Suryaa.co.in

Andhra Pradesh

ప్రైవేటు వ్యక్తులకు రాష్ట్ర ఖజానా తాకట్టు

– అప్పుల విషయంలో రాజ్యాంగ ఉల్లంఘనలు
– అధిక వడ్డీ రేట్లతో బాండ్లు జారీ
– ఏపీఎండీసీ ఖనిజ సంపదను తాకట్టుపెడుతున్నారు
– రెండో విడతగా రూ.5,500 కోట్లు రుణాల సేకరణ
– దీనిలో ఆర్టికల్ 203, 204, 293/1లను ఉల్లంఘించిన ప్రభుత్వం
– తాడేపల్లి వైయస్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి

తాడేపల్లి: ఏపీఎండీసీ ఖనిజ సంపదతో పాటు రాష్ట్ర ఖజానాను కూడా తాకట్టు పెట్టి తాజాగా రూ.5,500 కోట్లు బాండ్ల రూపంలో రుణాలు తీసుకునేందుకు కూటమి ప్రభుత్వం సిద్దమైందని మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ మండిపడ్డారు. తాడేపల్లి వైయస్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ ఈ రుణాల సేకరణలో ఏకంగా రాజ్యాంగంలోని ఆర్టికల్ 203, 204, 293/1లను ఉల్లంఘిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

రాష్ట్ర ఖజానాపై ప్రైవేటు వ్యక్తులకు అధికారాలను ఇచ్చేందుకు కూటమి ప్రభుత్వం ఆమోదం తెలపడం అత్యంత ఆందోళనకరమని అన్నారు. న్యాయస్థానాల్లో దీనిపై వ్యాజ్యం ఉన్నప్పటికీ కూటమి ప్రభుత్వం బరితెగించి తప్పుడు విధానాలకు సిద్దమైందని ధ్వజమెత్తారు.

చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం భారీగా అప్పులు చేసేందుకు అన్ని నిబంధనలను పక్కకుపెట్టి, ముందుకు వెడుతోంది. దీనిలో భాగంగా 8.05.2025న రూ.9000 కోట్ల అప్పుకు ఏపీఎండీసీ బాండ్లను జారీ చేసేందుకు నోటిఫికేషన్ ఇచ్చింది. దీనిలో ఇప్పటికే రూ.3400 కోట్ల మేరకు బాండ్ల ద్వారా రుణాలుగా సేకరించింది. సుపరిపాలనలో తొలి అడుగు అంటూ సీఎం చంద్రబాబు తాజాగా అనేక అంశాలను ప్రస్తావించారు.

ఆస్తులు తాకట్టు పెట్టడం లేదు, మద్యం ఆదాయాన్ని తాకట్టు పెట్టకుండా సంపదను సృష్టిస్తున్నాను అని చెప్పారు. ఎపీఎండీసీ ఆస్తులను తాకట్టు పెట్టడం నిజం కాదా? చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా ఆర్బీఐ డైరెక్ట్ మ్యాన్‌డేట్‌ ను ప్రభుత్వం ఇచ్చేయడం వాస్తవం కాదా? రాష్ట్రానికి రిజర్వుబ్యాంక్‌లో ఖాతా ఉంటుంది. ఏ కారణం వల్ల అయినా ఏపీఎండీసీ రుణదాతలకు అప్పు కట్టలేకపోతే, దానిని రుణదాతలు నేరుగా ఆర్బీఐలో ఉన్న రాష్ట్రానికి చెందిన ఖాతా నుంచి ఎటువంటి ముందస్తు అనుమతి లేకుండానే వారికి రావాల్సిన మొత్తాలను డ్రా చేసుకోవచ్చు. దీనికి రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఇది రాజ్యాంగ ఉల్లంఘన.

