Suryaa.co.in

Editorial

పవన్‌కు మద్దతుపై బీజేపీలో చీలిక

– నాయకత్వం మౌనంపై బీజేపీ సీనియర్ల ఆగ్రహం
– వైసీపీ అనుకూల వర్గం మౌనంపై అసంతృప్తి
– నేతలను మాట్లాడవద్దంటూ నాయకత్వం లక్ష్మణరేఖ
( మార్తి సుబ్రహ్మణ్యం)
మిత్రపక్షమైన జనసేనాధిపతి పవన్ కల్యాణ్‌పై వైసీపీ నేతలు, మంత్రులు చేస్తున్న విమర్శలపై తమ పార్టీ రాష్ట్ర నాయకత్వం మౌనంగా ఉండ టం మిత్రపక్ష ధర్మం కాదని ఏపీ బీజేపీ సీనియర్లు మండిపడుతున్నారు. పవన్‌నుద్దేశించి ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మొదలుకొని.. మంత్రులు- సాధారణ నేతల వరకూ చేస్తున్న ఆరోపణలను, తమ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ఇప్పటివరకూ ఖండించని వైనంపై బీజేపీ రెండుగా చీలిపోయింది. రాష్ట్ర కార్యదర్శి నాగోతు రమేష్‌నాయుడు మినహా, ఒక్క బీజేపీ నేత కూడా పవన్‌ను సమర్ధించకపోవడంతో.. అసలు బీజేపీ-జనసేన పొత్తు ఉందా? లేదా? అన్న సందేహాలు పార్టీ వర్గాల్లో తెరపైకొచ్చాయి.
జనసేనాధిపతి పవన్‌పై.. గత రెండు రోజుల నుంచి వైసీపీ నాయకత్వం శరపరంపరగా విమర్శనాస్త్రాలు సంధిస్తున్న నేపథ్యంలో, జనసేన నేతలు తప్ప ఆ పార్టీ మిత్రపక్షమైన బీజేపీ నాయకత్వం కనీస స్థాయిలో తమకు దన్నుగా రాని నిర్లక్ష్య వైఖరిపై, అటు జనసేనలో కూడా ఆగ్రహం వ్యక్తమవుతోంది. తమ అధినేత పవన్‌ ఎన్నో సందర్భాల్లో మోదీకి బాసటగా నిలిస్తే, ఇప్పుడు రాష్ట్ర బీజేపీ నాయకత్వం కనీస స్థాయిలో తమకు నైతిక మద్దతునివ్వకపోవడాన్ని జనసేన జీర్ణించుకోలేకపోతోంది. రాష్ట్ర అధ్యక్ష పగ్గాలు అందుకున్న తర్వాత పవన్ వద్దకు వచ్చి, ఆశీర్వాదం తీసుకున్న సోము వీర్రాజు.. ఇప్పటిదాకా వైసీపీపై ఎదురుదాడి చేయకపోవడాన్ని జనసేన నేతలు ప్రత్యేకంగా ప్రస్తావిస్తున్నారు. పైగా బీజేపీలోని కాపు నేతలు కూడా, పవన్‌కు దన్నుగా లేకపోవడంపై జనసేన నేతలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.
అటు బీజేపీ కూడా పవన్‌కు మద్దతునిచ్చే అంశంలో రెండుగా చీలిపోయింది. పవన్‌కు మద్దతునిచ్చేందుకు సిద్ధంగా ఉన్న సీనియర్లకు, రాష్ట్ర నాయకత్వం లక్ష్మణరేఖ విధించడంతో మౌనంగా ఉండాల్సిన అనివార్య పరిస్థితి ఏర్పడింది.
