– మీడియాతో రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ
– ప్రతి ఇంటికి కుళాయి కనెక్షన్ ఉండాలన్నది మా ప్రభుత్వ విధానం
– ఉద్దేశపూర్వకంగానే ఈనాడు తప్పుడు రాతలు
– బలవంతంగా కుళాయి పన్ను వసూలు చేయాలని ప్రభుత్వం ఆదేశాలివ్వలేదు
– అధికారికంగా కుళాయి కనెక్షన్ తీసుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి
మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ.. ఇంకా ఏమన్నారంటే..
ఈ ప్రభుత్వం పేదలను అన్యాయం చేస్తున్నట్లు ఓ పత్రికలో కధనం వచ్చింది. మాది పేదల కోసం పనిచేసే ప్రజా ప్రభుత్వం. అటువంటి మా ప్రభుత్వం మీద ఓ వర్గం మీడియా బురదజల్లే ప్రయత్నం చేస్తుంది.
ఎక్కడో ఒకచోట జరిగిన చిన్న సంఘటనలను సాకుగా చూపుతూ.. రాష్ట్రమంతా అవి జరిగినట్లు, జరుగుతున్నట్లు ఓ వర్గం మీడియా ప్రచారం చేస్తున్నాయి.ప్రభుత్వానికి ఒక విధానం ఉంటుంది…ప్రతి ఇంటికి కుళాయి కనెక్షన్ ఉండాలనేది మా ప్రభుత్వ విధానం.
అనధికారికంగా కుళాయి కనెక్షన్ వద్దు… అధికారికంగా కుళాయి కనెక్షన్ తీసుకోవాలని ప్రజలను కోరుతున్నాను.చట్టానికి సంబంధం లేకుండా, ఎక్కడో అనధికారికంగా జరిగే సంఘటనలకు ఈనాడు పత్రిక మద్దతు పలుకుతుందా..?.
ఎక్కడైనా వ్యవస్ధలను పటిష్టం చేయాలని కోరతారు. కుళాయి కనెక్షన్ రేట్లు అధికంగా ఉన్నాయని ఎవరైనా భావిస్తే.. వారి సమస్యలను స్ధానిక సంస్దల దృష్డికి తీసుకెళ్లవచ్చు. అలాకాకుండా, ప్రజలను గందరగోళానికి గురి చేసే విధంగా మీడియా కథనాలు రాయకూడదు.
పన్నుల కట్టకపోతే జప్తులు చేయటం అన్నది ఎప్పటినుంచో ఉంది. ఈ రోజు కొత్తగా వచ్చింది కాదు. ప్రజలని ఇబ్బంది పెట్టి జప్తు చేయడం ప్రభుత్వం ఉద్దేశంకానేకాదు. స్ధానిక సంస్ధలను సక్రమంగా నిర్వహించాలంటే పన్నులు సక్రంమగా చెల్లించాలి కదా…?.
పన్నులు కట్టకపోతే.. చర్యలు తీసుకున్న ఘటనలు గత ప్రభుత్వాల హయాంలో కూడా ఎన్నో జరిగాయి. కానీ, అప్పుడు ఎందుకు ఇలాంటి వార్తలు ఈనాడు రాయలేదు. అంటే, ఆ పత్రిక మోటివ్స్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. బలవంతంగా పన్ను వసూలు చేయాలనిగానీ… ప్రజలను ఇబ్బంది పెట్టాలనిగానీ… ప్రభుత్వం ఎక్కడా ఆదేశించలేదు.