203 ఆర్టికల్ ప్రకారం ఒక డిపార్ట్‌మెంట్‌కు డబ్బులు రావాలంటే, అసెంబ్లీలోని ఎమ్మెల్యేలు సమ్మతం తెలిపితేనే ఆ డబ్బును డ్రా చేసే వీలుంటుంది. 204 ఆర్టికల్ ప్రకారం బడ్జెట్ సెషన్ తరువాత మొత్తం ఈ ఏడాదికి ఇంత సొమ్ము పరిపాలన చేసేందుకు కావాల్సి ఉందని అంటే, అసెంబ్లీ ఆమోదం తెలిపితేనే ఆ డబ్బును డ్రా చేసే అవకాశం ఉంటుంది. గవర్నర్, ప్రత్యేకమైన కోర్ట్‌లకు తప్ప ఎవరికీ డబ్బు డ్రా చేసే అవకాశం ఉండదు.

అలాగే ఆర్టికల్ 293/1 ప్రకారం రాష్ట్రం అప్పులు చేయాలంటే, రాష్ట్రానికి చెందిన కన్సాలిడేటెడ్ ఫండ్ ను తాకట్టు పెట్టాలంటే ఆ హక్కు ఒక్క అసెంబ్లీకి మాత్రమే ఉంటుంది. ఈ మూడు ఆర్టికల్స్‌ను కూటమి ప్రభుత్వం ఉల్లంఘించింది.

గతం ప్రభుత్వంలో మద్యం మీద ప్రత్యేకంగా ఆదాయం వచ్చేలా పాలసీ చేశాం. రిటైల్ షాప్‌ల్లో మద్యంను ఎక్కువ రేటుకు సిండికేట్లు అమ్ముతున్నాయి. ఎప్పుడైతే రాష్ట్ర ప్రభుత్వమే రిటైల్ బిజినెస్ చేసిందో, గతంలో సిండికేట్లు నిబంధనలకు విరుద్దంగా ఎంత ఎక్కువ రేటుతో మద్యంను అమ్ముతున్నారో, ఎమ్మార్పీ కన్నా ఎక్కువగా ఉన్న ఆ మొత్తాన్ని అడిషనల్ రీటైల్ ఎక్సైజ్ ట్యాక్స్ (ఏఆర్‌ఈటి) పేరుతో మద్యం ధరపై విధించి విక్రయించడం జరిగింది. ఇది కూడా చట్టబద్దంగానే చేశాం.

ఈ అదనపు డబ్బులను ప్రజలకు ఉపయోగపడే వైయస్ఆర్‌ ఆసరా, వైయస్ఆర్‌ చేయూత, రైతుభరోసా పథకాలకు మాత్రమే వినియోగించేలా చట్టం చేశాం. ఆదనపు పన్నును చట్టం ద్వారా తయారు చేసి, అలా వసూలు చేసిన వాటిని కూడా ప్రజా సంక్షేమ పథకాలకే వినియోగించాం. నేడు కూటమి ప్రభుత్వం ఏపీఎండీసీ బాండ్ల విషయంలో ఇటువంటివి ఎక్కడా పాటించడం లేదు. దీనిపై ఇప్పటికే వ్యాజ్యం న్యాయస్థానంలో ఉంది. అలాంటప్పుడు ఎవరూ దీనిపై ముందుకు వెళ్ళరు.

ఏపీఎండీసీ జారీ చేస్తున్న బాండ్లకు అత్యధిక వడ్డీ రేట్లను అనుమతించింది. దీనివల్ల వడ్డీ భారాన్ని మనమే భరించాల్సి ఉంటుంది. కూటమి ప్రభుత్వం మాత్రం దీనిని ఏ మాత్రం పట్టించుకోకుండా రెండో విడతగా మరో రూ.5500 కోట్లు రుణాలుగా సేకరించేందుకు బాండ్లు జారీ చేస్తోంది. ఆగస్టు 2018లో ఏపీసీఆర్డీఏ అమరావతి బాండ్ల పేరుతో రూ.2000 కోట్ల ఎన్‌సీడీ బాండ్లను జారీ చేసి అప్పులు చేశారు. దానికి 10.32 శాతం వడ్డీని ప్రకటించారు.

