– ఆశా, అంగన్ వాడీల ఆందోళనల వెనుక రాజకీయ శక్తులు
– మహిళల్ని గుర్రాలతో తొక్కించిన చరిత్ర బాబుదే..
– అంగన్‌వాడీ సెంటర్లలో క్వాలిటీ, క్వాంటిటీ పెంచాం
– టీడీపీ హయాంలో పౌష్టిక ఆహారానికి ఏడాదికి రూ.500కోట్లు ఇస్తే.. మా ప్రభుత్వం రూ.1800 కోట్లు ఖర్చు చేస్తుంది
– రాష్ట్ర స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి శ్రీమతి తానేటి వనిత
రాజమండ్రి : మంత్రి తానేటి వనిత మాట్లాడుతూ.. ఇంకా ఏమన్నారంటే…
మహిళా సాధికారత దిశగా జగన్ పాలన
– ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బాధ్యతలు చేపట్టినప్పటి నుంచీ ఆయన మహిళా పక్షపాతిగా, మహిళా సాధికారత దిశగా పరిపాలన కొనసాగిస్తున్నారు. మహిళల సంక్షేమం, అభివృద్ధి కోసం అహర్నిశలూ ఆయన కృషి చేస్తున్నారు. అన్నింటా మహిళలకే పెద్ద పీట వేస్తూ, ప్రతి పథకాన్నీ మహిళల చేతికే అందిస్తున్నారు. మహిళలకు ఆర్థిక, రాజకీయ స్వాతంత్ర్యం కల్పించడం ద్వారా ఒక అన్నలా జగన్ గారు అండగా నిలుస్తున్నారు.
ఈ ప్రభుత్వం మహిళా పక్షపాత ప్రభుత్వమే కాకుండా, బడుగు, బలహీనవర్గాల ప్రభుత్వం. సమాజంలో అణగారిన వర్గాలకు వారి జీవితాల్లో మార్పు తెచ్చేందుకు, ఎంతో కృతనిశ్చయంతో పాలన సాగిస్తున్నారు. పాదయాత్ర సమయంలో ఇచ్చిన హామీలతో పాటు, ఇవ్వని హామీలను కూడా వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చాక నెరవేర్చారు. మహిళల అభ్యున్నతి, అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి జగన్ తీసుకున్న అనేక నిర్ణయాలు మహిళల జీవితాల్లో వెలుగులు నింపుతున్నాయి.
పాదయాత్ర సమయంలో అంగన్‌వాడీ సిబ్బంది, ఆయాలు, ఆశా వర్కర్స్ తమ సమస్యలను ప్రతిపక్షనేతగా ఉన్న జగనన్నకు చెప్పుకున్నారు. వైయస్సార్ సీపీ ప్రభుత్వం వచ్చాక మీ కష్టాలు తీరుస్తాం, అందరికీ మంచి చేస్తామని జగన్‌గారు హామీ ఇచ్చినట్లుగానే ఈరోజు పరిపాలన చేస్తున్నారు.
2019 ఎన్నికలు జరిగే ఆరు నెలల ముందు వరకూ కూడా ఆశా వర్కర్లకు నెలకు రూ. 3 వేలు మాత్రమే టీడీపీ హయాంలో ఇచ్చేవారు. అలాంటిది, మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లోనే వారి జీతం నెలకు రూ. 10వేలకు పెంచడం జరిగింది.
నాలుగున్నరేళ్ళు టీడీపీ పట్టించుకోలేదు.. మేం రాగానే జీతాలు పెంచాం
– అంగన్‌వాడీ వర్కర్స్‌కు కూడా ఎన్నికల ముందు వరకూ టీడీపీ హయాంలో రూ. 7వేలు జీతం తీసుకుంటే…. మా ప్రభుత్వం వచ్చాక రూ.11,500 డ్రా చేస్తున్నారు.అంగన్ వాడీ హెల్పర్స్‌కు గతంలో రూ. 4,500 జీతాలు మాత్రమే ఉంటే, ఇవాళ వారికి రూ.7000 వరకూ పెంచాం. 2014లో అధికారంలో ఉన్న టీడీపీ ప్రభుత్వం ఆశా వర్కర్లు, అంగన్‌వాడీ సిబ్బంది బాగోగుల గురించి ఏనాడూ పట్టించుకోలేదు.
