Suryaa.co.in

Telangana

సృజ‌నాత్మ‌క‌త‌కు అంత‌రిక్షమే హ‌ద్దు

స్పేస్ టూన్ : కార్టూన్ ఎగ్జిబిష‌న్ లో పాల్గొన్న ఇస్రో చైర్మ‌న్ సోమ‌నాథ్, మంత్రి జూప‌ల్లి

హైద‌రాబాద్: సృజ‌నాత్మ‌క‌త‌కు అంత‌రిక్షమే హ‌ద్దని, ఎంచుకున్న రంగంలో అత్యున్న‌త స్థాయికి ఎద‌గాల‌ని ఇస్రో చైర్మ‌న్ డాక్ట‌ర్ సోమ‌నాథ్ అన్నారు.

ర‌వీంద్ర‌భార‌తీలో తెలంగాణ భాషా, సాంస్కృతిక శాఖ స‌హ‌కారంతో తెలుగు రీజియ‌న్ మ‌ళ‌యాళీ అసోసియేష‌న్ , హైద‌రాబాద్ ఫోరమ్ ఫ‌ర్ పొలిటిక‌ల్ కార్టూనిస్ట్స్ అసోసియేష‌న్ ఆద్వ‌ర్యంలో స్పేస్ టూన్ పేరిట కార్టూన్ ఎగ్జిబిష‌న్ నిర్వ‌హించిన కార్యక్ర‌మంలో ఇస్రో చైర్మ‌న్ డాక్ట‌ర్ సోమ‌నాథ్ క‌లిసి ప‌ర్యాట‌క‌, సాంస్కృతిక శాఖ మంత్రి జూప‌ల్లి కృష్ణారావు పాల్గొన్నారు. తెలంగాణ జాన‌ప‌ద గిరిజ‌న క‌ళారూపాల సంప్ర‌దాయంలో గుస్సాడీ, డ‌ప్పు కాళాకారుల విన్యాసాల‌తో సోమ‌నాథ్ కు ఘ‌న‌స్వాగ‌తం ప‌లికారు.

ఈ సంద‌ర్భంగా సోమ‌నాథ్ మాట్లాడుతూ.. యువ‌కుడిగా ఉన్న‌ప్పుడు తాను కార్టూన్లు వేసేవాడ‌న‌ని, త‌న‌కు కార్జూనిస్ట్ లు అన్న కార్టూన్ లో ఉండే చ‌మ‌త్కారం అన్న ఎంతో ఇష్ట‌మ‌ని అన్నారు. ప్ర‌ఖ్యాత కార్టూన్ సిరీస్ టిన్ టిన్ లో వేసిన స్పేస్ షిప్ కార్టూన్ త‌నను ఎంతో ఆశ్చ‌ర్య‌ప‌రిచేద‌ని , ఇప్ప‌డుభారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) కు అధినేత కావడం ఆనందంగా ఉంద‌ని చెప్పారు.

భార‌త‌దేశం అతి త‌క్కువ కాలంలో, అతి త‌క్కువ బ‌డ్జెట్ తో విజ‌యాలు సాధిస్తుంద‌ని, దానికి కార‌ణం మ‌న సైంటిస్టులే అని.. విక్రం సార‌బాయ్ తో మొద‌లెపెట్టిన ప్ర‌స్థానం ఇప్పుడు చంద్ర‌యాన్ 3 వ‌ర‌కు ఎంతో ప్ర‌గ‌తి సాధించింద‌ని తెలిపారు. కొత్తగా ఈ రంగాన్ని ఎంచుకునే వారికి సహకారం, ప్రోత్సాహం అందించి కొత్త కార్టూనిస్టులను తీర్చిదిద్దాల్సిన బాధ్యత సీనియర్ కార్టూనిస్ట్ లపై ఉంద‌ని వ్యాఖ్యానించారు.

స్పేస్ థీమ్ తో కార్టూన్ ఎగ్జిబిష‌న్ ను ఏర్పాటు చేసిన భాషా, సాంస్కృతిక శాఖ‌ను ఈ సంద‌ర్భంగా అభినందించారు. అంత‌రిక్ష ప‌రిశోధ‌న‌కు సంబంధించి విద్యార్థులు అడిగిన ప్ర‌శ్న‌ల‌కు సోమనాథ్ స‌మాధానిమిచ్చారు.

అంత‌కుముందు మంత్రి జూప‌ల్లి మాట్లాడుతూ… కార్టూన్‌ అంటే మూడక్షరాలే. కానీ.. ఆ కార్టూన్‌లో కనిపించే మూడు గీతల్లోనే ముప్పై అర్థాలు దాగి ఉంటాయన్నారు. కార్టూన్లు-ఆలోచింపజేస్తాయని… అందుకే కార్టూన్లంటే అందరికీ ఇష్టమేన‌ని, కార్టూన్ అసామాన్యులనే కాదు, సామాన్యులను కూడా ప్రభావితం చేయగల కళ అని అభిప్రాయ‌ప‌డ్డారు. ప్రముఖ కార్టూనిస్టులు కె. శంకర్ పిళ్ళై, ఆర్‌కె లక్ష్మణ్, ఇ.పి. ఉన్నీ లాంటి ఎందరో కార్టూనిస్టులు కార్టూన్ రంగాన్ని సుసంపన్నం చేసారని తెలిపారు. సమకాలీన రాజకీయాలపై ఆర్కే ల‌క్ష్మ‌ణ్ కార్టూన్లు చాలా కటువుగా ఉండేవ‌ని చెప్పారు. ప్రస్తుతం అన్ని కళాకారులతో పాటు కార్టూనిస్టులకు కూడా కేరాఫ్ అడ్రస్ గా తెలంగాణ ఉంద‌ని, అందుకే తెలంగాణ ప్రభుత్వం కార్టూనిస్టులను కూడా సగౌరవంగా ప్రోత్సహిస్తూ వస్తున్నదని పేర్కొన్నారు.

ఈ కార్యక్ర‌మంలో విద్యా, బీసీ సంక్షేమ శాఖ ముఖ్య కార్య‌ద‌ర్శి బుర్రం వెంక‌టేష్, భాషా, సాంస్కృతిక శాఖ సంచాల‌కులు మామిడి హ‌రికృష్ణ‌, CTRMA, TEDS & CLIC అధ్య‌క్షులు లిబి బెంజమిన్, కేర‌ళ కార్టూన్ అకాడ‌మీ చైర్మ‌న్ సుధీర్ నాథ్, హైద‌రాబాద్ ఫోరమ్ ఫ‌ర్ పొలిటిక‌ల్ కార్టూనిస్ట్స్ అసోసియేష‌న్ ప్రెసిడెంట్ శంక‌ర్, కార్య‌ద‌ర్శి మృత్యుంజ‌య్, కార్టూనిస్టులు సుభాని, న‌ర్సిం, వెంక‌టేష్, రాకేష్, త‌దిత‌రులు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE