Suryaa.co.in

Andhra Pradesh

రాష్ట్రంలో కేన్సర్ అనుమానితుల్లో 8.55% మందికి రోగనిర్ధారణ

– మరో 4% నికి కేన్సర్ ముందస్తు దశ
-కేన్సర్ నివారణ, చికిత్సలపై ఆరోగ్యశాఖ మంత్రి, ఉన్నతాధికారులతో డా.నోరి దత్తాత్రేయ విస్తృత చర్చలు
-రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కేన్సర్ సర్వేను అభినందించిన డా.నోరి
– వ్యాధి పట్ల ప్రజల్లో అవగాహన పెంచాలి

అమ‌రావ‌తి: రాష్ట్రంలో కేన్సర్ వ్యాధి అనుమానితుల్లో 8.55% మందికి ఈ వ్యాధి ఉన్నట్లు నిర్ధారణ అయింది. మరో 3.88% మంది కేన్సర్ ముందస్తు దశలో ఉన్నారు.

గత నవంబర్ నుంచి నేటి వరకు వైద్యారోగ్య శాఖ రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన కేన్సర్ సర్వేలో ఈ ఫలితాలు వెల్లడయినాయి.క్షేత్ర స్ధాయి సిబ్బంది కేన్సర్ అనుమానితులుగా గుర్తించిన 1367 మందికి రోగనిర్ధారణ పరీక్షలు చేయగా 170 మందికి (12.44%) వివిధ స్థాయిల్లో ఈ వ్యాధి సొకినట్లు వెల్లడయింది.వీరిలో 117 మందికి కేన్సర్ ప్రాణాంతక దశలో ఉండగా మరో 53 మందికి ఈ స్ధాయికి ముందు దశలో ఉన్నట్లు సర్వేలో వెల్లడయింది.

రాష్ట్రంలో కేన్సర్ నివారణ, చికిత్సలకు సంబంధించి వివిధ అంశాలపై అంతర్జాతీయ కేన్సర్ నిపుణుడు రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు డా.నోరి దత్తాత్రేయ రెండు గంటల పాటు వైద్యారోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్, ఉన్నతాధికారులతో విస్తృతంగా చర్చించారు. కేన్సర్ వ్యాధి నివారణ ప్రాధాన్యత దృష్ట్యా రాష్ట్రంలో ఈ వ్యాధికి సంబంధించి ప్రభుత్వం చేపట్టిన రాష్ట్ర వ్యాప్త సర్వేను డా.దత్తాత్రేయ అభినందించారు.

సర్వే జరిగిన తీరును, వెల్లడయిన ఫలితాలను ఆయన ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి . యమ్.టి.కృష్ణబాబు, ఇతర ఉన్నతాధికారులతో వివరంగా చర్చించారు. సర్వేలో వెల్లడయిన ఫలితాలు కేన్సర్ వ్యాప్తికి సంబంధించి దేశ ప్రమాణాల కంటే తక్కువగా ఉన్నాయని వీటిని మరోసారి సరిచూసుకోవాలని ఆయన సూచించారు.

ప్రజల్లో అవగాహన కల్పించాలి

కేన్సర్ వ్యాధిని ముందుగానే గుర్తించి తగు సమయంలో చికిత్సను అందిస్తే ప్రాణాంతకమైన ఈ వ్యాధిని అరికట్టవచ్చన్న విషయంపై ప్రజల్లో చైతన్యం కల్పించాలని డా.నోరి సూచించారు. రాష్ట్రంలో వివిధ ప్రభుత్వ ఆసుపత్రుల్లో కేన్సర్ చికిత్సకు ఉన్న సౌకర్యాలు, ప్రజలకు అందుతున్న సేవల గురించి ఆయన వివరాలు తెలుసుకున్నారు. కొన్ని ప్రధాన ఆసుపత్రులను కేన్సర్ హబ్ ఆసుపత్రులుగా అభివృద్ధి చేసి ఆయా చోట్ల అన్ని ఏర్పాట్లు చేయాలని , ఈ సమాచారాన్ని ప్రజలకు తెలియజేయాలని డా.నోరి సూచించారు.

రిజిస్ట్రేషన్ తప్పనిసరి

ప్రమాదకరమైన కేన్సర్ వ్యాధి నివారణకు , చికిత్సా సేవలకు ప్రజల్లో ఈ వ్యాధి ప్రభలతపై నిర్దిష్ట సమాచారంతో ప్రాంతీయ ప్రణాళికలు అవసరమని డా.నోరి స్పష్టం చేశారు. ఈ దిశగా ఈ వ్యాధి బారినపడ్డ వారందరి సమాచారాన్ని సేకరించడం అత్యవసరమని, ఈ దిశగా రాష్ట్రంలోని ప్రైవేటు ఆసుపత్రలకు తగు ఆదేశాలు జారీచేసి ఈ సమాచారం పొందేలా చర్యలు తీసుకోవాలని డా.దత్తాత్రేయ అన్నారు. కేన్సర్ నోటిఫయబుల్ వ్యాధి కనుక తక్షణమే ఆ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటన చేయాలని ఆయన సూచించారు.

రాష్ట్రంలో విశాఖపట్నంలోని కింగ్ జార్జ్ ఆసుపత్రి, మరియు టాటా ట్రస్ట్ ఆసుపత్రి , గుంటూరు ,కర్నూలు,తిరుపతిలలోని ప్రభుత్వ సర్వజన ఆసుపత్రులను కేన్సర్ చికిత్సకు ప్రధాన హబ్ ఆసుపత్రులుగా అభివృద్ధి చేస్తున్నట్లు ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కృష్ణబాబు తెలిపారు.
రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులలో అందుబాటులో ఉన్న వివిధ కేన్సర్ పరీక్ష మరియు చికిత్సా సేవలు, ఇతర సమాచారంతో ఒక డాష్ బోర్డును ఏర్పాటు చేసి, సమాచార‌ లోపంతో ఎవరూ నష్టపోకుండా చర్యలు చేపట్టాలని డా.నోరి ప్రభుత్వానికి సూచించారు.

అసంక్రమణ వ్యాధుల సర్వే (NCD 3.0) లో భాగంగా గత నవంబర్ నుంచి నోటి కేన్సర్, రొమ్ము కేన్సర్, సర్వైకల్ కేన్సర్ పై సర్వే జరుగుతోంది.

LEAVE A RESPONSE