* కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణకు శాపం
* కాంగ్రెస్ పార్టీ పాలన ఫ్రమ్ ఢిల్లీ, టూ ఢిల్లీ, ఫర్ ఢిల్లీ అన్నట్లుగా తయారైందని ఎద్దేవా
* ప్రజల పక్షాన కొట్లాడడమే ప్రస్తుత బాధ్యత
* బిఅర్ ఎస్ తిరిగి అధికారంలోకి రావాడం ఖాయం
* పార్టీ కార్యకర్తలు అంతా కోరుతున్నందున కచ్చితంగా రాష్ట్రవ్యాప్తంగా విస్తృత స్థాయి పాదయాత్రను నిర్వహిస్తా
– టీడీపీ, వైసీపీ నేతలతో వ్యక్తిగత సంబంధాలున్నాయి
* కెసిఅర్ అరోగ్యంతో ఉన్నారు.. పార్టీకీ మార్గదర్శనం చేస్తున్నారు
*పార్టీ నేతలపై వేధింపులు, అక్రమ కేసులు పెడుతున్న పోలీసులపై కఠిన చర్యలు
* రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయి
* మా సోషల్ మీడియా వారియర్లు అద్భుతంగా పనిచేస్తున్నారు
* సామాజిక మాధ్యమం ఎక్స్ లో ప్రజలతో భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేసీఆర్ సంభాషణ
హైదరాబాద్: పార్టీ కార్యకర్తలు అంతా కోరుతున్నందున భవిష్యత్తులో రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్రను నిర్వహిస్తానని భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. దీపావళి రోజు నెటిజన్లతో జరిగిన సామాజిక మాధ్యమం ఎక్స్ సంభాషణ ఎక్స్ కెటిఅర్ లో ఈ మేరకు కెటిఅర్ తెలిపారు.
పలువురు ప్రత్యేకంగా ఈ అంశంలో కేటీఆర్ అభిప్రాయాన్ని కోరారు. దేశంలోని అనేక పార్టీల నేతలు, ప్రభుత్వాల వైఫల్యాలను ఎండగట్టడంతోపాటు, పార్టీలను బలోపేతం చేసేందుకు పార్టీ అద్యక్షులు పాదయాత్రలు చేస్తున్నారు, మీరు ఎప్పుడు చేస్తారని అడిగారు. దీనికి స్పందించిన కెటిఅర్ ఖచ్చితంగా తన పాదయాత్ర ఉంటుందని వెల్లడించారు.
దాదాపు గంటన్నపాటు సాగిన ఈ సంభాషణలో కెటిఅర్..అనేక అంశాలపై తన అభిప్రాయాలను ప్రజలతో పంచుకున్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణకు శాపం
తెలంగాణ రాష్ట్రానికి కాంగ్రెస్ పాలన ఒక శాపంగా మారిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చే ఉద్దేశాలు ఏమాత్రం లేవు… అందుకే అబద్ధాల మీద, అసత్యాల మీద సమయం గడుపుతూ ప్రజలను మోసం చేస్తున్నారు. గత పది నెలల కాలంలో కాంగ్రెస్ పార్టీ చేసిన ఒక్క మంచి కూడా గుర్తుకు రావడం లేదన్నారు. అబద్ధపు హామీల మీద ఎన్నికైన కాంగ్రెస్ పార్టీ నుంచి, ఇంతకంటే గొప్ప పరిపాలన ఆశించలేమన్నారు.
తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు రాజకీయ వేధింపులను ప్రారంభించింది అన్నారు. అయితే వీటికి భయపడేది లేదని కేటీఆర్ అన్నారు. సన్నవడ్లకు కూడా బోనస్ ఇస్తామని చెప్పిన కాంగ్రెస్ పార్టీ హామీ బోగస్ గా మారిందని కేటీఆర్ అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నమ్మి ఓట్లు వేసి మద్దతు ధర లేక రైతు బంధు లేక నష్టపోతున్న రైతన్నల తరఫున పోరాడుతామన్నారు. కాంగ్రెస్ పార్టీ పాలన ప్రమ్ ఢిల్లీ, టూ ఢిల్లీ, ఫర్ డీల్లీ అన్నట్లుగా తయారైందని ఎద్దేవా చేశారు.
