– బీజేపీ అడిగితే మద్దతు ఇవ్వండి
– లేకపోతే న్యూట్రల్‌గా ఉండండి
– ఇతర పార్టీలకు మద్దతు వద్దు
– స్థానిక సంస్థల్లో బలం ఉన్న చోట పోటీ చేద్దాం
– ముందు స్థానికంగా బలపడండి
– బలం ఉన్న వారికే అధ్యక్ష పదవి
– తెలంగాణ టీడీపీ నేతలతో టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు రెండు గంటలు భేటీ
– తెలంగాణకు అధ్యక్షుడిని నియమించాల్సిందేనన్న తమ్ముళ్లు
– మాలో ఎవరికి ఇచ్చినా అభ్యంతరం లేదని స్పష్టీకరణ
– అధ్యక్షుడిని చూసే కదా పనిచేస్తామన్న తమ్ముళ్లు
– దానిపై మరోసారి చర్చిద్దామన్న చంద్రబాబు
– మళ్లీ అందరితో భేటీ కావాలని తమ్ముళ్ల అభ్యర్ధన
– అంగీకరించిన పార్టీ అధినేత చంద్రబాబునాయుడు
( మార్తి సుబ్రహ్మణ్యం)
హైదరాబాద్ జిల్లా జూబ్లిహిల్స్ నియోజకవర్గ ఉప ఎన్నికకు దూరంగా ఉండాలని టీడీపీ నిర్ణయించింది. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బలం చోట పోటీ చేయాలని, ఆమేరకు బలం ఉన్న ప్రాంతాలను ఎంపిక చేసుకోవాలని నాయకత్వం నిర్ణయించింది. అదే సమయంలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీజేపీ మద్దతు కోరితే ఆ పార్టీ అభ్యర్ధినే బలపరచాలని, లేకపోతే తటస్థంగా ఉండాలే తప్ప ఇతర పార్టీలకు ఏ రూపంలోనూ మద్దతు ఇవ్వవద్దని పార్టీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబునాయుడు స్పష్టం చేశారు.
తెలంగాణ టీడీపీ నాయకులతో పార్టీ అధినేత, సీఎం చంద్రబాబునాయుడు తన నివాసంలో దాదాపు 2 గంటలు సుదీర్ఘంగా చర్చించారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. రానున్న జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నిక, స్థానిక సంస్థల్లో పోటీ, తెలంగాణ పార్టీ అధ్యక్ష-కమిటీపై చర్చ జరిగింది. దీనికి సంబంధించి చంద్రబాబు పార్టీ సీనియర్లతో చర్చించారు.
ఈ సందర్భంగా ఆయన ‘మనం జాతీయ స్థాయిలో ఎన్డీఏ కూటమిలో ఉన్నందున, పొత్తు ధర్మం ప్రకారం మనం పోటీ చేయడం లేదు కాబట్టి, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీజేపీకే మద్దతునివ్వాలి. ఒకవేళ ఆ పార్టీ తెలంగాణ నాయకత్వం మన మద్దతు కోరకపోతే న్యూట్రల్‌గా ఉండాలే తప్ప, ఇతర పార్టీలకు ఏ రూపంలోనూ మద్దతునివ్వవద్దు. స్థానిక సంస్థల్లో మనకు ఎక్కడ బలం ఉందో గుర్తించండి. ఆ వివరాలివ్వండి. దానిపై చర్చించి నిర్ణయిద్దాం’’ అని వ్యాఖ్యానించారు.
కాగా పార్టీ నాయకులు తెలంగాణకు అధ్యక్షుడిని నియమించాలని, దానితోపాటు కమిటీని కూడా ఏర్పాటుచేయాలని కోరారు. తమలో అధ్యక్ష పదవి ఎవరికి ఇచ్చినా అభ్యంతరం లేదన్నారు. ‘‘ పార్టీ అధ్యక్షుడి చూసే కదా ఎవరైనా పనిచేయగలరు. ఇక్కడున్న వాళ్లలో అంతా సమర్ధులమే. మా పనితీరు ఏమిటన్నది మీకు తెలుసు. ఆ ప్రకారం అధ్యక్షుడిని నియమించండి. అలాగే కమిటీలు ఏర్పాటుచేస్తే నాయకులు కూడా ఉత్సాహంగా పనిచేస్తారు. తెలంగాణలో క్యాడర్ ఇప్పటికీ బలంగా ఉంది’’ అని బాబు దృష్టికి తీసుకువెళ్లారు.
దానికి స్పందించిన బాబు.. ముందుమీరు సంస్థాగతంగా బలపడండి. అన్ని రంగాల్లో సమర్థుడైన నేతనే అధ్యక్షుడిగా నియమిద్దాం. దానిపై మరోసారి చర్చిద్దామని స్పష్టం చేశారు.
కాగా ఈ సమావేశానికి అందరినీ ఆహ్వానించని నేపథ్యంలో.. ఈసారి అందరితో ఒక సమావేశం ఏర్పాటుచేయాలన్న తెలంగాణ నేతల సూచనను, చంద్రబాబునాయుడు అంగీకరించారు.
సమావేశంలో పార్టీ పార్టీ రాష్ట్ర ఇన్చార్జి, మాజీ ఎంపి కంభంపాటి మోహన్‌రావు, రాష్ట్ర మాజీ అధ్యక్షుడు బక్కని నర్శింహులు, సీనియర్ నాయకుడు ఎం. అరవిందకుమార్‌గౌడ్, నందమూరి సుహాసిని, టిటిడి బోర్డు సభ్యుడు నర్శిరెడ్డి, అశోక్‌గౌడ్, తిరునగరి జోత్స్న, కూరపాటి వెంకటేశ్వరరావు, బంటి వెంకటేశ్వర్లు, కృష్ణమాచారి, రామచందర్‌రావు, రామనాధం, హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు.
