అమరావతి: వైఎస్ఆర్సీపీ సీనియర్ నేత సజ్జల రామకృష్ణారెడ్డికి హైకోర్టు లో భారీ ఊరట లభించింది. తదుపరి చర్యలన్నీ నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేస్తూ, విచారణను వాయిదా వేసింది . కాగా సజ్జల అమరావతి ప్రాంత మహిళలను, రైతులను, దళితులను “సంకర జాతి” అంటూ అవమానించారని, సాక్షిటీవీ ఛానల్ డిబేట్లో చేసిన వ్యాఖ్యలపై నిరసనలు వ్యక్తం చేసిన వారిని రాక్షసులు, పిశాచులుగా వర్ణించారని ఆరోపణలతో తాడేపల్లి పోలీస్ స్టేషన్లో జూన్ 22న కేసు నమోదైంది.
దళిత యువజన జేఏసీ నేత, రాష్ట్ర మాదిగ కార్పొరేషన్ డైరెక్టర్ కంభంపాటి శిరీష ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు రిజిస్టర్ చేశారు. అలాగే ఈ వ్యాఖ్యలపై ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు డీజీపీకి ఫిర్యాదు చేయగా, జాతీయ మహిళా కమిషన్ కూడా సుమోటోగా నోటీసు జారీ చేసింది. అయితే ఈ కేసులను కొట్టివేయాలని, అరెస్టు నుంచి రక్షణ కల్పించాలని సజ్జల ఏపీ హైకోర్టులో క్వాష్ పిటిషన్, ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు.
ఈ కేసు విచారణలో సజ్జల తరపు న్యాయవాదులు ఆయన వ్యాఖ్యలు వ్యక్తిగతం కాదని, రాజకీయ సందర్భంలో జరిగాయని వాదించగా, పోలీసులు వీడియో ఆధారాలను సమర్పించారు. ఇరువైపులా వాదనలు విన్న హైకోర్టు.. తదుపరి ఆదేశాలు ఇచ్చేవరకు ఎలాంటి చర్యలు తీసుకోవద్దని ఆదేశాలు జారీ చేసింది.