ఆనాడు ఆర్బీఐ ద్వారా రాష్ట్రం చేసే అప్పులకు విధించే వడ్డీ శాతం 8.42 శాతం మాత్రమే. దీనికంటే ఎక్కువగా రూ.1.9 శాతం అంటే దాదాపు 2 శాతం ఎక్కువ వడ్డీలకు బాండ్లను జారీ చేస్తున్నారు. సెక్యూరిటీ కింద అమరావతి భూములను తాకట్టు పెట్టారు. మా హయాంలో 2019-24లో ఏపీ బేవరేజెస్ కార్పోరేషన్ ద్వారా చేసిన అప్పులకు కేవలం 9.62 శాతం వడ్డీని ప్రకటించాం. ఆనాడు ఆర్బీఐ ద్వారా రాష్ట్రానికి ఇచ్చే అప్పులకు ఉన్న వడ్డీ 7.93 శాతం, అంటే వైయస్ఆర్‌సీపీ హయాంలో మేం చేసిన అప్పులకు అదనంగా చెల్లిస్తామని చెప్పింది 1.69 శాతం మాత్రమే. అంటే మీ హయాం కంటే తక్కువే.

అలాగే మేం రాష్ట్రానికి చెందిన ఎటువంటి అస్తులను తాకట్టు పెట్టలేదు. ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో తాజాగా ఏపీఎండీసీ ద్వారా చేస్తున్న అప్పులకు 9.3 శాతం వడ్డీని ప్రకటించారు. ఇప్పుడు ఆర్బీఐల ద్వారా రాష్ట్రానికి వచ్చే అప్పులకు ఉన్న వడ్డీ 6.71 శాతం మాత్రమే. అంటే రాష్ట్రానికి తక్కువ వడ్డీలకే రుణాలు దొరికే పరిస్థితి ఉన్నా కూడా, దాదాపు 2.59 శాతం ఎక్కువకు ఏపీఎండీసీ పేరుతో అప్పులు చేస్తున్నారు. అలాగే ఆర్బీఐ నుంచి నేరుగా డబ్బులు తీసుకునేలా అనుమతులు ఇచ్చారు. అలాగే జీఓ69, 24.04.2025 ప్రకారం ఏపీఎండీసీకి సంబంధించిన 436 గనులకు సంబంధించి రూ. 1,91,000 కోట్ల ఖనిజ సంపదను సెక్యూరిటీగా ఇచ్చారు. దీనికి గానూ నెలనెలా చెల్లింపులు చేస్తామంటూనే, ఆర్బీఐలోని రాష్ట్ర ప్రజల ఖాతా నుంచి నేరుగా సొమ్మును తీసుకునేందుకు ప్రైవేటు వ్యక్తులకు అవకాశం కల్పించారు.

ఇండియా రేటింగ్స్ అనే సంస్థ ద్వారా రేటింగ్స్ చేయించుకున్నారు. దీనిలో ఆర్బీఐ నుంచి నేరుగా డబ్బులు తీసుకునే అనుమతి ఇచ్చినందుకు దీనికి ఎక్కువ రేటింగ్ ఇచ్చారు. డిఎస్ఆర్‌ఏ ప్రకారం ఒక నిధిని ఏర్పాటు చేసి, దాని నుంచి రుణదాతలకు చెల్లింపులు చేస్తామని, ఒకవేళ ఆ నిధిలో డబ్బు లేకపోతే నేరుగా ఆర్బీఐలోని రాష్ట్ర ఖాతా నుంచి ప్రైవేటు వ్యక్తులు డబ్బులు తీసుకునే వెసులు బాటు కల్పిస్తున్నామని ప్రభుత్వమే అంగీకరించింది.

– ఈ లెక్కలకు సమాధానం చెప్పగలరా?

