– మాజీ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్
జాతీయస్థాయిలో క్రీడలు, క్రీడాకారులకు ప్రభుత్వ ప్రోత్సాహం కరువైందని మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. శనివారం యూసుఫ్ గూడ లోని కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో యునిక్యూ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రెండు రోజుల పాటు జరిగే జాతీయస్థాయి కరాటే పోటీలకు ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచంలో ని అనేక దేశాలు వివిధ క్రీడలను ప్రోత్సహిస్తూ అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందుతున్నాయని చెప్పారు. మన దేశంలో కేవలం క్రికెట్ అనే క్రీడ మాత్రమే ఉన్నట్లుగా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు చాలా బాధాకరం అని అన్నారు. క్రీడలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని, విద్యార్థి దశ నుండే తల్లిదండ్రులు తమ పిల్లలను క్రీడలలో ప్రోత్సహించడం అభినందనీయం అన్నారు. క్రీడాకారులు ఇలాంటి పోటీలను వేదికగా చేసుకొని రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించే విధంగా ప్రతిభను చాటాలని పిలుపునిచ్చారు.
క్రీడాకారులను ప్రోత్సహించేందుకు, అవసరమైన సహాయసహకారాలు అందించడానికి తాను ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటానని ప్రకటించారు. ఈ పోటీల నిర్వహకులను తలసాని శ్రీనివాస్ యాదవ్ అభినందించారు. ఈ కరాటే పోటీలలో 10 రాష్ట్రాలకు చెందిన సుమారు వెయ్యి మంది విద్యార్థులు పాల్గొంటున్నట్లు నిర్వహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో నిర్వహకులు రాజేశ్వరి చౌహాన్, నరేష్, సహదేవ్, రమేష్ తదితరులు పాల్గొన్నారు.