-నిగర్వి, నిజాయతీకి నిలువెత్తు విగ్రహం
-‘పెద్దాయన’ కోట్ల విజయభాస్కరరెడ్డి
కోట్ల విజయభాస్కరరెడ్డి.. జగమెరిగిన నేత. ఆరడుగుల ఆజానుబాహుడు. రాజకీయాల్లో మేరునగధీరుడు. నిజాయతీకి నిలువుటద్దం. నిరాడంబరతకు నిలువెత్తు నిదర్శనం. నిఖార్సయిన నేత. ప్రజల గుండెల్లో ‘పెద్దాయన’గా నిలిచిపోయిన మహామనీషి. విలువలకు పెద్దపీట వేసి, నైతిక నిష్ఠతో దాదాపు ఐదు దశాబ్దాల పాటు రాజకీయాలు చేసిన మహోన్నత వ్యక్తి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రెండు సార్లు ముఖ్యమంత్రిగా.. ఇందిర, రాజీవ్, పీవీ హయాంలో కేంద్ర మంత్రిగా పనిచేశారు. ముఖ్యమంత్రిగా, కేంద్ర మంత్రిగా, కాంగ్రెస్ పార్టీలో కీలక నేతగా.. ఏ బాధ్యతనైనా సత్యనిష్ఠతో నిర్వర్తించిన గొప్ప నాయకుడు. నీతి, నిజాయతీలే శ్వాసగా బతికిన మచ్చలేని మనిషి. ఆయన మాట ఇస్తే.. తప్పే ప్రసక్తే లేదు. ఇచ్చిన మాటను నిలుపుకొనేందుకు అవసరమైతే తన పేరు ప్రతిష్ఠలను కూడా పణంగా పెట్టే స్వభావం ఆయన సొంతం. నమ్ముకున్న వారికి న్యాయం చేయడానికి ఎంతకైనా తెగించే వ్యక్తిత్వం. సన్నిహితులు ఆయన్ను ‘మొండి ఘటం’ అని ప్రేమగా పిలుచుకునేవారు.
కర్నూలు జిల్లాలోని లద్దగిరి గ్రామంలో 1920 ఆగస్టు 16న కోట్ల విజయభాస్కరరెడ్డి జన్మించారు. తల్లిదండ్రులు వెంకమ్మ, పెదనాగిరెడ్డి. ఆయన ప్రాథమిక విద్యాభ్యాసం లద్దగిరిలోనే పూర్తి చేశారు. మదనపల్లెలో డిగ్రీ విద్యనభ్యసించారు. క్రీడల్లోనూ ఆయన ముందుండేవారు. కాలేజీ రోజుల్లో హాకీ, ఫుట్‌బాల్ జట్లకు కెప్టెన్‌గా ఉండేవారు. 1947లో మద్రాసులో బీఎల్ పూర్తి చేశారు. తర్వాత మద్రాసు హైకోర్టులో కొద్దికాలం న్యాయవాదిగా ప్రాక్టీస్ చేశారు. విద్యార్థి దశ నుంచే ఆయన ప్రజాకార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొనేవారు. చిత్తూరు జిల్లా స్టూడెంట్స్ కాంగ్రెస్‌కు 1939 నుంచి 1945 వరకు ఆయన అధ్యక్షుడిగా పనిచేశారు. తర్వాత మద్రాస్ స్టూడెంట్ కాంగ్రెస్‌కు వ్యవస్థాపక సభ్యుడిగా ఉన్నారు. దేశ స్వాతంత్ర్య పోరాటంలో విద్యార్థులతో కలిసి పాల్గొన్న విజయభాస్కరరెడ్డి పోలీసుల కర్కశత్వాన్నీ చవిచూశారు. మదనపల్లెలో ఓ ఊరేగింపు సందర్భంగా ఆయన జాతీయ జెండాను పట్టుకోవడంతో పోలీసులు లాఠీఛార్జి చేశారు. అయినా ఆయన జెండాను వదల్లేదు. స్పృహ తప్పేవరకూ పోలీసులు చితకబాదారు. ఆ దెబ్బలకు మూడు నెలల పాటు చికిత్స తీసుకోవాల్సి వచ్చింది. మాతృభూమి, భారతదేశంపై విజయభాస్కరరెడ్డికి ఉన్న ప్రేమ, గౌరవాలకు నిదర్శనం ఆ ఘటన.
నిజాయతీకి మారుపేరు..
1983 ప్రాంతంలో కేంద్రంలోని ఇందిరా గాంధీ ప్రభుత్వంలో విజయభాస్కరరెడ్డి మంత్రిగా ఉన్నారు. ఆ సమయంలో ప్రభుత్వంపై అవినీతి ఆరోపణలు వచ్చాయి. అనంతరం ఓ జాతీయ పత్రిక రాజీవ్ గాంధీని ఇంటర్వ్యూ చేస్తూ.. ఆ ఆరోపణలపై ప్రశ్నించింది. స్పందించిన రాజీవ్.. నాటి మంత్రివర్గంలో విజయభాస్కరరెడ్డి, వీపీ సింగ్ వంటి నిజాయతీపరులు ఉన్నారని, అలాంటి ప్రభుత్వంలో అవినీతి జరిగే ప్రసక్తే లేదని చెప్పారు. ఏవైనా శాఖలపై అవినీతి ఆరోపణలు వస్తే.. వాటిని విజయభాస్కరరెడ్డికి అప్పగించేవారని వ్యాఖ్యానించారు. కోట్ల చిత్తశుద్ధి, నీతి, నిజాయతీలకు ఈ వ్యాఖ్యలే నిదర్శనం. రెండు సార్లు జిల్లా పరిషత్ ఛైర్మన్‌గా, రాష్ట్ర మంత్రిగా, రెండు సార్లు ముఖ్యమంత్రిగా, మూడు సార్లు కేంద్ర మంత్రిగా పనిచేసిన ఆయనపై ఎలాంటి ఆరోపణలు రాలేదంటేనే ఆయన కార్యదక్షత, నిజాయతీని అర్థం చేసుకోవచ్చు. ముఖ్యమంత్రిగా, కేంద్ర మంత్రిగా.. ఇలా అనేక అత్యున్నత పదవులు నిర్వర్తించినా ఆయనకు సొంత ఇల్లు లేదు. అదీ ఆయన నిజాయతీ, నిబద్ధత.
పదవులకే వన్నె తెచ్చిన నేత..
ఏ పదవి నిర్వహించినా దానికి వన్నె తెచ్చేలా, తనదైన మార్కు కనిపించేలా పనిచేసేవారు కోట్ల. బలహీనవర్గాల గృహ నిర్మాణ పథకానికి ఆద్యుడు. 1970ల్లో ఆయన రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్న రోజుల్లో ఎల్ఐసీ నుంచి రూ.14 కోట్లు రుణం తీసుకొని ప్రభుత్వం తరఫున బలహీనవర్గాలకు ఇళ్లు నిర్మించి ఇచ్చారు. ఆయన పేదల పక్షపాతి. వారి సంక్షేమం కోసం నిరంతరం పరితపించేవారు. కిలో రూ.1.90 పైసలకే బియ్యం పథకాన్ని అమలు చేశారు. రైల్వే లైన్లను బ్రాడ్ గేజ్‌గా మార్చడంలో ఆయన కీలకపాత్ర పోషించారు. అలాగే ప్రతి ఇంట్లో కనీసం ఒక్కరైనా బాగా చదువుకోవాలని ఆకాంక్షించేవారు. మార్కాపురంలో దళిత కుటుంబాలకు చెందిన 120 మందికి పోలీస్ శాఖలో ఉద్యోగాలు ఇప్పించారు. తద్వారా ఆ ప్రాంతంలో చదువుకునే వారి సంఖ్యను పెంచడానికి కృషి చేశారు. ఏడు దశాబ్దాల క్రితం ఆయన జిల్లా పరిషత్ చైర్మన్‌గా ఉన్న సమయంలో ‘బడి.. బాట.. బావి..’ ఆయన చేపట్టిన కార్యక్రమం ప్రాచుర్యంలోకి వచ్చింది. ఇక సాగునీటి రంగం అంటే ఆయనకెంతో ఇష్టం. రైతులకు సాగు నీరు అందించే విషయంలో ప్రత్యేక శ్రద్ధ చూపేవారు. ముఖ్యంగా కేసీ కెనాల్‌పై ఆయనకెంతో మమకారం. కేసీ కెనాల్ కింద ఆయకట్టుకు నీరందుతుందా? లేదా? అంటూ పదేపదే వాకబు చేసేవారు. 1993లో ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కేసీ కెనాల్ ఆధునికీకరణ పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేశారు. కేవలం ఆరు నెలల్లోనే పనులు పూర్తి చేయించి, ఆయకట్టుకు సాగు నీరు అందేలా చూశారు. నాగార్జునసాగర్ జలాశయం నుంచి మొట్టమొదటిసారిగా నీళ్లు విడుదల చేశారు. నల్లగొండ జిల్లా మిర్యాలగూడ ప్రాంతంలో చాలా మంది తమ పిల్లలకు విజయభాస్కరరెడ్డి అని పేరు పెట్టుకోవడం విశేషం. కరువుకాటకాలతో అల్లాడుతున్న మిర్యాలగూడకు సాగర్ నీరందించి సస్యశ్యామలం చేసిన విజయభాస్కరరెడ్డి మీద గౌరవంతో ఆ ప్రాంత ప్రజలు వారి పిల్లలకు విజయభాస్కరరెడ్డి పేరు పెట్టుకున్నారు.