అప్పుల పేరుతో వైయస్ఆర్‌సీపీ ప్రభుత్వంపై అనేక అబద్దాలను ప్రచారం చేశారు. రాష్ట్రాన్ని శ్రీలంక, కాంబోడియా చేశామని అన్నారు. రాష్ట్ర విభజన తరువాత ఏపీకి ఉన్న అప్పులు రూ.1,40,717 కోట్లు. 2014-19 తెలుగుదేశం ప్రభుత్వం దిగిపోయే నాటికి మొత్తం అప్పులు రూ.3,90,247 కోట్లకు చేరుకున్నాయి. అంటే తెలుగుదేశం అయిదేళ్ళ పాలనలో చేసిన అప్పులు రూ.2.49,350 కోట్లు. ఏడాది మీద ఏడాదికి 22.62 శాతం చొప్పున అప్పు పెరిగింది.

మార్చి 2019 నుంచి 2024లో వైయస్ఆర్‌సీపీ ప్రభుత్వ అయిదేళ్ళ కాలంలో చేసిన అప్పులు చూస్తే కేవలం రూ.3,32,671 కోట్లు మాత్రమే. అంటే ఏడాదికి 13.57 శాతం మాత్రమే మా హయాంలో అప్పు పెరిగింది. ఇది కూడా రెండేళ్ళ పాటు కోవిడ్ సంక్షోభంను ఎదుర్కోవడంలో చేసిన అప్పులు కలిపి. ఇక ఆదాయాల గురించి చెప్పాలంటే 2023-24 అంటే వైయస్ఆర్‌సీపీ ప్రభుత్వ చివరి ఏడాదిలో వచ్చిన పన్ను ఆదాయం రూ.85,922 కోట్లు. ఏడాది కూటమి పాలనలో వచ్చిన ఆదాయ రూ.89 వేల కోట్లు. అంటే కేవలం 4 శాతం మాత్రమే పెరుగుదల కనిపిస్తోంది.

పన్నేతర ఆదాయాన్ని చూస్తే కూటమ హయాంలో మైనస్ 8.6 శాతం. ఎందుకంటే 2023-24లో మాకు రూ.7,432 వస్తే, మీకు రూ.6,792 కోట్లు మాత్రమే వచ్చింది. మొత్తం పన్ను ఆదాయం చూస్తే వైయస్ఆర్‌సీపీ ప్రభుత్వంలో రూ.93,354 కోట్లు వసత్ఏ, కూటమి ప్రభుత్వంలో రూ. 96,227 కోట్లు వచ్చింది. అంటే తేడా కేవలం 3 శాతం మాత్రమే పెరిగింది. అప్పులు చూస్తే… మా చివరి సంవత్సరం రూ.62,720 కోట్లు చేస్తే, కూటమి పాలనలో ఏడాదికి రూ.81,597 కోట్లు అంటే ముప్పై శాతం అప్పులు పెంచారు.

మూలధన వ్యయం రూ.23,330 కోట్లు అయితే, కూటమి ప్రభుత్వంలో చేసింది కేవలం రూ. 1,9170 కోట్లు. అంటే కూటమి ప్రభుత్వం మైనస్ 18శాతం తక్కువగా మూలధన వ్యయం చేసింది. రాష్ట్ర ఆదాయంను కూటమి ప్రభుత్వం ఏడాదిలో 3 శాతం పెంచింది. వైయస్ఆర్‌సీపీ చివరి ఏడాదిపైన మీ చివరి సంవత్సరం అప్పులు 30 శాతం పెంచారు, మూలధన వ్యయం మైనస్ 18 శాతం పెంచారు. మా చివరి సంవత్సరం అంతకు ముందు సంవత్సరంతో లెక్కేస్తే 2022-23 లో పన్ను ఆదాయం రూ.77,800 కోట్లు, 2023-24 లో రూ.86,000 కోట్లు. అంటే పదిశాతం వైయస్ఆర్‌సీపీ ప్రభుత్వం పెంచింది.

