తుఫాన్ల సమయంలో రేడియో విని, టీవీ చూసి, పేపర్లు చదివేవారికి తరచూ వినిపించే పదం.. ఫలానా కేంద్రంలో తుఫాను హెచ్చరిక చిహ్నం ఎగురవేశారని! అసలు ఏమిటీ హెచ్చరిక చిహ్నం? దానివల్ల లాభమేమిటి? ఎందుకు అలా హెచ్చరిక చిహ్నాలు ఎగురవేస్తారు? ఈ చిహ్నాలు ఎన్ని ఉంటాయన్నది చాలామందికి తెలియదు. అవేమిటో చూద్దాం రండి!
తుఫాను ప్రభావాన్ని సూచిస్తూ హార్బర్లలో హెచ్చరికలు జారీ చేయడం గురించి అందరికీ విదితమే. ఈ హెచ్చరికల గురించిన పూర్తి వివరాలు…
తుఫాను కు సంబంధించి మొత్తం 11 విధాలైన హెచ్చరిక చిహ్నాలుంటాయి.
1వ నెంబరు హెచ్చరిక జారీ చేస్తే.. సముద్రంలో ఒక తుఫాను ఏర్పడే అవకాశం ఉందని తెలియ జేయడం.
2వ నెంబరు జారీ చేస్తే.. సముద్రంలో తుఫాను ఏర్పడిందని హెచ్చరించడం.
3వ నెంబరు… అకస్మాత్తుగా గాలులతో వర్షం కురిసే అవకాశం ఉందని హార్బర్‌లో హెచ్చరికలు జారీచేయడం. హార్బర్‌లో ఉండే పడవలు, నౌకలను సురక్షిత ప్రాంతంలో నిలపాలని ఇది హెచ్చరిస్తుంది.
4వ నెంబరు చిహ్నం ఎగురవేస్తే… హార్బర్, సముద్ర తీర పరిసరాల్లోని గ్రామాలను హెచ్చరించడం. ఇది జాలర్లు, నౌకలు సముద్రంలోని వెళ్లకూడద ని హెచ్చరించడం.
5వ నెంబరు చిహ్నం హార్బర్‌కి కుడి వైపు తుఫాను తీరం దాటుతుందని అర్ధం.
6వ నెంబరు హార్బర్‌కి ఎడమ వైపు తుఫాను తీరం దాటుతుందని అర్ధం.
7వ నెంబరు సూచిక హార్బర్, చుట్టుపక్కల ప్రాంతాలకు ప్రమాద తీవ్రత అధికమని హెచ్చరించడం.
8వ హెచ్చరిక చిహ్నం హార్బర్‌కి కుడివైపు అతి తీవ్ర తుఫాను తీరం దాటవచ్చని అర్ధం.
9వ నెంబరు ఎగురవేస్తే… హార్బర్‌కి ఎడమ వైపు అతి తీవ్ర తుఫాను తీరం దాటవచ్చని అర్ధం.
10వ నెంబరు చిహ్నం ఎగుర వేస్తే… హార్బర్, చుట్టుపక్కల ప్రాంతాలకు ప్రమాదమని హెచ్చరించడం.
11వ నెంబరు జారీచేస్తే… తుఫాను ఘోర విపత్తు సృష్టించే అవకాశం ఉందని అర్ధం.
పగలు, రాత్రి వేళల్లో తుఫాను హెచ్చరికల చిహ్నాలు వేర్వేరుగా ఉంటాయి. నలుపు రంగులో ఉన్న చిహ్నాలు పగలు జారీచేసేవి. ఈ హెచ్చరికలను బట్టి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడం, జాలర్లు చేపల వేటకు వెళ్లకుండా నిలువరించడం, విపత్తు నివారణ బృందాలు సహాయ చర్యలు చేపడతారు.