‘నాయకత్వం అనుమతి లేకుండా ఎవరూ మీడియా ముందుకు వెళ్లకూడదని సోము వీర్రాజు, సునీల్ దియోధర్ కోర్ కమిటీలో లక్ష్మణ రేఖ గీశారు. సంఘటనా మంత్రి మధుకర్ కూడా దానిని వ్యతిరేకించలేదు. దానితో ఎవరూ మాట్లాడలేని పరిస్థితి ఉంది. పవన్ కల్యాణ్ వ్యాఖ్యలను సమర్ధించడం మిత్రధర్మం. అసలు ఈపాటికే మా అధ్యక్షుడు వీర్రాజు ,వైసీపీ తీరుకు వ్యతిరేకంగా స్వయంగా ప్రకటన ఇవ్వాల్సి ఉంది. కానీ ఆయనకు ప్రభుత్వంతో ఏం మొహమాటాలున్నాయో మాకేం తెలుసు? కనీసం నాగోతు రమేష్‌నాయుడయినా స్పందించి పార్టీ పరువు నిలబెట్టారు. నాయకత్వం సీనియర్ల నోళ్లు మూయడం వల్లే ఈ దుస్థితి ఏర్పడింది. ఇదంతా జనసేనను దూరం చేసుకునే చర్యలేనన్న అభిప్రాయం మా పార్టీలో ఉంద’ని ఉత్తరాంధ్రకు చెందిన బీజేపీ సీనియర్ నేత ఒకరు వ్యాఖ్యానించారు.
వైసీపీ మంత్రులు, ఎమ్మల్యేలంతా.. మూకుమ్మడిగా రోజు మార్చి రోజు పవన్‌పై మాటల దాడి చేస్తున్నా తమ పార్టీ.. జనసేనకు మద్దతునివ్వకుండా మౌనంగా ఉండటం బట్టి.. అసలు జనసేనతో తమ పార్టీకి పొత్తు కొనసాగుతుందా? లేదా? జనసేన తమకు మిత్రపక్షమేనా అన్న సందేహాలు వస్తున్నాయని బీజేపీ సీనియర్లు వ్యాఖ్యానిస్తున్నారు. వైసీపీ సర్కారుపై పోరాటం చేసే అంశంలో పార్టీ రెండుగా చీలడం వల్ల, పార్టీలో గందరగోళం నెలకొన్న మాట వాస్తవమేనని బీజేపీ నేతలు అంగీకరిస్తున్నారు. వైసీపీకి అనుకూలంగా ఉన్న నలుగురైదుగురు అగ్రనేతలు, తమ పార్టీలో వైసీపీ కోవర్టుగా వ్యవహరిస్తున్నారన్న చర్చ బీజేపీలో చాలాకాలం నుంచీ జరుగుతోంది. ఇటీవల హైకోర్టు తీర్పుతో రద్దయిన టీటీడీ బోర్డులో పదవుల కోసం, తమ పార్టీ అగ్రనేత ఒకరు.. సీఎంకు కొందరి పేర్లు సిఫార్సు చేశారన్న కొత్త విషయం, పవన్ ఎపిసోడ్‌లో బయటపడటం విశేషం.
