October 13, 2026

శ్రీ మహా చండీ దేవిగా శ్రీ కనకదుర్గమ్మ

శరన్నవరాత్రి మహోత్సవాలలో ఆశ్వయుజ శుద్ధ చవితి రోజున శ్రీ కనకదుర్గమ్మవారు శ్రీ మహాచండీ దేవిగా దర్శనమిస్తారు. ఈ రూపంలో అమ్మవారిని ఆరాధించడం వెనుక ఉన్న పరమార్థం ఏమిటంటే దేవతల కార్యసిద్ధి కొరకు, దుష్టశిక్షణ మరియు శిష్టరక్షణ సాధించడం కోసం మహాలక్ష్మి, మహాకాళి, మహాసరస్వతుల త్రిశక్తి స్వరూపిణిగా శ్రీ మహాచండీ అమ్మవారు ఉద్భవించింది.

చండీ అమ్మవారిలో అనేకమంది దేవతలు కొలువై ఉన్నారు. అందువల్ల శ్రీ మహాచండీ అమ్మవారిని ఒక్కరిని ప్రార్థిస్తే సర్వ దేవతలను ప్రార్థించినట్లే అవుతుంది. లోక రక్షణార్థం, సజ్జనుల కష్టాలను తొలగించడానికి అధర్మ శక్తులను అంతమొందించే పరమ తేజోరూపమే మహాచండీ స్వరూపం. శ్రీ మహాచండీ దేవి అనుగ్రహం వల్ల సాధకులకు విద్య, కీర్తి, అష్టసంపదలు లభిస్తాయి. అంతేకాక శత్రువులు సైతం మిత్రులుగా మారిపోవడం, భక్తుల సత్సంకల్పాలు నెరవేరడం మరియు ప్రతి కార్యంలో విజయం సిద్ధిస్తాయి.

చండీ దేవత గురించి పురాణాలలో ఎన్నో ప్రస్తావనలు ఉన్నాయి. పూర్వం శుంభ, నిశుంభులు అనే రాక్షసులను సంహరించేందుకు అమ్మవారు, చండీ అవతారాన్ని ధరించిందట. చండీదేవి తన శౌర్యంతో శుంభ, నిశుంభులనే కాకుండా వారి సేనాధిపతులైన చండ ముండాసురులను కూడా సంహరించింది.దేవీనవరాత్రులలో చండీహోమం చేస్తాం. ఎందుకు చేస్తామని అంటే దుర్గా నవరాత్రులలో దుర్గాసప్తశతి అని ఏడువందల శ్లోకాలతో అమ్మవారిని పిలిచి, అందులో పచ్చి కాయలు, విప్ప పూలు, దానిమ్మ పండు, వెలగపండు, అరటిపండు, కొబ్బరికాయ, ఇవన్నీ ఒక్కొక్క అధ్యాయం అయిన తరవాత ఒక్కటి నేతితో కలిపి అగ్నిముఖంగా హవిస్సు వేసి చండీదేవికి నమస్కారం చేస్తారు.

క్షమాపణ చెప్పినట్లు అమ్మా! ఇన్నాళ్లూ నాలో ఉన్న కదలికలు నావని భ్రమసి, తప్పు చేసి అహంకారంతో విర్రవీగాను. నన్ను నేను సంస్కరించుకోగలను అన్న ధైర్యం నాయందుపోయింది. నా మనసుకి అటువంటి జవమిచ్చేసాను. ఆ స్థితికి వచ్చేసాను. నా మనసుని శాసించలేకపోతున్నాను. తల్లీ! నీ పాదాలు పట్టుకుంటున్నాను. నువ్వే నా మనసుని శాసించి నన్ను నీవాడిని చేసుకో అని పరమ శరణాగతితో అమ్మవారికి హవిస్సుని ఇవ్వడం చండీహోమం.

శారదా నవరాత్రులలో చండీదేవిని అర్చన చేస్తే, ఎన్ని దోషాలు చేసినవాడినైనా అమ్మతనంతో క్షమించేస్తుంది. ఎంత కోపంతో ఉన్నా చండీ సప్తశతి మంత్రాలతో హవిస్సు ఇచ్చి కూర్చుని నమస్కారం చేస్తే, పోనీలే తప్పుని ఒప్పుకున్నావు కదా! అని ఉత్తరక్షణంలో ఆవిడ పరమశాంతిని పొందుతుంది.దేశోపద్రవాలు శాంతించడానికి, గ్రహాల అనుకూలతకు, భయభీతులు పోవడానికి, శత్రు సంహారానికి, శత్రువులపై విజయం సాధించడానికి తదితర కారణాలతో చండీ యాగం చేస్తారు.

చండీదేవి, ఆమె తేజోరూపమైన చాముండీదేవి వెలసిన ఆలయాలు దేశంలో అనేకం ఉన్నాయి. వాటిల్లో హరిద్వార్ లో ఆదిశంకరాచార్యులు నిర్మించినట్లుగా భావించే ఆలయం ప్రసిద్ధమైనది. దక్షిణాదిలో మైసూరు పాలకులు నిర్మించిన చాముండి ఆలయం ఎంతో మహిమాన్వితమైనది.

  • ములుకుట్ల సువర్చల
Total Visitors: 2,950,808