కాంగ్రెస్ పాలనలో జరుగుతున్న పతనం నుంచి తెలంగాణ కోలుకోవడం సాధ్యం కాదు
నాలుగు సంవత్సరాల తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారం పోవడం ఖాయమని అయితే కొత్త ప్రభుత్వానికి ఈ ప్రభుత్వం చేసిన నష్టం నుంచి తేరుకొని ముందుకు తీసుకుపోవడం అతిపెద్ద సవాలుగా మారుతుందని కేటీఆర్ అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర ఆర్థిక ప్రగతి పూర్తిగా పతనం అయిందన్నారు.
అన్ని రంగాల్లో తెలంగాణ రాష్ట్రం వెనక్కి పోతున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ఆదాయ వనరులు నుంచి మొదలుకొని వ్యవసాయ రంగం, అన్ని రంగాలు తిరోగమనంలో ఉన్నాయన్నారు. నిరుద్యోగిత పెరిగిందన్నారు. తెలంగాణ రాష్ట్రం నుంచి అనేక కంపెనీలు వదిలి వెళ్ళిపోతున్నాయన్నారు. ఈ అంశాల్లో రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి ప్రణాళికలు ఉన్నాయో ఎవరికీ తెలియడం లేదన్నారు. కాంగ్రెస్ పాలన వలన జరుగుతున్న నష్టాన్ని పూడ్చుకోవడం అప్పుడప్పుడే సాధ్యం కాదు అన్నారు.
ప్రజల పక్షాన కొట్లాడడమే ప్రస్తుత భాధ్యత
ప్రస్తుతం ప్రధాన ప్రతిపక్ష బాధ్యతలు నిర్వహించడం పైన ప్రధానంగా దృష్టి సారించామని తెలిపిన కేటీఆర్, ఈ ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలుతో పాటు తీసుకున్న నిర్ణయాలలో పారదర్శకత పైన ప్రజల తరఫున కొట్లాడుతామన్నారు. కాంగ్రెస్ పార్టీ పట్ల అప్పుడే బలమైన ప్రజా వ్యతిరేకత ఉన్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీని రాజ్యాంగబద్ధంగా మార్చే అవకాశం ఉన్నదా అని ఒకరు అడిగిన ప్రశ్నకు సమాధానంగా మరో నాలుగు సంవత్సరాలు వేచి ఉండాల్సిందే అన్నారు.
అయితే ప్రజలు ఐదు సంవత్సరాల కోసం కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చారు కాబట్టి దాన్ని గౌరవించాల్సిన అవసరం ఉందన్నారు. ముఖ్యమంత్రి అయిదు సంవత్సరాలు పూర్తి కాలం పదవిలో ఉంటారా లేదా ఓటుకు నోటు వలన బిజెపికి వెళ్తాడా అని ఒకరు అడిగిన ప్రశ్నకు సమాధానంగా.. రాజకీయాల్లో ఏదైనా జరుగుతుందని ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ చరిత్ర చూస్తే ఎప్పుడూ ఎలాంటి పరిణామాలైనా జరగవచ్చు అన్నారు
రాజకీయాల్లోకి కుటుంబాలను లాగడం నీచం
మేము అధికారంలో ఉన్న పది సంవత్సరాలలో ఏనాడు ఇతరుల కుటుంబ సభ్యులను రాజకీయ అంశాల్లోకి లాగలేదన్నారు. దాదాపు రెండు దశాబ్దాల తన రాజకీయ జీవితంలో కుటుంబ సభ్యులను అవహేళన చేసి మాట్లాడినప్పుడు, రాజకీయాలు వదిలేయాలన్నంత భావోద్వేగానికి గురైన విషయాన్ని కేటీఆర్ ప్రస్తావించారు. కేవలం రాజకీయాల కోసం ఇతరుల కుటుంబ సభ్యులను ఎందుకు లాగుతారో అర్ధంకాదని, ఈ విషయం తనకు అత్యంత బాధ కలిగిస్తుందన్నారు.
నీచమైన రాజకీయాల కోసం తన కుటుంబాన్ని లాగుతున్న ముఖ్యమంత్రి పైన, ఆయన వందిమాగదుల పైన ప్రజల మద్దతుతో పోరాటం చేస్తాను. రెేవంత్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ నీచమైన రాజకీయ సంస్కృతి. అత్యంత హీనమైన దశలో రాష్ట్రం ఉన్నది . అయితే ఈ నీచమైన దశకూడా త్వరలో ముగిసిపోతుందన్న నమ్మకం వ్యక్తం చేశారు.