‘ సీఎంకు, మరో రాజ్యసభ వైసీపీ ఎంపీకి సన్నిహితంగా ఉండే మా పార్టీ అగ్రనేత ఒకరు ఇప్పటికే మైనింగ్, ఇసుక క్వారీతో ఆర్ధిక ప్రయోజనం పొందారన్నది బహిరంగ రహస్యమే. ఒక స్వామి చెప్పినట్లు మా పార్టీ అగ్రనేత నడుచుకుంటున్నారు. మళ్లీ ఆయనే టీటీడీకి ఇద్దరు పేర్లు సిఫార్సు చేశారంటున్నారు. అంటే పార్టీని టోకుగా వైసీపీకి తాకట్టు పెట్టే ప్రయత్నాలు జరుగుతున్నట్లు అర్ధమవుతూనే ఉంది. కానీ ఇవన్నీ మా రాష్ట్ర ఇన్చార్జి మురళీధర్‌రావుకు తెలియదు. ఆయన అసలు ఏపీనే పట్టించుకోరు. ఏపీపై ఆసక్తి లేని ఆయనకు ఆ పదవి ఎందుకిచ్చారో మాకూ తెలియదు. మురళీధర్‌రావు పట్టించుకోకపోవడంతో రాష్ట్రంపై పెద్దగా అవగాహన లేని, బయట రాష్ట్రానికి చెందిన సునీల్ దియోధర్ పార్టీపై పెత్తనం చేస్తున్నారు.ఆయనకు పార్టీ-నాయకులపై అవగాహన సున్నా. ఇప్పుడు మా పార్టీ సునీల్ దియోధర్, సోము వీర్రాజు, మధుకర్ ఆలోచనలు- మేధస్సు- దయాధర్మంపై మనుగడ సాగిస్తోంది. పవన్ కల్యాణ్‌కు మద్దతివ్వకపోతే ఆయన మా పార్టీతో ఎందుకు కలిసి ఉంటారన్న కనీస రాజకీయ స్పృహ లేనివారంతా పెద్ద పదదవుల్లో ఉండటం మా ఖర్మ’’ అని బీజేపీలో కొన్ని దశాబ్దాల నుంచి పనిచేస్తున్న ఓ సీనియర్ నేత వ్యాఖ్యానించారు.
అయితే.. పవన్‌కు మద్దతుగా నిలిస్తే.. అటు ప్రభుత్వంలోని పెద్దలకు ఎక్కడ దూరమవాల్సివస్తుందోనన్న భయం, బీజేపీలోని మరో వర్గంలో కనిపిస్తోంది. ఈ వర్గం నేతలు, ప్రభుత్వంతో ఏదో ఒక మార్గంలో లబ్థిపొందుతోందన్న ఆరోపణలు, చాలాకాలం నుంచి సొంత పార్టీలోనే వినిపిస్తున్నాయి. దీనిపై తూర్పు గోదావరి జిల్లాకు చెందిన ఓ నేత సోషల్‌మీడియాలో చేసిన వ్యాఖ్యలు పార్టీలో కలకలం సృష్టించాయి. కోర్ కమిటీ సమావేశంలో పాటు, కీలకమైన సమావేశాల్లో ‘తమకు పై నుంచి ఆదేశాలు’ వచ్చాయని చెబుతున్న కొందరు అగ్రనేతలు, తమ మాట చెల్లించుకుంటూ వస్తున్నారు. అయితే ఆ ‘పైనున్న’ వారెవరన్నది ఇప్పటివరకూ సీనియర్లకు సైతం స్పష్టం చేయకపోవడం మరో విశేషం. పైనున్న వారి పేరుతో ముగ్గురు నేతలు, తమ వ్యక్తిగత నిర్ణయాలను పార్టీపై రుద్దుతున్నారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
‘ మా పార్టీ నాయకత్వానికి ఎవరితో ఎలా డీల్ చేయాలో తెలియదు. ఇప్పుడు మా పార్టీ ఉన్న పరిస్థితిలో ఎవరైనా పవన్‌ను వదులుకుంటారా? ఆయనపై వైసీపీ నాయకత్వం మాటల దాడి చేసినప్పుడే, మా నాయకత్వం వైసీపీపై ఎదురుదాడి చేయాల్సి ఉంది. పట్టుమని పది ఓట్లు కూడా వేయించలేని కౌన్సిలర్ స్థాయి నేతలకు పెత్తనం, పదవులు ఇస్తే పార్టీ ఇంతకుమించి ఎలా ఉంటుంది? రాష్ట్రంపై సరైన అంచనా లేకుండా నిర్ణయాలు తీసుకున్న మా పార్టీ జాతీయ నాయకత్వం, ఇప్పుడు తలపట్టుకున్నా ఉపయోగం ఏమీ లేదు. మా వాళ్లంతా తిండికి తిమ్మరాజులు, పనికిపోతరాజులు. ఎక్కడకు వెళ్లినా తిండిగురించి ఆలోచించేవారికి, పార్టీ గురించి ఆలోచించే తీరిక ఎక్కడుంటుంది. పవన్ వ్యవహారశైలి తెలిసి కూడా అందుకనుగుణంగా వెళ్లడం లేదంటే.. మా పార్టీకి ఏపీపై ఎలాంటి ఆసక్తి లేదని స్పష్టమయిపోయింద’ని, తూర్పుగోదావరి జిల్లాకు చెందిన ఓ సీనియర్ నేత వ్యాఖ్యానించారు.

