-బ్రిటన్ విమానాన్ని ఢీకొనే పరిస్థితిని నివారించిన శ్రీలంక పైలట్లు
కొలంబో: శ్రీలంకన్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానంలోని పైలట్ల అప్రమత్తతతో తుర్కియే గగనతలంలో భారీ ప్రమాదం తప్పింది.రెండు విమానాలు ఢీకొనే పరిస్థితిని నివారించి 525 మంది ప్రయాణికులను కాపాడినందుకు పైలట్లపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. శ్రీలంకన్ ఎయిర్‌లైన్స్ బుధవారం వెల్లడించిన వివరాల ప్రకారం.. ఆ సంస్థకు చెందిన యూఎల్-504 విమానం ఈ నెల 13న లండన్ నుంచి కొలంబోకు 275 మంది ప్రయాణికులతో బయల్దేరింది. తుర్కియే గగనతలంలో 33 వేల అడుగుల ఎత్తులో వెళ్తున్నప్పుడు 35 వేల అడుగుల ఎత్తుకు ఎగరాలని పైలట్లకు అంకారా ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్(ఏటీసీ) కేంద్రం నుంచి ఆదేశాలు అందాయి.
అదే ఎత్తులో కేవలం 15 మైళ్ల దూరంలో ఓ విమానం వస్తున్నట్లు శ్రీలంక విమాన పైలట్లు గుర్తించారు. ఈ విషయాన్ని ఏటీసీ కేంద్రానికి తెలియజేశారు. కానీ ఏటీసీ వ్యవస్థ మాత్రం పైకి ఎగరడానికి రెండు సార్లు క్లియరెన్స్ ఇచ్చింది. ప్రమాదాన్ని పసిగట్టిన పైలట్లు 35 వేల అడుగుల ఎత్తుకు విమానాన్ని తీసుకెళ్లడానికి నిరాకరించారు. పొరపాటును గుర్తించిన ఏటీసీ కేంద్రం పైకి ఎగరవద్దని, అదే ఎత్తులో దుబాయ్‌కు వెళ్తున్న బ్రిటిష్ ఎయిర్‌వేస్‌కు చెందిన విమానం 250 మంది ప్రయాణికులతో వస్తోందని సమాచారం ఇచ్చింది. ఏటీసీ వ్యవస్థ ఆదేశాల ప్రకారం పైలట్లు విమానాన్ని 35 వేల అడుగుల ఎత్తుకు తీసుకెళ్లి ఉంటే, రెండు విమానాలు ఢీకొని పెద్ద ప్రమాదం జరిగి ఉండేదని శ్రీలంకన్ ఎయిర్‌లైన్స్ పేర్కొంది.