– ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టేసిన హైకోర్టు
– ఇక విజయపాల్ అరెస్టే తరువాయి
– నేడు, రేపట్లో అరెస్టు చేసే అవకాశం?
– హైకోర్టు తీర్పుపై రఘురామరాజు హర్షం
– సునీల్ అరెస్టు కూడా ఖాయమని వ్యాఖ్య
అమరావతి: నరసాపురం మాజీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు పై థర్డ్ డిగ్రీ ప్రయోగించిన కేసు లో అప్పటి దర్యాప్తు అధికారి విజయ పాల్ కు హైకోర్టు లో చుక్కెదురైంది.
విజయ పాల్ కు ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు న్యాయస్థానం నిరాకరించింది. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు ఈ మేరకు తీర్పు ఇచ్చింది.
నరసాపురం మాజీ ఎంపీ, ఉండి ఎమ్మెల్యే, కనుమూరి రఘురామకృష్ణంరాజు కేసులో పోలీసులు విచారణ వేగవంతం చేశారు. ఆయనపై హత్యాయత్నం, థర్డ్ డిగ్రీ ప్రయోగించిన పోలీసు అధికారులు, సిబ్బందిని అరెస్టు చేయనున్నారు. ఆ మేరకు నాటి పోలీసు అధికారి విజయపాల్ యాంటిసిపేటరీ బెయిల్‌ను హైకోర్టు రద్దు చేసింది. దానితో పాల్ అరెస్టుకు మార్గం సుగమమయింది.
అప్పటి సీఎం జగన్మోహన్‌రెడ్డిపై, రఘురామరాజు అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ..2021లో ఆయనపై దేశద్రోహం కింద కేసు నమోదుచేసిన సీఐడీ అధికారులు, ఆ ఏడాది మే 14న రఘురామరాజు జన్మదినం రోజున, ఆయన్ను హైదరాబాద్ నుంచి బలవంతంగా గుంటూరు సీఐడీ ప్రాంతీయ కార్యాలయానికి తీసుకొచ్చారు.
ఆరోజు రాత్రి కస్టడీలో తనపై థర్డ్ డిగ్రీ ప్రయోగించి హత్యాయత్నానికి పాల్పడినట్లు రఘురామరాజు ఇచ్చిన ఫిర్యాదు మేరకు.. ఈ ఏడాది జూలై 11న గుంటూరు నగరంపాలెం పోలీసు సేషన్లో కేసు నమోదైంది.
అప్పటి సీఐడీ చీఫ్ పీవీ సునీల్ కుమార్(ఏ-1), అప్పటి నిఘా విభాగం అధిపతి పీఎస్ఆర్ ఆంజనేయులు (ఏ-2), మాజీ సీఎం జగన్మోహన్‌రెడ్డి (ఏ-3), సీఐడీ అదనపు ఎస్పీ విజయపాల్(ఏ-4), జీజీహెచ్ సూపరింటెండెంట్ ప్రభావతి (ఏ-5)తదితరులపై ఐపీసీ 120బీ, 166, 167, 197, 307, 326, 465, 506(34) తదితర సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
సునీల్ అరెస్టు కూడా తప్పదు: రాజు
కాగా తనను కస్టోడియల్ టార్చర్ చేసేందుకు అనువైన వాతావరణం సృష్టించిన విజయపాల్‌కు, హైకోర్టు ముందస్తు బెయిల్ పిటిషన్ తిరస్కరించడం శుభపరిణామమని ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజు హర్షం వ్యక్తం చేశారు. త్వరలో ఐపిఎస్ సునీల్, మాజీ ఎస్పీ మహిపాల్ కూడా అరెస్టు కావడం ఖాయమని జోస్యం చెప్పారు. న్యాయం ఒకింత ఆలస్యంగా జరిగినా.. కేసులో విజయపాల్ అరెస్టు మలుపు కానుందన్నారు. అయితే ఈ కేసులో సునీల్, ఆంజనేయులు అరెస్టయితేనే, తనకు ఒక బాధితుడిగా సంపూర్ణ న్యాయం లభించినట్టని ఆయన వ్యాఖ్యానించారు.