రైతు ఆత్మహత్యల్లో రాష్ట్రంలో పులివెందుల నెం1, దేశంలో ఏపీ నెం.2
ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గంలో రైతుల శ్రమను దోచుకుంటున్నారు
– శాసనమండలి సభ్యులు మారెడ్డి రవీంధ్రనాధ్ రెడ్డి (బీటెక్ రవి)
దేశంలో ఎక్కడైనా అరటి కేజీ రూ. 4 కి, టమెటా రూ.1కి, చినీ కేజీ రూ. 15 కి దొరుకుతుందా? ఈ ధరలు దేశంలో ఒక్క పులివెందులలో మాత్రమే ఉన్నాయి. ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గంలో దళారులతో వైసీపీ నేతలు కుమ్మక్కయి రైతులను దారుణంగా దోచుకుంటున్నా.. ముఖ్యమంత్రి పట్టించుకోవటం లేదు. వైసీపీ పాలనలో పంట వేయడానికి ప్రభుత్వం నుంచి ప్రోత్సహం లేక, అప్పు తెచ్చి ఆరుగాలం శ్రమించి పండించిన పంటకు గిట్టుబాటు ధరలు లేక రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
పంట వేయడానికి పెట్టుబడికి అరువు పుట్టక కరువుకు పంటలు సరిగా పండక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. విత్తనం నాటిన రైతు ఆ పంటను విక్రయించే నాటికి ప్రాణాలతో ఉండే పరిస్థితి లేదు. రైతు ఆత్మహత్యల్లో దేశంలో రాష్ర్టం మెదటి స్ధానంలో ఉంటే రాష్ట్రంలో పులివెందుల మొదటి స్ధానంలో ఉంది. పులివెందుల నియోజకవర్గంలో ఆత్మహత్య చేసుకున్న రైతులకు ఎంతమందికి పరిహారం ఇచ్చారు? ఓదార్పు యాత్ర పేరుతో రాష్ట్రమంతా తిరిగిన జగన్ రెడ్డి తన సొంత నియోజకవర్గంలో ఆత్మహత్యలకు పాల్పడ్డ అన్నదాతల కుటుంబాల్ని ఎందుకు పరామర్శించలేదు? ముఖ్యమంత్రికి ప్రతిపక్ష నాయకులని అక్రమ కేసులతో వేధించటంపై ఉన్న శ్రద్ద రైతుల పట్ల లేకపోవటం బాధాకరం.
రాష్ట్రంలో రైతులు అనేక సమస్యలతో అల్లాడుతుంటే దానిపై దృష్టి పెట్టకుండా ముఖ్యమంత్రి, వ్యవసాయశాఖమంత్రి, వైసీపీ నేతలు చంద్రబాబు నాయుడిని విమర్శించటం సిగ్గుచేటు. టీడీపీ 5 ఏళ్ల పాలనలో రైతులకు ఏం చేశామో, వైసీపీ రెండున్నరేళ్ల పాలనలో మీరేం చేశారో బహిరంగ చర్చకు సిద్దమా? జగన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన నాటి నుంచి రాష్ర్టంలో వ్యవసాయం రంగం సంక్షోభంలో పడిన మాట వాస్తవం కాదా? పండించిన పంటకు గిట్టుబాటు ధరలు లేక రైతులు తమ పంటను రోడ్లపై పారబోయటం వైసీపీ నేతల కళ్లకు కన్పించటం లేదా?
రైతులు రాష్ర్టంలో ప్రతి రోజు ఎక్కడో చోట బలవర్మరణాలకు పాల్పడుతుంటే వైసీపీ నేతలకు పట్టదా? టీడీపీ ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పధకాలు రద్దు చేసి రైతులకు ద్రోహం చేయటం వాస్తవం కాదా? వైసీపీ రెండున్నరేళ్ల పాలనలో రైతులను మాటలతో మభ్యపెట్టడం తప్ప వారికేం చేశారో చెప్పగలరా? ఇకనైనా ముఖ్యమంత్రి, వైసీపీ నేతలు చంద్రబాబును విమర్శించటం మాని రైతులకు మేలు చేసే అంశంపై దృష్టి పెట్టాలి.