– చార్ ధామ్ లో కఠిన ఆంక్షలు
కేదార్ నాథ్ – బదరీ నాథ్ ట్రస్ట్ అత్యంత కీలక నిర్ణయం తీసుకున్నాయి. సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లకు ఆలయ ప్రాంగణంలోకి అనుమతించమని ప్రకటించింది. వారికి అనుమతిని నిషేధిస్తున్నట్లు ప్రకటించింది.
ఎవరైనా గుడి ప్రాంగణంలో వీడియోలు తీస్తూ కనిపిస్తే… దర్శనాన్ని అప్పటికప్పుడే రద్దు చేసి, వారిని వెనక్కి పంపిస్తామని తేల్చి చెప్పింది. దీనికి సంబంధించి కేధార్‌నాథ్-బద్రీనాథ్ పండ సమాజ్ ప్రభుత్వంతో చర్చించింది. ప్రభుత్వం కూడా సానుకూలంగా స్పందించింది.
మరోవైపు ఓ మీడియా ఇంటర్వ్యూలో ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ ధామీ దీనిపై స్పందించారు. యాత్రలు అనేవి కేవలం మత పరమైన, ఆధ్యాత్మికంగా మాత్రమే వుండాలన్నారు. తీర్థయాత్రలకు కొన్ని నియమాలు వుంటాయని, అవి మన పూర్వీకులు, రుషుల కాలం నుంచీ వున్నాయన్నారు. ఆలయ పరిసరాల ప్రతిష్ఠను కాపాడటం, వాటిని పరిశుభ్రంగా వుంచడంతో పాటు కొన్ని ఇతర నియమాలు కూడా వున్నాయన్నారు.
చార్ ధామ్ యాత్ర అనేది అన్ని యాత్రల కంటే భిన్నమైందన్నారు. ఇది ధర్మ తీర్థమని అభివర్ణించారు. అందుకే ఇక్కడి నియమాలను కచ్చితంగా పాటించాల్సిందేనని తేల్చి చెప్పారు. మరోవైపు ఉత్తరాఖండ్ లో పాత రీల్స్ తో ప్రజలను ఎలా భయభ్రాంతులకు గురి చేశాయో అందిరికీ తెలుసన్నారు.
కొత్త రీల్స్ లో ఒక్కో సారి పాత వాటిని కూడా యాడ్ చేసి చూపిస్తారని, దీంతో ప్రజల్లో భయం నెలకొంటుందన్నారు. వాటిని నిర్ధరించుకోవడం ప్రజలకు ఇబ్బందిగా మారుతుందన్నారు. చార్ ధామ్ కి వచ్చేవారు ఇది యాత్ర అన్న స్పృహలోనే రావాలన్నారు.
మరికొన్ని రోజుల్లో చార్ ధామ్ యాత్ర మొదలవుతుంది. ఏప్రిల్ 3 అక్షయ తృతీయ సందర్భంగా గంగోత్రి, యమునోత్రి గుడి తలుపులు తెరుకుంటాయి. అప్పటినుంచి చార్ ధామ్ యాత్ర మొదలవుతుంది. మే 2వ తేదీన కేధార్‌నాథ్ గుడి తలుపులు తెరుచుకుంటాయి. అనంతరం మే 4వ తేదీన బద్రీనాథ్ గుడి తలుపులు తెరుచుకుంటాయి.
ఈ నేపథ్యంలోనే పూర్తి స్థాయి చార్ ధామ్ యాత్ర మొదలవుతుంది. యాత్రకు వచ్చే సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ల విషయంలో కేధార్‌నాథ్-బద్రీనాథ్ పండ సమాజ్ కఠినంగా వ్యవహరించాలని భావిస్తోంది.
– విఎస్‌కె తెలంగాణ