పన్నేతర ఆదాయం 2022-23లో రూ.5400 కోట్లు, అలాగే 2023-24లో రూ. 7430 కోట్లు, అంటే 37 శాతం పెంచాం. మొత్తం రాష్ట్రానికి వచ్చిన ఆదాయం 2022-23లో రూ.83,200 కోట్లు, 2023-24లో రూ.93,354 కోట్లు, అంటే 12 శాతం పెరుగుదల. కూటమి ప్రభుత్వం పెంచింది కేవలం 3 శాతం మాత్రమే. మా హయాంలో 2022-23లో చేసిన అప్పు రూ.52,528 కోట్లు, 2023-24లో రూ. 62,720 కోట్లు మాత్రమే. అంటే కేవలం 19 శాతం పెరిగితే, కూటమి ప్రభుత్వం 30 శాతం అప్పు పెంచింది. దీనిని బట్టి ఎవరి హయాంలో సంపద సృష్టించడం జరిగిందో అర్థమవుతోంది.

2023-24లో వైయస్ఆర్‌సీపీ ప్రభుత్వ బడ్జెట్‌ రూ.2,35,720 కోట్లు. దానిలో జీతాలు, పెన్షన్లు, అప్పు తీసేస్తే గ్యాప్ రూ.1,09,000 కోట్లు. కూటమి బడ్జెట్ రూ.2,45,000 కోట్లు, వారి వ్యయాలు తీసేస్తే గ్యాప్ రూ.1,07,000 కోట్లు. మేం అనేక సంక్షేమ పథకాలను అమలు చేశాం. కానీ కూటమి ప్రభుత్వం ఏడాదిలో అమలు చేసిన సంక్షేమ పధకాలు ఏవీ? దేనికి ఖర్చు చేశారో చెప్పాలి. క్యాలెండర్ ప్రకారం మా హయాంలో ప్రతినెలా నిర్ధిష్టమైన సంక్షేమ పధకాలను అమలు చేశాం. కూటమి ప్రభుత్వంలో ఒక్క పెన్షన్ తప్ప ఏ ఒక్క పధకాన్ని పూర్తిగా అమలు చేయలేదు. ఈ డబ్బులన్నీ ఏం చేశారో చెప్పాలి.

రాజధాని కడుతున్నారా? నగరాన్ని నిర్మిస్తున్నారా?

రాష్ట్ర విభజన సందర్భంగా రాజధాని కోసం శివరామకృష్ణ కమిటీని కేంద్రం నియమించింది. శివరామకృష్ణ పట్టణాభివృద్దిశాఖ నిపుణుడు, సీనియర్ ఐఎఎస్ అధికారి. ఆయన 9 జిల్లాల్లో స్వయంగా పర్యటించారు. తరువాత తన నివేదికను కేంద్రానికి సమర్పించారు. ఆ రిపోర్ట్‌లో చెప్పిన దానిని పక్కకు పెట్టి దాదాపు 30 వేల సారవంతమైన వ్యవసాయ భూములను రాజధాని కోసం అంటూ చంద్రబాబు సేకరించారు.

మొదట్లో చంద్రబాబు ఇచ్చిన నివేదికలో రాజధాని కోసం 1500 ఎకరాలు చాలు అని చెప్పారు. దానికి బదులు 30 వేల ఎకరాలు సేకరించారు. ఇప్పుడు మరో 40 వేల ఎకరాలను సేకరిస్తామని చెబుతున్నారు. అసలు రాజధానిని నిర్మించేందుకా, లేక రియల్ ఎస్టేట్‌ కోసమా ఈ భూసేకరణ? రాజధానిని కట్టాలని అనుకుంటున్నారా? నగరాన్ని నిర్మించాలని అనుకుంటున్నారా? దీనిపై ప్రజలకు క్లారిటీ ఇవ్వాలి. నగరాలను ఎవరూ నిర్మించలేరు. కాలక్రమంలో అది అభివృద్ధి చెందుతుంది.

LEAVE A RESPONSE