అందరికీ అందని ఆహ్వానం
కాగా చాలాకాలం తర్వాత పార్టీ అధినేత, సీఎం చంద్రబాబునాయుడుతో భేటీ జరుగుతుండటంతో తెలంగాణ టీడీపీ సీనియర్లు ఉత్సాహంతో కనిపించారు. అమరావతిలో జరిగే ఈ భేటీకి తమకూ ఆహ్వానం ఉంటుందని ఆశించారు. సహజంగా ఇలాంటి సమావేశాలకు పార్టీ పొలిట్‌బ్యూరో, రాష్ట్ర కమిటీ, పార్లమెంటు నియోజకవర్గ అధ్యక్షులను ఆహ్వానిస్తుంటారు. ఈసారి కూడా అలాగే పిలుపు ఉంటుందని ఆశించారు.
కానీ సమావేశానికి కొందరినే ఎంపికచేసి పిలవడంపై సీనియర్లు అసంతృప్తి వ్యక్తం చేశారు. సమావేశంలో పాల్గొన్న ఇద్దరు పార్లమెంటు నియోజకవర్గ అధ్యక్షులు ‘సార్ ఇంకా చాలామందిని పిలవలేదు. కొందరినే పిలవడంతో వాళ్లంతా నారాజ్‌గా ఉన్నారు. ఈసారి జరిగే సమావేశానికి అందరినీ పిలిస్తే బాగుంటుంద’ని సూచించారు. దానికి చంద్రబాబునాయుడు అంగీకరించారు. దానితోపాటు ‘‘ఈరోజు జరిగిన సమావేశం వివరాలు వారికీ చెప్పండి. టెక్నికల్ ప్రాబ్లెమ్ వల్ల అందరినీ కలవలేకపోయాం’’ అని వారికి సూచించారు.
మాపై ఆ ఇద్దరి పెత్తనమేంటి?
తెలంగాణ పార్టీ కమిటీలు రద్దయినప్పటికీ మాజీ అధ్యక్షుడు బక్కని నర్శింహులు, టిటిడి సభ్యుడు నర్శిరెడ్డి ఒకవర్గంగా ఏర్పడి సొంత పెత్తనం చేస్తున్నారన్న విమర్శలు పార్టీ సీనియర్ల నుంచి వినిపిస్తున్నాయి. ‘‘ అసలు బక్కనికి ఏం అధికారం ఉందని పార్టీపై పెత్తనం చేస్తున్నారో అర్ధం కావడం లేదు. ఆయన తనకు లేని అధికారాన్ని తెచ్చుకుని, పార్టీ నాయకత్వాన్ని తప్పుదోవపట్టిస్తున్నారు. నర్శిరెడ్డి ఆయనకు సహకరిస్తున్నారు. ఈరోజు జరిగిన సమావేశానికి ఎవరిని పిలవాలన్న జాబితాను బక్కని ఇచ్చారని చెబుతున్నారు. మరి పార్లమెంటు నియోజకవర్గ అద్యక్షులందరినీ ఎందుకు పిలవలేదు? ఆయనకు వంతపాడే వారినే ఎందుకు పిలిచారు? ఉపాధ్యక్షులు, పార్లమెంటు నియోజకవర్గ అధ్యక్షులలో కొందరిని పిలిచి, కొందరిని పిలవకపోవడం ఏమిటి? అసలు కమిటీనే రద్దయిన తర్వాత ఏ ప్రాతిపదికన బక్కని జాబితా పంపిస్తారు’’ అని సీనియర్లు ప్రశ్నించారు.
కాగా టీటీడీ సభ్యుడు నర్శిరెడ్డి తమ ఫోన్లకు అందుబాటులో ఉండటం లేదని, తెలంగాణ పార్టీ నుంచి టీటీడీ సభ్యుడిగా అవకాశం ఇస్తే, ఆయన లెటర్లు ఎవరికి ఇస్తున్నారో తమకు అర్ధం కావడం లేదని సీనియర్ నాయకులు వాపోయారు. ‘ మాకు టీటీడీ లెటర్లు కావాలంటే అమరావతి వెళ్లి ఎవరినో ఒకరిని పట్టుకుని తీసుకోవలసి వస్తోంది. నర్శిరెడ్డి ఫోన్ తీయరు. ఒకవేళ తీసినా నా కోటా అయిపోయిందని చెబుతారు. అందువల్ల ఆయన కోటా లెటర్లను, పార్టీ ఆఫీసుకు స్వాధీనం చేస్తే పార్టీకి ఉపయోగం. గతంలో ఎన్టీఆర్, చంద్రబాబునాయుడు కూడా గ్యాస్, టెలిఫోన్ కనెక్షన్లను ఎంపిల నుంచి అలాగే ఇప్పించేవారని’’ ఓ సీనియర్ నాయకుడు గుర్తు చేశారు.
కాగా, అసలు చంద్రబాబునాయుడు తెలంగాణ టీడీపీ నేత లందరినీ కాకుండా, ఐదారుగురు ముఖ్యనేతలను మాత్రమే పిలవాలని సూచించినట్లు పార్టీ వర్గాల సమాచారం.