– రాజ్యాంగంపై ఐడియాలజీ దాడి
(నవీన్)
అక్టోబర్ 6 సోమవారం. సుప్రీంకోర్టు హాలు. ప్రధాన న్యాయమూర్తి భూషణ్ రామకృష్ణ గావై పై దాడి ప్రయత్నం జరిగింది. సీనియర్ న్యాయవాది రాకేష్ కిషోర్ ఈ పని చేశాడు. విచారణ జరుగుతున్నప్పుడు బూటు విసిరేందుకు ప్రయత్నించాడు. భద్రతా సిబ్బంది అతడిని ఆపారు. న్యాయమూర్తికి ఏ హానీ జరగలేదు. ఇది కోర్టు చరిత్రలో ఒక పెద్ద మచ్చ.
న్యాయవ్యవస్థ గౌరవానికి ఇది పెద్ద సవాలు. దాడి సమయంలో కిషోర్ బిగ్గరగా అరిచాడు. “సనాతన్ కా అప్మాన్ నహీ సహేగా హిందుస్తాన్” అని నినాదం చేశాడు. అంటే, “సనాతన ధర్మానికి అవమానం సహించం” అని అర్థం.
ఈ నినాదం చర్యకు మతపరమైన, రాజకీయ ప్రేరణను స్పష్టం చేసింది. ఈ చర్య న్యాయపరమైన వివాదం కాదు. భావజాల ప్రదర్శన అని విశ్లేషణ. దాడికి మూలం ఖజురహో విష్ణుమూర్తి విగ్రహం కేసు. ఆ పిటిషన్‌ను కొట్టివేసేటప్పుడు ప్రధాన న్యాయమూర్తి గావై కొన్ని వ్యాఖ్యలు చేశారు. “విష్ణుమూర్తికి గట్టి భక్తుడినని అంటున్నారు. వెళ్లి దేవుడినే ఏదైనా చేయమని అడగండి” అన్నారు.
ఇది పురావస్తు శాఖ పరిధి అని కోర్టు చెప్పింది. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో విమర్శలకు దారి తీశాయి. మత మనోభావాలను దెబ్బతీశారని నిందించారు. రెండు రోజుల తర్వాత ప్రధాన న్యాయమూర్తి వివరణ ఇచ్చారు. తాను అన్ని మతాలను గౌరవిస్తానని చెప్పారు. ఈ వివాదం సోషల్ మీడియా వల్లనే తలెత్తిందన్నారు..
ఈ చట్టపరమైన వివేకాన్ని భావజాల వ్యవస్థ ‘అవమానం’గా మార్చింది. రాకేష్ కిషోర్ 71 ఏళ్ల సీనియర్ న్యాయవాది. ఆయన 2009 లో ఢిల్లీ బార్ కౌన్సిల్లో చేరాడు . సుప్రీం కోర్ట్ బార్ అసోసియేషన్ సభ్యుడు. దాడి తర్వాత కిషోర్ పశ్చాత్తాపం చూపలేదు. తాను “దైవశక్తి మార్గదర్శకత్వంలో” చేశానన్నాడు. బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా వెంటనే అతని లైసెన్స్‌ను సస్పెండ్ చేసింది.
అయితే, ప్రధాన న్యాయమూర్తి గావై వ్యక్తిగతంగా ఫిర్యాదు చేయలేదు. న్యాయస్థానం సిబ్బందితో (ఇగ్నోర్) “విస్మరించండి” అని అన్నారు. దీంతో ఢిల్లీ పోలీసులు మూడు గంటల విచారణ తర్వాత కిషోర్‌ను విడుదల చేశారు. కేసు నమోదు చేయలేదు. అత్యున్నత న్యాయాధికారిపై జరిగిన దాడి ప్రయత్నాన్ని శిక్షించకపోవడం ప్రమాదకర సంకేతం.
ఈ దాడి వెనుక కుల, మత వైరుధ్యాలు లోతుగా ఉన్నాయి. ప్రధాన న్యాయమూర్తి బి.ఆర్. గావై దళిత న్యాయమూర్తి. ఈ పదవి చేపట్టిన రెండవ దళితుడు ఆయన. దాడి చేసిన న్యాయవాది ఆధిపత్య కులానికి చెందినవారు. బూటు / చెప్పులు విసిరే ప్రయత్నం, వాటిని మెడలో వేయడం, వాటితో కొట్టడం మొదలైనవి కుల-ఆధారిత హింసలో తరచుగా కనబడే అవమానకర చర్య. ఈ అమానవీయ చర్య ఉత్తర భారత దేశంలో, దక్షిణ భారత దేశంలో ఇప్పటికీ వుంది
సనాతన ధర్మం పేరుతో , రాజ్యాంగ అధికారం ఉన్న దళిత న్యాయమూర్తిపై దాడికి ప్రయత్నించడం, రాజ్యాంగ సమానత్వంపై సాంప్రదాయ మత, కుల అధికారం తిరుగుబాటు. ఈ చర్య భారతీయ సమాజ వివక్షతను మరోసారి బయట పెట్టింది. ఖజురహో వ్యాఖ్యలు తక్షణ ప్రేరణ. దళిత మేధావి ప్రధాన న్యాయమూర్తిగా ఉండటం మధ్యస్థ కారణం.
న్యాయవ్యవస్థపై నిరంతర అనేక రూపాల్లో ఒత్తిడి ఉంది. రాజకీయ నాయకులు న్యాయవ్యవస్థ జోక్యాన్ని ప్రశ్నించారు . ఉదాహరణకు, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ పై కోర్టు విమర్శలు న్యాయవ్యవస్థను ప్రభావితం చేస్తున్నాయని అదనపు సొలిసిటర్ జనరల్ హెచ్చరించారు.
భావజాల వ్యవస్థ సామూహిక ఆగ్రహం, ప్రజా హింసకు చట్టబద్ధత ఇస్తోంది. రాకేష్ కిషోర్ వంటి చర్యలు భావజాల తీవ్రతను సూచిస్తాయి. ఇది సంస్థాగత పతనం చివరి ప్రమాదకర దశ.
సంఘ్ పరివార్ హిందూత్వ భావజాలాన్ని ప్రోత్సహిస్తుంది . ఇది సమాజం అన్ని రంగాల్లో ప్రభావం పెంచుతోంది. భావజాల తీవ్రత వృత్తిపరమైన నిబద్ధతను అధిగమించింది. న్యాయవ్యవస్థ సంస్థాగత సమగ్రతకు జీరో టాలరెన్స్ విధానం చాలా ముఖ్యం. ఈ చర్య అసాధారణం . అయినా, దీనికి దారితీసిన భావజాల కారణం వ్యవస్థలో పాతుకుపోయింది. అయితే శిక్ష లేకపోవడమన్నది ప్రమాదకర సందేశం ఇస్తుంది.
– రచయిత సీనియర్ జర్నలిస్టు