స్వచ్ఛమైన రాజకీయాలు..
ఒకసారి అసెంబ్లీలో తెలుగుగంగ ప్రాజెక్టు కాలువల స్థిరీకరణలో అవినీతి జరిగిందంటూ ప్రముఖ కమ్యూనిస్టు నేత బోడేపూడి వెంకటేశ్వరరావు ఆరోపణలు చేశారు. అయితే ఇది విజయభాస్కరరెడ్డికి తెలిసి జరిగిందనుకోవడం లేదని, ఆయన్ను తాము శంకించడం లేదని చెప్పారు. ఆయన నిజాయతీపై తమకు విశ్వాసం ఉందని అన్నారు. వెంటనే స్పందించిన విజయభాస్కరరెడ్డి.. వెంకటేశ్వరరావు ఊరికే ఆరోపణలు చేయరని, అక్కడ ఏదో జరిగే ఉంటుందని అంటూ విచారణకు ఆదేశిస్తున్నట్లు ప్రకటించారు. కాలువల స్థిరీకరణకు పిలిచిన టెండర్లను రద్దు చేస్తున్నట్లు తెలిపారు. ఆ రోజుల్లో రాజకీయాలు, విలువలు అంత గొప్పగా ఉండేవి. ఇక విజయభాస్కరరెడ్డి ముఖ్యమంత్రిగా, మంత్రిగా, కేంద్ర మంత్రిగా ఉన్న సమయంలో అయినా ఆయన్ను ఎవరైనా నేరుగా వెళ్లి కలిసే అవకాశం ఉండేది. ఆయన అంత నిరాడంబరంగా ఉండడమేగాక అందరికీ అందుబాటులో ఉండేవారన్నమాట.
ప్రజా సమస్యల పరిష్కారానికి విజయభాస్కరరెడ్డి ఎక్కువగా చొరవ చూపేవారు. 30 ఏళ్లుగా అపరిష్కృతంగా ఉన్న శ్రీశైలం ప్రాజెక్టు నిర్వాసితుల సమస్యను 1994లో పరిష్కరించారు. లోక్ అదాలత్ ఏర్పాటు చేయించి, ముంపు బాధితలకు ఆర్థిక సాయం, పునరావాసానికి సంబంధించిన సమస్యలు పరిష్కారమయ్యేలా చూశారు. నిర్వాసితులకు శాశ్వత పరిష్కారం చూపారు. కర్నూలు జిల్లా నందికొట్కూరులో సభ ఏర్పాటు చేసి, నాటి ప్రధాని పీవీ నరసింహారావు, నాటి లోక్‌సభ స్పీకర్ శివరాజ్ పాటిల్ ద్వారా నిర్వాసితులకు ఆర్థిక సాయం అందజేశారు. అధికారం అంటే భగవంతుడి ద్వారా ప్రజల సేవ చేసుకునేందుకు వచ్చిన మహదవకాశమని చెప్పేవారు.
సీడబ్ల్యూసీకి రెండు సార్లు..
కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) సభ్యుడిగా విజయభాస్కరరెడ్డి రెండు సార్లు ఎన్నికయ్యారు. కలకత్తా, తిరుపతిలో రెండు సార్లు ఎన్నికల్లో సీడబ్ల్యూసీకి ఎంపికయ్యారు. నామినేషన్ పద్ధతిలో కాకుండా ఎన్నికల ద్వారా రెండు సార్లు ఎంపికైన ఏకైక నాయకుడు ఆయనే కావడం విశేషం. విజయభాస్కరరెడ్డి జీవితాంతం కాంగ్రెస్ వాదిగానే ఉన్నారు. కాంగ్రెస్ పార్టీలో అత్యున్నత స్థానాలు అధిరోహించినప్పటికీ ఆయనకు ఇతర పార్టీల నేతలతోనూ సత్సంబంధాలు ఉండేవి. అందరితోనూ కలుపుగోలుగా ఉండేవారు. కమ్యూనిస్టు నేతలతోపాటు, బీజేపీ అగ్రనేత బిహారీ వాజ్‌పేయీతోనూ సన్నిహిత సంబంధాలు ఉండేవి.
కోట్ల నిజాయతీకి ఇందిర ఫిదా..
కోట్ల కేవలం మూడు నెలలు మాత్రమే ముఖ్యమంత్రిగా పనిచేసిన తర్వాత 1983లో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి ఎన్నికలు వచ్చాయి. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది. అప్పుడు సీతారాం కేసరి ఫోన్ చేసి, ఎన్నికల ఖర్చు కోసం ఇచ్చినపార్టీ ఫండ్ గురించి మాట్లాడాలని చెప్పగా.. ‘ఆ సొమ్ములో రూ.5 కోట్లు మిగిలాయి. ఆ డబ్బును వెంటనే అధిష్ఠానానికి పంపేశాను’ అని బదులిచ్చారు. అలా నిధులు వెనక్కి పంపిన ఏకైక వ్యక్తి కోట్ల. ఈ విషయాన్ని రాజీవ్ గాంధీ ఇందిరకు చెప్పారు. అదేరోజు ఆమె కోట్లకు ఫోన్ చేసి ఢిల్లీకి పిలిపించారు. ‘మిమ్మల్ని కేంద్ర కేబినెట్లోకి తీసుకోవాలని నిర్ణయించాం. ఏ శాఖ కావాలి?’ అని ఇందిర అడిగారు. దానికాయన.. ‘మీరు ఏ శాఖ ఇచ్చినా ఓకే’ అని చెప్పారు. అప్పుడు షిప్పింగ్ అండ్ ట్రాన్స్‌పోర్ట్ బాధ్యతలు అప్పగించారు. ఆ శాఖలో బాగా చేయడంతో ఏడాదిలోనే పరిశ్రమల శాఖను కేటాయించారు. ఆయన నిజాయతీకి ఇదే నిలువెత్తు నిదర్శనం. ఇకపీవీ నరసింహారావు మంత్రివర్గంలో కోట్ల.. న్యాయ శాఖ మంత్రిగా ఉన్నారు. ఆ సమయంలో కేంద్ర మంత్రుల పనితీరుపై ఓ సంస్థ చేసిన సర్వేలో ఆయన నంబర్ 1గా నిలిచారు. కోట్ల పనితీరు ‘సూటిగా, స్పష్టంగా, అవినీతికి తావులేకుండా’ ఉందని ఆ సంస్థ పేర్కొనడం విశేషం.
మామిడి పంటకు మంచి ధరొచ్చిందని మురిసిన మంత్రి..
1992లో కోట్ల.. కేంద్ర న్యాయ శాఖ మంత్రిగా ఉన్నారు. ఆ సమయంలో పార్లమెంటు సెంట్రల్ హాలులో సీనియర్ జర్నలిస్టు, దివంగత కృష్ణారావు.. హుషారుగా కనిపించిన ఆయన్ను చూసి ‘ఏంటి సార్ అంత సంతోషంగా ఉన్నారు?’ అని అడిగారు. అప్పుడాయన ‘ఏం లేదు కృష్ణారావు.. మా ఇంటి దగ్గర నుంచి ఫోన్ వచ్చింది. మా మామిడి తోట పంటకు మంచి ధర వచ్చిందట. రూ.5 లక్షలకు అమ్ముడుపోయిందట’ అని చాలా పొంగిపోతూ చెప్పారు. సాయంత్రం డిన్నర్‌కి రమ్మని ఆయన్ని ఆహ్వానించారు. అదీ ఆయన వ్యక్తిత్వం.
