టీడీపీ వ్యవస్థాపకుడు, దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు కుటుంబంలో మరో విషాదం చోటుచేసుకుంది. ఎన్టీఆర్ నాలుగో కుమార్తె కంఠంనేని ఉమామహేశ్వరి సోమవారం మధ్యాహ్న సమయంలో హఠాన్మరణం చెందారు. ఈ ఘటన నందమూరి ఫ్యామిలీలో తీవ్ర విషాదాన్నే మిగిల్చింది. ఇటీవలే తన చిన్న కుమార్తె వివాహాన్ని ఉమామహేశ్వరి ఘనంగా జరిపించారు. ఈ వివాహం ముగిసిన రోజుల వ్యవధిలోనే ఆమె మరణించడం గమనార్హం.
ఉమామహేశ్వరి మరణ వార్త తెలిసిన వెంటనే టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు, ఆయన కుమారుడు నారా లోకేశ్ హుటాహుటీన ఉమామహేశ్వరి ఇంటికి వెళ్లారు. ఆమె కుటుంబ సభ్యులను ఓదార్చారు. ఉమామహేశ్వరి మరణ వార్తను బంధువర్గానికి చేరవేస్తున్న ఆమె కుటుంబ సభ్యులు విదేశీ టూర్‌లో ఉన్న నందమూరి కుటుంబ సభ్యులకూ తెలియజేశారు. ఇప్పటికే అందుబాటులో ఉన్న నందమూరి కుటుంబ సభ్యులంతా ఉమామహేశ్వరి ఇంటికి చేరుకున్నారు.