పాదయాత్ర సమయంలో జగనన్న ఇచ్చిన హామీతో … టీడీపీ ఓట్ల రాజకీయం కోసం, వీరికి ఎన్నికల ముందు అరాకొరా పెంచింది. ఆశా వర్కర్లు, అంగన్ వాడీలపై అధికారంలో ఉన్న నాలుగున్నరేళ్ళపాటు ఏమాత్రం ప్రేమ చూపని టీడీపీ, ఇవాళ మేమే అంతా చేశామని చెప్పుకోవడం సరికాదు. మా ప్రభుత్వం అధికారంలోకి రాగానే స్త్రీ, శిశు సంక్షేమ శాఖలో పనిచేస్తున్న ఉద్యోగుస్తులకు అన్ని స్థాయిలవారికి పదోన్నతలు ఇచ్చాం. ఎక్కడా అవినీతికి తావులేకుండా వారిందరికీ పారదర్శకంగా పెద్ద ఎత్తున ప్రమోషన్లు ఇచ్చాం. ప్రభుత్వం తరపున వాళ్లందరికీ మంచి చేయాలనే విధంగా పదోన్నతలకు పరీక్షలు కూడా నిర్వహించడం జరుగుతోంది.
అంగన్ వాడీ కేంద్రాల్లో క్వాలిటీ, క్వాంటిటీ పెంచాం..
– గ్రేడ్-2 సూపరవైజర్‌గా ప్రమోట్ అవ్వడానికి వయోపరిమితి 45 సంవత్సరాలుగా నిర్ణయించాం. అయితే అంగన్‌వాడీ వర్కర్స్ విజ్ఞప్తితో ఏజ్ లిమిట్‌ను 50 ఏళ్లకు పెంచడం జరిగింది. అంగన్‌వాడీ సెంటర్లలో క్వాలిటీ, క్వాంటిటీ పెంచి అర్హులకు అందచేస్తున్నాం. కరోనా సమయంలో ఇంటికే రేషన్ పంపించాం. గత టీడీపీ హయాంలో పౌష్టిక ఆహారానికి సంవత్సరానికి రూ.500కోట్లు మాత్రమే నిధులు కేటాయించింది. వైయస్సార్ సీపీ ప్రభుత్వం ఏడాదికి రూ.1800 కోట్లు కేటాయించడం చూస్తే ఎంత క్వాలిటీ, క్వాంటిటీ పెంచామనేది ప్రజలకు, లబ్ధిదారులకు అర్థం అవుతుంది.
అంగన్‌వాడీ సెంటర్లలో ప్రీస్కూల్ లో ఉన్న పిల్లలకు ప్రీ-1, ప్రీ-2 పెట్టాలన్న నిర్ణయంతో.. అక్కడ పనిచేస్తున్నవారి పనితీరు మెరుగు పరిచేలా శిక్షణ ఇస్తున్నాం. అంగన్‌వాడీ టీచర్లు, ఆయాలు తమకు ఏం కావాలన్నది చెప్పే స్వేచ్ఛ, స్వాతంత్రాన్ని ఇచ్చాం. వారు అడిగిన వెంటనే స్పందిస్తు వాళ్ల అవసరాల్ని తీరుస్తున్నాం.
ఆశా, అంగన్ వాడీల ఉద్యమాల వెనుక రాజకీయ శక్తులు
– అలాంటి వాళ్లు, ఇవాళ ధర్నాలు చేసే పరిస్థితికి వచ్చారంటే వాళ్లంతట వాళ్లు చేస్తున్నది కాదు. వారి వెనుక కొంతమంది రాజకీయ శక్తులు కావొచ్చు,ప్రతిపక్ష నేతలైనా కావొచ్చు, పసుపు, ఎర్రచొక్కాలు వేసుకున్నవాళ్లు అయినా ఉండవచ్చు. ప్రభుత్వ పరిపాలనను తప్పుపట్టాలనే ఉద్దేశంతో, ప్రభుత్వానికి వచ్చే మైలేజ్‌ని ఏదోరకంగా స్పాయిల్ చేయాలన్న దుర్భుద్ధితోనే అంగన్‌వాడీ వర్కర్లను రోడ్డుమీదకు తెచ్చారు. మా ప్రభుత్వం మహిళలకు ఎప్పుడూ మంచే చేస్తుంది. మహిళల పేరుతో ఇస్తున్న సంక్షేమ పథకాల ద్వారా, వాళ్లు సాధికారత సాధిస్తున్నది మా ప్రభుత్వ హయాంలోనే. వాళ్లకు ఏకష్టం వచ్చినా వారి తరపున పోరాడటానికి, అండగా ఉండేందుకు దిశ యాప్‌ను తీసుకువచ్చి తక్షణమే స్పందిస్తున్నాం.