మూసీ, హైడ్రా పైన కెటిఅర్
చెరువుల సంరక్షణ పేరుతో ప్రభుత్వం పేపర్ మీద గొప్పలు చెబుతున్నప్పటికీ అసలైన ఎజెండా అవినీతి మాత్రమే. మూసి బ్యూటిఫికేషన్ కి మేము వ్యతిరేకం కాదు. కానీ మూసి లూటిఫీకేషన్ కి వ్యతిరేకం. మూసీ ప్రక్షాళన దేశంలోనే అతిపెద్ద అవినీతి స్కాం అవుతుందన్నారు.
హైడ్రా కేవలం కొందరిని మాత్రమే లక్ష్యంగా చేసుకొని పనిచేస్తుంది ఇప్పటిదాకా ఒక్క పెద్ద బిల్డర్ ని కూడా హైడ్రా ముట్టుకోలేదు, కేవలం పేదలను మధ్యతరగతి ప్రజలను మాత్రమే నిర్దయగా దోచుకున్నదన్నారు . మూసీ నది ప్రక్షాళన అనేది దేశంలోనే అతిపెద్ద అవినీతి స్కామ్ గా నిలవబోతున్నది అన్నారు.
మా సోషల్ మీడీయా వారియర్లు గొప్పగా పనిచేస్తున్నారు
ఎన్నికల్లో ఓటమి తర్వాత సామాజిక మాధ్యమాల్లో పార్టీ మద్దతుదారులు ప్రపంచవ్యాప్తంగా బాగా యాక్టివ్ గా మారారన్నారు. ఈ అంశంలో పార్టీని మరింతగా బలోపేతం చేసేందుకు అనేక అంశాలను చర్చించాము. పార్టీ తరఫున ఏం ఆశించకుండానే అద్భుతంగా పనిచేస్తున్నారని, వారి మద్దతును పార్టీకీ సోషల్ మీడియా వారియర్లు అందిస్తున్నారన్నారు.
ఇంత బలమైన సోషల్ మీడియా బృందాన్ని కలిగినందుకు సంతోషంగా ఉందని తెలిపారు.త్వరలోనే ఒక విస్తృత సమావేశాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. తెలంగాణకు వ్యతిరేకంగా, కాంగ్రెస్ కు మద్దతుగా వ్యవహరిస్తున్న ప్రధాన స్రవంతి మీడియాకి ప్రత్యామ్నాయం సోషల్ మీడియా మాత్రమే అన్నారు.
కెసిఆర్ అరోగ్యం, రాజకీయాలపైన కెటిఅర్ స్పందన
తెలంగాణ రాష్ట్రం ఉన్నన్ని రోజులు తెలంగాణ పదం ఉన్నన్ని రోజులు కేసీఆర్ పేరు నిలిచే ఉంటుందన్నారు. కెసిఆర్ సంపూర్ణంగా ఆరోగ్యంగా ఉన్నారని, ఆయన పార్టీని, తమ నాయకులందరికీ ఎప్పటికప్పుడు ఆయా అంశాల పైన మార్గదర్శనం చేస్తున్నారని తెలిపారు. బాధ్యత కలిగిన ప్రతిపక్ష నాయకుడిగా కొత్తగా ఎన్నికైన ఈ ప్రభుత్వానికి ఇచ్చిన 420 హామీలు అమలు చేసేందుకు సరిపడా సమయం ఇచ్చారన్నారు. నూతన సంవత్సరం తర్వాత ఆయన నుంచి మరిన్ని కార్యక్రమాలను చూస్తామన్నారు
పోలీసు వేధింపులపై హెచ్చరిక
ప్రస్తుతం తమ విధులు మరిచి, చట్ట విరుద్ధంగా భారత రాష్ట్ర సమితి కార్యకర్తలు నాయకులపైన రెచ్చిపోతున్న పోలీస్ అధికారులను గుర్తుపెట్టుకుంటామన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత వారిపై చట్టపరంగా కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. రాష్ట్రంలో రాజకీయ వేధింపుల విషయంలో ప్రభుత్వ అధినేతలను ప్రసన్నం చేసుకునే పనుల్లో కొంతమంది పోలీసు అధికారులు బిజీగా ఉండడం వలన శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించి పోయాయని కేటీఆర్ అన్నారు.
రాష్ట్రానికి పూర్తిస్థాయి హోంమంత్రి అవసరం ఉందన్నారు. మేము 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు శాంతి భద్రతల విషయంలో కఠినంగా వ్యవహరించామని తెలిపారు. మతపరమైన హింస వాంఛనీయం కాదన్నారు. హైదరాబాద్ లాంటి మెట్రోపాలిటన్ నగరంలో నెల రోజులపాటు ఎలాంటి కారణం లేకుండా 144 సెక్షన్ విధించడం షాక్ కు గురి చేసింది అన్నారు. ఏదో అత్యంత కీలకమైన అంశం సరిగా లేకుంటేనే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంటుందని కేటీఆర్ అన్నారు.
పలు ఇతర అంశాలపై కెటిఅర్ స్పందన
తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ బిజెపి కలిసి పని చేస్తున్నాయని కేటీఆర్ అన్నారు. అనేక అంశాలు రెండు పార్టీల నాయకులు కుమ్మకై పనిచేస్తున్న విషయం ప్రజలందరికీ అర్థమవుతుంది అని తెలిపారు
ఇచ్చిన హామీలను తప్పుతున్న కాంగ్రెస్ లాంటి పార్టీలపై చర్యలు తీసుకునేందుకు ప్రజలను పదేపదే మోసం చేయడానికి అరికట్టేందుకు బలమైన ఎన్నికల సంస్కరణలు అవసరమన్నారు మహారాష్ట్ర ఎన్నికల్లోను జాతీయ పార్టీలను ప్రజలు నమ్మవద్దని అక్కడి స్థానిక పార్టీలకు ఓటు వేయాలన్నారు తమిళనాడు విజయ్ దళపతి ప్రారంభించిన రాజకీయ పార్టీకి శుభాకాంక్షలు తెలిపారు.
రాజకీయపరమైన అంశాల పట్ల విభేదాలే తప్ప.. తెలుగుదేశం, వైఎస్సార్సీపీ అగ్ర నాయకులందరితో వ్యక్తిగతంగా మంచి అనుబంధం ఉన్నదన్నారు.
ప్రజలే సాధారణ వ్యక్తులను నేతలుగా తయారు చేస్తారని తన నమ్మకం అన్నారు. బిఆర్ఎస్ పార్టీ బలంగా తిరిగి అధికారంలోకి వస్తుందన్నారు. బిఆర్ఎస్ పార్టీ కుటుంబం, తన స్నేహితులు, కుటుంబ సభ్యుల వల్లనే తనకు నిత్యం స్ఫూర్తి లభిస్తుందన్నారు.
ప్రస్తుతం ప్రతిపక్షంలో ఉండే అవకాశం వలన మాకు నిబద్ధత కలిగిన, బలమైన నూతన నాయకత్వాన్ని తయారు చేసుకునే అవకాశం ఇచ్చింది. నిజం కన్నా పర్సెప్షన్, పీపుల్ మేనేజ్మెంట్ చాలా ముఖ్యమని గత ఎన్నికల ఓటమి మాకు నేర్పిందన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన అబద్ధపు హామీలు ప్రజల్లో అవాస్తవికమైన ఆశల్ని రేకెత్తించాయని, రెండుసార్లు వరుసగా గెలవడంతో యాంటీ ఇన్ కంబెన్సీ కూడా తమ ఒటమి విషయంలో కొంత ప్రభావం చూపింది.
పార్టీ మారిన 10 మంది అసెంబ్లీ స్థానాలు ఉప ఎన్నికలు
ఒకే దేశం ఒకే ఎన్నిక అనే అంశం బీజేపీ చేస్తున్న మరొక జుమ్లా అయి ఉంటుందని, అయితే వారు తీసుకువచ్చే చట్టం ఎలాంటిదో చూడాల్సిన అవసరం ఉందన్నారు. తన వ్యక్తిగత అభిప్రాయం ప్రకారం ఇది అసాధ్యం అని తెలిపారు.
గ్రూప్ వన్ అభ్యర్థుల తన పూర్తి మద్దతు ఉంటుందన్న కెటిఅర్, పార్టీ తరఫున వారికి అండగా ఉంటామన్నారు. యువతకు కాంగ్రెస్ ఇచ్చిన హామీల అమలుపైన రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒత్తిడి తీసుకువస్తాం అన్నారు