విలువలకు పెద్దపీట..
విజయభాస్కరరెడ్డి విలువలకు పెద్దపీట వేసేవారు. 1994లో తూర్పుగోదావరి జిల్లాలో బ్రిడ్జి ప్రారంభోత్సవానికి బయలుదేరుతుండగా.. కార్యదర్శి వచ్చి ఆలిండియా రేడియోలో అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడినట్లు వార్త వచ్చిందని చెప్పారు. అంతే.. వెంటనే ప్రారంభోత్సవాన్ని ఆపేయమని ఆదేశించారు. ‘ఇంకా మనకు అధికారికంగా సమాచారం రాలేదు కదా? సార్’ అని కార్యదర్శి అడిగితే.. ‘రేడియోలో వచ్చిందిగా.. వద్దు.. ఆపేయండి’ అని చెప్పారు. నైతిక విలువలకు అంతగా కట్టుబడి ఉండేవారన్నమాట.
గురువుకే తొలి ప్రాధాన్యం..
విజయభాస్కరరెడ్డి సామాన్యులు, రైతులు, ఉపాధ్యాయులకు అత్యధిక ప్రాధాన్యం ఇచ్చేవారు. ప్రత్యేకించి టీచర్లకు ఆయన ఎంతో గౌరవం ఇచ్చేవారు. కేంద్ర న్యాయ శాఖ మంత్రిగా ఉన్న సమయంలో ఢిల్లీలో ఆయన్ను కలిసేందుకు ఎమ్మిగనూరు నుంచి ఓ ఉపాధ్యాయుడు, సుప్రీంకోర్టు న్యాయమూర్తి వచ్చారు. పార్లమెంటుకు వెళ్లే సమయంలో తన పీఏని పిలిచి కలవడానికి ఎవరు వచ్చారని అడగ్గా.. టీచర్, కుమారుడి పెళ్లికి ఆహ్వానించేందుకు సుప్రీంకోర్టు జడ్జి వచ్చారని చెబుతారు. అప్పుడాయన ఉపాధ్యాయుణ్ని లోపలికి పంపమని అంటారు. ఆయనతో మాట్లాడిన తర్వాత న్యాయమూర్తిని కలుస్తారు. అనంతరం పీఏ.. ‘సార్.. ప్రొటోకాల్ ప్రకారం ముందు జడ్జిని కలవాలి కదా? మీరు టీచరును ఎందుకు ముందు కలిశారు?’ అని అడుగుతారు. అందుకాయన.. ‘జడ్జికి సకల సౌకర్యాలు ఉంటాయి. టీచర్ ఎక్కడో ఎమ్మిగనూరు నుంచి వచ్చారు. ఆయనతో ముందు మాట్లాడి పంపాలి. పైగా జడ్జి అయినా, ప్రధాని అయినా టీచర్ దగ్గర చదువుకునే ఈ స్థాయికి వస్తారు కదా. కాబట్టి ముందు వారిని గౌరవించాలి’ అని చెప్పారు. అదీ ఆయన వ్యక్తిత్వం.
ఐదు దశాబ్దాల పాటు ప్రజా సేవలో నిమగ్నమైన ఆయన.. చివరి శ్వాసవరకూ నీతి, నిజాయతీలతో పనిచేశారు. మచ్చలేని స్వచ్ఛమైన రాజకీయాలకు చిరునామాగా నిలిచారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణశయ్యపై ఉన్న రోజుల్లోనూ.. క్రికెట్ మ్యాచ్ స్కోర్ అడిగిన మానసిక ఉల్లాసం ఆయనకే సొంతం. 81 ఏళ్ల వయస్సలో 2001 సెప్టెంబరు 27న ఆయన తుదిశ్వాస విడిచారు. 22వ వర్ధంతి సందర్భంగా ‘పెద్దాయన’కు అంజలి ఘటిస్తూ..
– యాదగిరి రెడ్డి
జర్నలిస్టు
నల్లగొండ