ఎంపీలకూ మాట్లాడే స్వేచ్ఛ లేదా?

కాగా గత కొంతకాలం నుంచి రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలపై పార్టీ ఎంపీలు కూడా మౌనంగా ఉండటంపై బీజేపీలో విస్మయం వ్యక్తమవుతోంది. కేంద్ర మాజీ మంత్రి, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి పురందేశ్వరి, మాజీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణతో పాటు.. ఎంపీలు సుజనా చౌదరి, సీఎం రమేష్, టిజి వెంకటేష్ ప్రభుత్వ విధానాలపై స్పందించకుండా, మౌనంగా ఉండటం పార్టీ వర్గాల్లో చర్చనీయాంశమయింది. అయితే యుపి వ్యవహారాల్లో బిజీగా ఉంటున్న జాతీయ కార్యదర్శి సత్యకుమార్, రాష్ట్రానికి వచ్చినప్పుడల్లా వివిధ సమస్యలపై స్పందిస్తున్నారు. ట్విట్టర్‌లో కనిపిస్తున్నారు. కానీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్న పురందేశ్వరి మాత్రం భూతద్దం వేసి వెతికినా ఎక్కడా కనిపించడం లేదని, ఒకవేళ కనిపించినా వైసీపీ సర్కారుపై పెదవి విప్పడం లేదని సీనియర్లు విశ్లేషిస్తున్నారు. ఎలాంటి పదవి లేనందువల్ల మాజీ అధ్యక్షుడయిన కన్నా లక్ష్మీనారాయణ, గుంటూరులో జరిగే పార్టీ కార్యక్రమాలకే పరిమితమయ్యారంటున్నారు.
కానీ ముగ్గురు ఎంపీలు మాత్రం వైసీపీ సర్కారును విమర్శించకపోవడం, కనీసం రాష్ట్ర సమస్యలపై స్పందించకపోవడంపై పార్టీ వర్గాల్లో విస్మయం వ్యక్తమవుతోంది. గతంలో కేంద్రమాజీ మంత్రి సుజనా చౌదరి చురుకుగా వ్యవహరించేవారు. కానీ ఆయన కూడా చాలాకాలం నుంచి పార్టీలో అంటీముట్టనట్లు కనిపిస్తున్నారు. మరో ఎంపీ సీఎం రమేష్‌దీ అదే పరిస్థితి. ఇక కేంద్రమాజీ మంత్రి కావూరి సాంబశివరావు వంటి నేతలు, అసలు పార్టీలో ఉన్నారో లేదో తెలియని వైచిత్రి నెలకొంది. రాష్ట్రంలో రోడ్లు, శాంతిభద్రతలు, అధిక ధరల సమస్యలు తీవ్రంగా ఉంటే .. తమ పార్టీ ఎంపీలెవరూ తమకు సంబంధం లేనట్లు ఉండటమే వింతగా ఉందని పార్టీ వర్గాలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నాయి. అయితే కోర్ కమిటీలో ఎంపీలను కూడా మాట్లాడవద్దని రాష్ట్ర నాయకత్వం ఆదేశించినందుకే, ఎంపీలెవరూ రాష్ట్ర వ్యవహారాల్లో తలదూర్చడం లేదని మరికొందరు చెబుతున్నారు.

LEAVE A RESPONSE