Suryaa.co.in

Editorial

సుజనా ఎత్తుకు సోము చిత్తు

– 26 నుంచి 21కు మారిన పాదయాత్ర
– సూర్యనారాయణ రాజు నుంచి కామినేనికి ర్యాలీ బాధ్యతలు
– 500 వాహనాలతో సుజనా బలప్రదర్శన
– ఎయిర్‌పోర్టు నుంచి కావలి వరకూ భారీ ర్యాలీ
– పాదయాత్ర తేదీలపైనా బీజేపీలో పోటాపోటీ
– చివరకు నెగ్గిన సుజనాచౌదరి నిర్ణయం
( మార్తి సుబ్రహ్మణ్యం)
ఈ నెల 21న అమరావతి రైతుల పాదయాత్రలో పాల్గొనాలన్న ఏపీ బీజేపీ నాయకత్వం ప్రకటన వెనక పెద్ద కథే నడిచినట్లు సమాచారం. నిజానికి ఈనెల 26న విజయవాడలో జరిగే, పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలోనే పాదయాత్ర తేదీ నిర్ణయించాలని భావించారు. అయితే ఈలోగా కేంద్రమాజీ మంత్రి, ఎంపీ సుజనాచౌదరి రంగంలోకి దిగడంతో, కథ మారి.. ఈనెల 21నే పాదయాత్రలో పాల్గొనక తప్పని, అనివార్య పరిస్థితి ఏర్పడింది. దీనితో సోము-సునీల్ ఎత్తును సుజనా చిత్తుచేసినట్టయింది.
పార్టీ వర్గాల సమాచారం ప్రకారం.. అమిత్‌షా ఆదేశాలతో అమరావతి రైతుల పాదయాత్రకు, బీజేపీ రాష్ట్ర నాయకత్వం మద్దతు ప్రకటించాలని నిర్ణయించింది. ఆ మేరకు ఈనెల 26న జరిగే రాష్ట్ర కార్యవర్గంలో చర్చించి, పాదయాత్రలో పాల్గొనే తేదీని ప్రకటించాలని రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు, కో ఇన్చార్జి సునీల్ దియోధర్ భావించారు. ఈలోగా సుజనా చౌదరి రంగంలోకి దిగడంతో కథ మారింది. ఆయన రాష్ట్ర నాయకత్వంతో సంబంధం లేకుండా.. ఈనెల 21న పాదయాత్రలో పాల్గొనాలని భావించి, ఆ మేరకు సన్నాహక ఏర్పాట్లు ప్రారంభించారు. కృష్ణా, గుంటూరు, ప్రకాశం, బాపట్ల, ఒంగోలు, నెల్లూరు జిల్లాలకు చెందిన బీజేపీ నేతలు, తనకు సన్నిహితులతో కలసి గన్నవరం ఎయిర్‌పోర్టు నుంచి కావలి వరకూ 500 కార్లతో భారీ ర్యాలీగా వెళ్లాలని నిర్ణయించారు.
ఈ విషయం తెలిసిన రాష్ట్ర నాయకత్వం.. సుజనాతో మాట్లాడి, 26న జరిగే కార్యవర్గ సమావేశంలో చర్చించి తేదీని ఖరారు చేద్దామనుకున్న విషయాన్ని ఆయన వద్ద ప్రస్తావించారు. అయితే, అమిత్‌షా ఆదేశాల మేరకు మనం వెంటనే నిర్ణయం తీసుకోవలసి ఉందని, అదీగాక 26 తర్వాతయితే పాదయాత్ర ముగిసే అవకాశం ఉంటుందని, సుజనా కూడా రాష్ట్ర నాయకత్వానికి చెప్పారు. దానితో 26 తర్వాత పాదయాత్రలో పాల్గొనాలని భావించిన రాష్ట్ర నాయకత్వం, సుజనా చెప్పిన 21వ తేదీనే అంగీకరించాల్సిన అనివార్య పరిస్థితి ఏర్పడింది.
అయితే… 21న జరిగే పాదయాత్ర క్రెడిబిలిటీ సుజనా చౌదరికి ఒక్కరికే వెళ్లకుండా, రాష్ట్ర నాయకత్వం కొత్త వ్యూహం పన్నింది. ఆ ప్రకారంగా గన్నవరం ఎయిర్‌పోర్టు వద్ద ర్యాలీ ఏర్పాట్లు చూసేందుకు, సోము వీర్రాజు తనకు సన్నిహితుడైన రాష్ట్ర నేత సూర్యనారాయణరాజును సమన్వయకర్తగా నియమించారు. దానితో ఆయన నెల్లూరు నుంచి నర్సాపురం వరకూ ఉన్న బీజేపీ నేతలకు ఫోన్లు చేసి, పాదయాత్ర కు వాహనాల్లో భారీగా రావాలని కోరారు. ఈ విషయం తెలిసిన సుజనా చౌదరి ర్యాలీ-పాదయాత్ర ఏర్పాట్ల పర్యవేక్షణను మాజీ మంత్రి కామినేని శ్రీనివాసరావుకు అప్పగించారు. గుంటూరు జిల్లాకు పాటిబండ్ల రామకృష్ణ, జయప్రకాష్, గంగాధర్‌ను, కృష్ణా జిల్లాకు చిగురుపాటి కుమారస్వామి తదితరులను ర్యాలీ ఇన్చార్జిలుగా నియమించారు. దీనితో సోము నియమించిన రాజు పర్యవేక్షణ బాధ్యతల నుంచి పక్కకు తప్పుకోవలసి వచ్చింది.
21నాటి పాదయాత్ర ర్యాలీతో.. కోస్తా జిల్లాలోని రైతులు బీజేపీ వైపు ఆకర్షితులు కావాలన్నది సుజనా చౌదరి లక్ష్యంగా కనిపిస్తోంది. అందుకే భారీ కాన్వాయ్‌తో గ్రామాల నుంచి ర్యాలీగా వెళ్లడం ద్వారా.. ‘అమరావతికి బీజేపీ అనుకూలంగా ఉంద’న్న సంకేతం- అభయం ఇవ్వడమే ఈ ర్యాలీ అసలు వ్యూహమని చెబుతున్నారు. ‘అమరావతిపై పిల్లిమొగ్గలు వేసి రైతులలో అభాసుపాలయిన బీజేపీపై నమ్మకం కలిగించాలంటే ఈ ప్రయత్నం తప్పద’ని పార్టీ నేతలు కూడా వ్యాఖ్యానిస్తున్నారు. అయితే.. దాని క్రెడిట్, ర్యాలీ అంతా సుజనా ఒక్కరే కాకుండా, రాష్ట్ర బీజేపీ ఆధ్వర్యంలో జరుగుతుందన్న సంకేతాలిచ్చేందుకు సోము అండ్ కో ఎత్తుపై ఎత్తులు వేసినా, చివరాఖరకు సుజనా స్పీడుతో చిత్తవాల్సి వచ్చింది.

LEAVE A RESPONSE