సిలబస్ ను స్టడీ చేసి మాట్లాడితేనే ఇజ్జత్ ఉంటుంది” – తెలంగాణ రచయత అందెశ్రీ రాసిన జయహే జయహే తెలంగాణ పాటకు స్వరసంగీతం అందించే బాధ్యతను, తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి.. ఆంధ్రా సంగీత దర్శకుడు, ఆస్కార్ అవార్డు గ్రహీత కీరవాణికి అప్పగించడంపై బీఆర్ఎస్ నేత ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్ ఖండించిన క్రమంలో,
సోషల్మీడియాలో వెల్లువెత్తిన వ్యంగ్యాస్త్రాల్లో ఇదొక అస్త్రం!
కీరవాణికి జయజయహే తెలంగాణ పాటకు సంగీత బాధ్యతలు అప్పగించిన సీఎం రేవంత్.. స్వయంగా ఆయన ఆఫీసుకు వెళ్లి, స్వరాల కూర్పుపై చర్చించారు. ఆ ఫొటోలు మీడియాలో వచ్చినవే. అక్కడ పాట రాసిన అందెశ్రీ కూడా ఉండటాన్ని విస్మరించకూడదు. అయితే ఆంధ్రా వాడయిన కీరవాణికి, తెలంగాణ పాట సంగీత బాధ్యతలు అప్పగించడం ఏమిటి? అన్నది ఇప్పుడు మొదలయిన ‘పాట’ పంచాయతీ! పదేళ్లూ తెలంగాణను వెలిగించిన బీఆర్ఎస్ పార్టీనే, ఈ పంచాయితీకి తెరలేపటం విశేషం. ఆ పార్టీలో ఇటీవలే చేరి, ఎంపీ సీటుకు పోటీచేసిన మాజీ ఐపిఎస్ అధికారి ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్ దానికి సంబంధించి లేటెస్టుగా ఒక ట్వీటు చేశారు.
అందెశ్రీ తెలంగాణ రాష్ట్ర గీతంపై ఆంధ్రా సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి పెత్తనం ఏంది బై? గీత సర్వకల్పనకు మళ్లీ ఇప్పుడేం అవసరమొచ్చింది? అయినా తెలంగాణ కవులపై ఆంధ్ర సంగీత దర్శకుల పెత్తనం ఇంకెంత కాలం? అదీ తెలంగాణ వచ్చి పదేళ్లయినంక ??”. ఇదీ ప్రవీణ్ కుమార్ ట్వీటిన ట్వీటు. ఆ ట్వీట్లో జత చేసిన ఫొటోకు, సీఎం రేవంత్ రెడ్డి- కీరవాణితో పాటు పాట రాసిన అందెశ్రీ చర్చిస్తున్న దృశ్యం కూడా కనిపిస్తోంది.
అన్నట్లు.. అందెశ్రీ రాసిన ఆ పాటను రాష్ట్రగీతంగా ప్రకటించకుండా కేసీఆర్ సర్కారు పదేళ్లు పాతరేశారు. రేవంత్రెడ్డి సీఎం అయితేనే గానీ ఆ పాటకు రాష్ట్రగీతం మోక్షం కలగలేదు. దానిపై స్వయంగా కవి అందెశ్రీ ఆవేదన ఇప్పుడు సోషల్మీడియాలో పరవెళ్లుతోంది. ‘కేసీఆర్ నియంతృత్వం-అహంకారానికి నా పాట బలయిపోయిందన్నది అందెశ్రీ ఆవేదన. అది వేరే విషయం.
దీనిపై సోషల్మీడియాలో బీఆర్ఎస్పీ వ్యంగ్యాస్త్రాలు శరపరంపరగా షురవయ్యాయి. మరికొందరు ఔత్సాహికులయితే.. టీఆర్ఎస్ పదేళ్ల జమానలో అదే ఆంధ్రావాళ్లకు పట్టం కట్టిన వైనాన్ని, ఫొటోలతో సహా గుర్తు చేసి సర్ఫ్ ఉతికి ఆరేస్తున్నారు. “మొన్నీమధ్యనే బీఆర్ఎస్ స్కూల్లో చేరిన ప్రవీణ్ కు అసలు కేసీఆర్ సిలబస్ గురించి ఏమీ తెలియదు. అసలాయన మొదటిపేజీ కూడా చదవలేదని ఆ ట్వీటే చెబుతుంది” అంటూ సెటైర్ల వర్షం కురిపిస్తున్నారు.
ఉద్యమ సమయంలో తెలంగాణ సమాజాన్ని ఉర్రూతలూగించి, పిడికిలి బిగించేలా చేసిన జయహే జయహే తెలంగాణ పాట పాడింది ఎవరో తెలుసా? ప్రముఖ నేపథ్య గాయకుడు రామకృష్ణ, ఆయన ఆంధ్రా ఆయనే. మరి రామకృష్ణతో జయజయహే తెలంగాణ పాట పాడించిప్పుడు ఎందుకు అభ్యంతరం చెప్పలేదన్నది నెటిజన్లు సంధిస్తున్న ప్రశ్న. ‘తెలంగాణ తిరుపతి’గా మార్చిన యాదాద్రి దేవాలయాన్ని, డిజైన్ చేసింది ఎవరంటే అదే ఆంధ్రాకు చెందిన ఆనందాయి. స్వయంగా కేసీఆర్ సారే ఆయనకు ఆ బాధ్యతలు కట్టబెట్టిండు మరి! ఇక జీయర్ స్వామి ఉన్నారు కదా? ఆ ఆంధ్రాకు చెందిన ఆ స్వామిని, తెలంగాణ స్వామిగా మార్చిన ఘనత కూడా సారుదే. అంతేనా.. విశాఖ స్వామి స్వరూపానందకు హైదరాబాద్ లో గజం రూపాయి చొప్పున భూమిని ధారాదత్తం చేసింది కూడా మన సారే!