అంగన్ వాడీలకు పని ఒత్తిడి తగ్గించాం
– గత ప్రభుత్వం అన్ని పనులకు అంగన్‌వాడీ టీచర్లను ఉపయోగించుకునేవాళ్లు. సర్వే చేయాలన్నా, జనాభా లెక్కలు రాయాలన్నా, ఎన్నికల డ్యూటీకి వెళ్లాలన్నా ఆ బాధ్యతను అంగన్‌వాడీ టీచర్లకు అప్పగించేవాళ్లు. ఇవాళ ఆ పరిస్థితిలేదు. వాలంటీర్ వ్యవస్థ ఉండటంతో, వాళ్లే ప్రతి ఇంటికి వెళ్లి ప్రతి పథకాన్ని ఆన్‌లైన్ చేస్తున్నారు. అంగన్‌వాడీ సెంటర్లలో చేయాల్సిన విధులను మాత్రమే వారితో చేయిస్తూ.. వారికి శ్రమను, పని ఒత్తిడిని తగ్గించాం.
– అంగన్‌వాడీ టీచర్లు చేస్తున్న ప్రతీ పనీ డిపార్ట్ మెంట్‌కు తెలిసేలా స్మార్ట్‌ఫోన్‌లో అనుసంధానం చేయడం జరిగింది. వాటిలో కొన్నిఫోన్లు రిపేర్ వచ్చాయని మా దృష్టికి వస్తే… కొత్త స్మార్ట్ ఫోన్లను కూడా టెండర్లను పిలిచాం. సంతోషంగా వాళ్లు విధులు నిర్వహించుకునేలా చేస్తున్నాం. వారి డిమాండ్లను కూడా మేము పరిగణనలోకి తీసుకుంటాం.
మహిళల్ని గుర్రాలతో తొక్కించిన చరిత్ర బాబుదే..
– ఉమ్మడి రాష్ట్రంలో అంగన్‌వాడీ టీచర్లు హైదరాబాద్‌లో ధర్నా నిర్వహిస్తే… అప్పుడు వారిపట్ల చంద్రబాబు నాయుడు ఏవిధంగా ప్రవర్తించారో, మహిళలని చూడకుండా గుర్రాలతో తొక్కించి, వాటర్ క్యాన్ లతో వారిని చిత్రహింసలు పెట్టిన చరిత్ర ఎవరిదో ఎవరూ మరిచిపోలేదు. ఇలాంటి చర్యలకే ప్రజలు టీడీపీని ప్రతిపక్షంలో కూర్చోపెట్టారు.
కొన్ని పార్టీల రాజకీయ ఉనికి కోసం, మరికొందరి రాజకీయ లబ్ధి కోసం మీడియా ముందుకు వచ్చి ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తిని నోటికి వచ్చినట్లు దూషించడం సరికాదు. మీమీ స్థాయిని బట్టి మాట్లాడితే బాగుంటుందని హితవు పలుకుతున్నాం.
అంగన్‌వాడీ టీచర్లకు అన్యాయం జరిగిందని వారిని రోడ్డు మీదకు తెచ్చి, ఆందోళనల పేరుతో రాజకీయం చేస్తున్నది కూడా ఎర్ర, పచ్చ పార్టీలే. ఇంత మంచి చేస్తున్న ప్రభుత్వంపై కావాలని నిందలు వేస్తూ.. ఈ ప్రభుత్వంపై దుష్ప్రచారం చేయడం వల్ల ప్రభుత్వం మీద వ్యతిరేకత వచ్చి, రాబోయే రోజుల్లో వాళ్ల నాయకుడిని గద్దెనెక్కించాలన్న దుర్భుద్దితో చేస్తున్నవే ఇవన్నీ అని ప్రజలకు అర్థమవుతుంది.
వీరికి అంగన్‌వాడీ కార్యకర్తల మీద ఎటువంటి ప్రేమగానీ, బాధ్యతగానీ లేదు. ఈ విషయాన్ని అంగన్‌వాడీ కార్యకర్తలు గుర్తెరగాలి. ఏదైనా సమస్య ఉంటే ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరిస్తాం.