– ప్రజారోగ్యం కోసం పరితపించిన ముఖ్యమంత్రి
– ప్రజలు గమనించాలన్న మంత్రి సత్యకుమార్ యాదవ్
అమరావతి: గత నెలరోజులుగా రాష్ట్రంలో నెలకొన్న పరిణామాల నేపథ్యంలో మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి నరుకుడు వైఖరిపై వైద్యారోగ్య శాఖా మంత్రి సత్యకుమార్ యాదవ్ ధ్వజమెత్తారు. గత ఎన్నికల్లో ఎదురైన భారీ ప్రజా వ్యతిరేకతతో మైండ్ బ్లాకై గంగమ్మ జాతరలో పొట్టేళ్ల తలలు తెగే విధంగా మళ్లీ అధికారంలోకొస్తే ప్రత్యర్థులు, ప్రజల తలలు తప్పిస్తానంటూ నరుకుడు భాష మాట్లాడి రప్పారెడ్డిగా జగన్ రెడ్డి మిగిలిపోయారని మంత్రి ఎద్దేవా చేశారు.
గత నెల రోజులకు పైగా రాష్ట్ర ప్రజల సమగ్ర ఆరోగ్యం కోసం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదియోగి పతంజలి రూపొందించిన యోగాను ప్రజల్లోకి తీసుకెళ్లడానికి అహర్నిశలూ శ్రమించి విజయం సాధించారని…దీనికి భిన్నంగా 11 మంది ఎమ్మెల్యేలతో కూడిన ప్రతిపక్షానికి నాయకుడిగా చెప్పుకునే జగన్ రెడ్డి తన మాటలు, చేతలతో రప్పారెడ్డిగా తన నైజాన్ని ఆవిష్కరించుకున్నారని మంత్రి సత్యకుమార్ యాదవ్ ధ్వజమెత్తారు.
నభూతో…నభవిష్యతి అన్నరీతిలో విజయవంతమైన యోగాంధ్ర కార్యక్రమాన్ని సొంత మాధ్యమాల ద్వారా తక్కువచేసి చూపడానికి రప్పారెడ్డి దిగజారి తన వికృత మానసికతను, ప్రజా వ్యతిరేకతను వెల్లడించుకున్నారని మంత్రి అన్నారు.
రౌడీ షీటర్లను పరామర్శించడానికి జగన్ రెడ్డి చేసిన తెనాలి పర్యటన, బెట్టింగుల్లో సర్వస్వం కోల్పోయి ఆత్మహత్య చేసుకున్న తన పార్టీ కార్యకర్త కుటుంబాన్ని పలకరించడానికంటూ ఆయన చేసిన పొదిలి పర్యటన, ఆ సందర్భంగా జరిగిన ఘటనల పట్ల ఆయన తీరు జగన్ రెడ్డిలోని రప్పారెడ్డిని ప్రజల ముందుంచాయని మంత్రి సత్యకుమార్ యాదవ్ వ్యాఖ్యానించారు.
నా కార్యకర్తను నేను చంపుకుంటే మీకెందుకు బాధ…చనిపోయిన వ్యక్తి కుటుంబానికి రూ.10 లక్షలిచ్చాను…ఇంతకంటే ఏంకావాలి అంటూ రప్పారెడ్డి మాట్లాడిన తీరు ఆయన కర్కశత్వానికి, అమానవీయతకు అద్దంపట్టిందని మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు.
తాను ప్రయాణిస్తున్న వాహనం చక్రాల కింద పడి సింగయ్య అసువులు బాసిన ఘటనపై కనీసం విచారం కూడా వ్యక్తం చేయని హంతకుడు జగన్ రెడ్డి అని మంత్రి దుయ్యబట్టారు. శవాన్ని ముళ్లపొదల్లోకి లాగి పడేసి చిరునవ్వులు చిందిస్తూ జేజేలు కొట్టించుకుంటూ ముందుకు సాగిన జగన్ రెడ్డిలో రప్పారెడ్డి ఏమేరకు ఆవహించి ఉన్నాడో ప్రజలకు తేటతెల్లమైందని మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు.
రాష్ట్రంలో ప్రజాహితం కోసం, ప్రజా వినాశనం కోసం గతేడాది కాలంగా జరుగుతున్న ప్రయత్నాల రూపురేఖలు గత నెలరోజుల పరిణామాలతో మరింత స్పష్టంగా వెల్లడయ్యాయి. అన్నం ఉడికిందో లేదో తెలుసుకోడానికి ఒక్క మొతుకు పట్టుకుంటే చాలు అన్నది నానుడి.
జగన్ రెడ్డి వాస్తవ మానసిక వికృతక్రీడకు అద్దంపట్టింది. ఆయన వాడిన రప్పా…రప్పా భాష. తిరిగి అధికారంలోకొస్తే ప్రజల తలలు తెగిపడతాయి అని నిస్సిగ్గుగా, నిర్భీతితో మాట్లాడగలిగేది ఒక జగన్ రెడ్డి మాత్రమే. వివేకవంతులైన రాష్ట్ర ప్రజలు తమకోసం శ్రమించే వారెవరో…తమ వినాశనంపై సౌధాలు కట్టుకునేవారెవరో గ్రహిస్తారని మంత్రి విశ్వాసాన్ని వ్యక్తం చేశారు.