అక్కడితో అయిపోలేదు తమ్మీ… కాళేశ్వరం ప్రాజెక్టును స్వయంగా డిజైన్ చేసి, అసెంబ్లీలో వాటి ఎత్తుపల్లాలను టార్చిలైటు వేసి మరీ వివరించిన మన గ్రేట్ కాశేశ్వరరావు, ఆ ప్రాజెక్టు ఎవరికి ఇచ్చారో తెలుసా? ఆంధ్రాకు చెందిన మేఘా కంపెనీకి. ది గ్రేట్ కాంట్రాక్టర్ మేఘా కృష్ణారెడ్డి కంపెనీకి కట్టబెట్టిండు. అసలు ఆ ప్రాజెక్టు ఓపెనింగు ఏపీ సీఎం జగన్రెడ్డి సాక్షిగా జరిగిందే. ఆ మాటకొస్తే.. ఆ రెడ్డి ఒక్కడికే కాదు. ఇంకా వైసీపీకి చెందిన చాలామంది రెడ్లకు, తెలంగాణ కాంట్రాక్టు-సబ్ కాంట్రాక్టులు కట్టబెట్టిన ఘనత మన సారుదే. ఇక గొర్రెలు-గేదల పథకంలో లబ్ధిపొందిన వారిలో సగానికి పైగా గోదావరి జిల్లాలకు చెందిన కాంట్రాక్టర్లే.
ఇంకిట్లా సారు ఘనత గురించి చెప్పుకుంటూ రాస్తే రామాయణం. మాట్లాడితే మహాభారతం అవుతుంది. అన్నట్లు.. ఇప్పుడు జయజయహే తెలంగాణ పాటకు ఆంధ్రా సంగీత దర్శకుడికి బాధ్యతలు అప్పగించటాన్ని ఖండించిన ప్రవీణ్ కుమార్ కు .. కేసీఆర్ సారు సీఎంగా ఉన్నప్పుడు, ఇదే కీరవాణి అనే ఆంధ్రా సంగీత దర్శకుడికి ఆస్కార్ అవార్డు లభించిన్పుడు.. ఇదే కేసీఆర్ సర్కారు మహా సంబరపడి, ఆయనను పిలిపించి సన్మానం చేసిన విషయం గుర్తుకురాకపోవడమే వింత.
అయితే అప్పుడు ప్రాంతీయ పార్టీ టీఆర్ఎస్ అధ్యక్షుడు కాదు. బీఆర్ఎస్ అనే భారతీయ-జాతీయ- భావాలున్న పార్టీ కాబట్టి.. బహుశా అలాంటి విశాల జాతీయ హృదయంతో ఇదే కీరవాణిని సన్మానించారు. మరిప్పుడు అధికారంలో లేరు కాబట్టి.. పాట పంచాయితీ పెట్టినట్లున్నారు. అన్నట్లు మేఘా కృష్ణారెడ్డికి కాళేశ్వరం కాంట్రాక్టు ఇచ్చినప్పుడు.. కృష్ణారెడ్డి కంపెనీ టాలెంట్ చూసి, కాంట్రాక్టు ఇచ్చినట్లు అప్పటి మంత్రులు సెలవిచ్చారు. మరి ఆ సూత్రం కీరవాణికి వర్తించదేమో?!.. అన్నది సోషల్ మీడియాలో బీఆర్ఎస్పై వెల్లువెత్తుతున్న విమర్శనాస్త్రాలు.
స్వర సంగీత కూర్పుపై స్వయంగా కీరవాణితో, సీఎం రేవంత్రెడ్డి చర్చించిన సమయంలో.. అసలు ఆ పాట రాసిన రచయిత అందెశ్రీ కూడా అక్కడే ఉండటం విశేషం. ఇప్పటిదాకా ఆయన తన పాటకు సంగీత బాధ్యతను కీరవాణికి ఇవ్వడంపై అభ్యంతరం చెప్పలేదు. మరి మౌనం అంగీకారన్నట్లే కదా? ” ఇది ఊళ్లో పెళ్లికి కుక్కల హడావిడి లెక్క ఉంది. అసలు పాట రాసిన అందెశ్రీ అన్న మౌనంగా ఉంటే, మిగిలినవాళ్లు మొరుగుతున్నరు. అట్లాంటి అభ్యంతరాలుంటే మాట్లాడాల్సింది అందెశ్రీ అన్న మాత్రమే. వీళ్లు కాదు కదా” అని నెటిజన్లు విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు.