– ఉదయం నుంచి రాత్రి 12 వరకూ ఆర్టీజీఎస్‌లోనే
– పవన్, లోకేష్, మంత్రులూ అక్కడే
– కలెక్టర్లకు ఫోన్‌పై ఆదేశాలు
– ఆర్టీజీఎస్ నుంచే వారిని అప్రమత్తం చేసిన సీఎం బాబు
– అర్ధరాత్రి 12 గంటలకు ఇంటికి బయలుదేరిన చంద్రబాబు
– అప్రమత్తంగా.. అప్రతిబంధంగా ముందుకు సాగుతున్న ఏపీ ప్రభుత్వం!
ఆయనకు సంక్షోభాలు.. ప్రకృతి వైపరీత్యాలు కొత్తేమీ కాదు. సంక్షోభ సమయంలోనే ఆయన మరింత రాటుదేలతారు. ఇది చరిత్ర చెప్పిన సత్యం. అసలే పనిరాక్షసుడు. ఆయన నిద్రపోడు. ఎదుటివారిని నిద్రపోనివ్వరు. ఇప్పుడు ముంచుకువచ్చిన తుపానుతో అల్లకల్లోలం. ఇక ఆయన ఎలా పనిచేస్తారో ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు.
మొంధా తుపాను సృష్టించిన ప్రళయంతో ప్రజలు భీతిల్లకుండా.. ‘మీకు మేం ఉన్నామ’ంటూ భరోసా ఇచ్చేందుకు, ఆయన పొద్దున్నే ఆర్టీజీఎస్లో బైఠాయించారు. ఇక అక్కడి నుంచి కలెక్టర్లకు ఒకటే ఫోన్లు. సహాయ కార్యక్రమాలు ఎంతవరకూ వచ్చాయన్న ప్రశ్నలు. ఎంతమందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు? వారికి భోజన సదుపాయాలు కల్పించారా? మంచినీరు సరఫరా చేశారా? ఆసుపత్రులను అప్రమత్తం చేశారా? కావలసిన వాహనాలు అందుబాటులో ఉన్నాయా? అధికారుల మధ్య సమన్వయం ఎలా ఉంది? అంటూ శరపరంపర ప్రశ్నాస్త్రాలు. మధ్యాహ్నం ఆర్టీజీఎస్‌లోనే భోజనం.
అలా అందరినీ పరిగెత్తించి, అందరికీ పనులు అప్పగించి అర్ధరాత్రి 12 గంటలకు ఇంటికి బయలుదేరారు. ఇంతకూ ఆయన ఏపీ సీఎం చంద్రబాబునాయుడు అని ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. ఏపీని భయపెడుతున్న మొంథా ప్రళయ నేపథ్యంలో, రాష్ట్రానికి వీలైనంత తక్కువ నష్టం జరిగేలా చూసేందుకు చంద్రబాబు పడ్డ కష్టమిది!
తుఫాను తీరానికి కేవలం కొద్ది కిలోమీటర్ల దూరంలో ఉంది. కాకినాడ, మచిలీపట్నం, విశాఖపట్నం తీరాల్లో ఇప్పటికే వర్షాలు గర్జిస్తున్నాయి, గాలులు గుసగుసలాడడం మానేసి గర్జించసాగాయి. ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబు నాయుడు అధికారులతో అత్యవసర సమీక్ష నిర్వహించారు.
తుఫాను ప్రస్తుతం తీరానికి అత్యంత చేరువలో ఉందని, కోస్తాంధ్ర జిల్లాలపై దీని ప్రభావం ఇప్పటికే మొదలైందని అధికారులు సీఎంకు వివరించారు. ముఖ్యంగా కాకినాడ, మచిలీపట్నం, విశాఖపట్నం తదితర తీర ప్రాంతాల్లో భారీ వర్షాలు, బలమైన గాలుల తీవ్రత కనిపిస్తోందని తెలిపారు.
తీవ్రత దృష్ట్యా అధికారులను ఆదేశిస్తూ, గతంలో సంభవించిన తుఫానుల నష్టాన్ని బేరీజు వేసుకుని, దానికంటే మెరుగైన ముందస్తు చర్యలు తీసుకోవాలని సీఎం స్పష్టం చేశారు. తుఫాను తీరం దాటే అవకాశం ఉన్న కాకినాడ, దాని పరిసర ప్రాంతాలకు తక్షణమే ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, మరియు రెస్క్యూ బృందాలను తరలించాలని ఆదేశించారు. ప్రజల ప్రాణాలను, ఆస్తులను కాపాడటంలో ఎలాంటి ఆలస్యం జరగకూడదని, గాలి, వర్ష తీవ్రతను ఎప్పటికప్పుడు అంచనా వేసి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
విశాఖ, ఉమ్మడి ఉభయగోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాలకు భారీ వర్ష సూచన ఉందని అధికారులు నివేదించగా, తుఫాను ప్రభావిత జిల్లాల కలెక్టర్లను పూర్తి స్థాయిలో అప్రమత్తం చేశామని, ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ఏర్పాట్లు సిద్ధంగా ఉన్నాయని సీఎస్ విజయానంద్ ముఖ్యమంత్రికి తెలియజేశారు. మొత్తం మీద, ‘మొంథా’ సవాలును ఎదుర్కోవడానికి ఏపీ ప్రభుత్వ యంత్రాంగం యుద్ధ సన్నద్ధతతో సిద్ధంగా ఉంది.
ప్రకృతి పరీక్షిస్తే, పరిపాలన రక్షణ కోసం ప్రయత్నిస్తోంది. ఇది మామూలు తుఫాను కాదని తెలిసిన ప్రభుత్వానికి, ఇది మామూలు సమయం కాదని తెలిసిన ప్రజలకు – “జాగ్రత్తగా ఉండండి. ప్రభుత్వం మీతో ఉంది” అనే సందేశాన్ని ఇస్తోంది.
రియల్ టైమ్ గవర్నెన్స్ సిస్టమ్ (RTGS) ద్వారా జరిగిన ఈ అత్యవసర సమావేశంలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రులు నారా లోకేష్, వి. అనిత, పి. నారాయణ, సీఎస్ విజయానంద్ సహా అన్ని కీలక శాఖల అధికారులు పాల్గొన్నారు