Suryaa.co.in

Andhra Pradesh

స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థులు తమ సత్తా చాటారు

– టీడీపీ ఎమ్మేల్యేలు నిమ్మల రామానాయుడు, డోలా బాలవీరాంజనేయస్వామి, ఆదిరెడ్డి భవానీ
స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థులు తమ సత్తా చాటారని టీడీపీ ఎమ్మేల్యే నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో జూమ్ యాప్ ద్వారా ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో విలేకరులతో మాట్లాడారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే …
జడ్పిటిసి, ఎంపిటిసి ఉపఎన్నికల్లో అధికార పార్టీ అరాచకాలు సృష్టించింది. టిడిపి అభ్యర్థులు గెలిచిన చోట్లు రీకౌంటింగ్ లో ఫలితాలను తారుమారు చేశారు. రాష్ట్రంలో అధికార పార్టీ అరాచకం, తప్పుడు కేసులు, వేధింపుల నడుమ కనీసం అభ్యర్థులను నామినేషన్లు కూడా వేయనీవని ప్రతికూల పరిస్థితుల్లో కొనసాగిన జడ్ పిటిసి, ఎంపిటిసి ఉపఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు అనూహ్య విజయాలను సాధించారు. రాష్ట్రవ్యాప్తంగా 10 జడ్పిటిసి స్థానాలకు ఉపఎన్నికలు జరగ్గా, తెలుగుదేశం 8, ఒక చోట అనుబంధ అభ్యర్థులు పోటీచేశారు. తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు పోటీచేసిన 8స్థానాల్లో మూడు చోట్ల ఘన విజయం సాధించారు. కృష్ణాజిల్లాలో ఎమ్మెల్యే జోగి రమేష్ ప్రాతినిధ్యం వహిస్తున్న పెడన అసెంబ్లీ నియోజకవర్గంలోని పెడన మండలంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అర్జా నరేష్ 644 ఓట్ల తేడాతో ఘన విజయం సాధించారు.
శ్రీకాకుళం జిల్లా పాతపట్నం జిల్లా అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని హీర మండలం జడ్పిటిసి స్థానంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పొగిరి బుచ్చిబాబు…ఎమ్మెల్యే రెడ్డి శాంతి కుమారుడు శ్రవణ్ పై 59 ఓట్ల తేడాతో జయకేతనం ఎగురవేశారు. గుంటూరు జిల్లా వినుకొండ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో శావల్యాపురం జడ్పీటిసి స్థానంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పారా హైమావతి 1034 ఓట్ల తేడాతో ఘన విజయం సాధించారు. మంత్రి బొత్స సత్యనారాయణ ప్రాతినిధ్యం వహిస్తున్న విజయనగరం జిల్లా చీపురుపల్లి అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని గుర్ల మండలం నాగళ్లవలస ఎంపిటిసి స్థానంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఘన విజయం సాధించారు.
123 ఎంపిటిసి స్థానాలకు ఎన్నికలు జరగ్గా, 103 స్థానాల్లో తెలుగుదేశంపార్టీ, 11చోట్ల అనుబంధ అభ్యర్థులు కలిపి మొత్తం 114స్థానాల్లో పోటీచేయగా, 33స్థానాల్లో టిడిపి, 8చోట్ల అనుబంధ అభ్యర్థులు కలిపి మొత్తం 41చోట్ల విజయం సాధించారు. అనంతపురం పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో 7 ఎంపిటిసి స్థానాలకు ఎన్నికలు జరగ్గా, ఆరుచోట్ల తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు ఘన విజయం సాధించడం రాష్ట్రంలో వస్తున్న మార్పునకు సంకేతం. ఎంపిటిసి, జడ్పిటిసి ఎన్నికల కౌంటింగ్ లోనూ వైసిపి ప్రభుత్వ అరాచకాలు కొనసాగుతున్నాయి.
అనంతపురం జిల్లా జూటూరులో టిడిపి అభ్యర్థి నాగేశ్వరరెడ్డి కౌంటింగ్ లో తొలుత 4ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు, వైసిపి అభ్యర్థులు రీకౌంటింగ్ చేయించినప్పటికీ 4ఓట్ల మెజారిటీ ఉంది, అయినప్పటికీ మూడోసారి కౌంటింగ్ నిర్వహించి ఒకఓటుతో వైసిపి అభ్యర్థి గెలిచినట్లు అధికారులు ప్రకటించారు. దీనిని ప్రజాస్వామ్యం అంటారా? పాతపట్నం నియోజకవర్గం హీర మండలం జడ్ పిటిసి ఎన్నికల్లో 59ఓట్లతో టిడిపి అభ్యర్థి గెలవగా, అధికారిక ప్రకటన తర్వాత మళ్లీ రీకౌంటింగ్ కు అనుమతి ఇవ్వడాన్ని పరిశీలిస్తే ఎన్నికల ప్రక్రియలో అధికారులు ఏవిధంగా వ్యవహరిస్తున్నారో స్పష్టమవుతోందని టీడీపీ ఎమ్మేల్యేల నిమ్మల రామానాయుడు వివరించారు.
ఎమ్మెల్యే డోలా బాలవీరాంజనేయస్వామి:
తెలుగుదేశం పార్టీ తప్పక అధికారంలోకి వస్తుంది. ముఖ్యమంత్రి సొంత బంధువు జిల్లా మంత్రిగా ఉన్నారు. ఆయన ఆధ్వర్యంలో జరిగిన దర్శి ఎన్నికల్లో ముగ్గురు మంత్రులు, జిల్లా పార్టీ అధికార యంత్రాంగం మొత్తం ఎన్నికలు చేశారు. ఎమ్మెల్యే.. ఎన్నికల కోడ్ ను కూడా ఉల్లంగించారు. చివరకు టీడీపీకే విజయం వరించిది. ఆడపడచుల మద్దతు మాకుందంటున్న వారు, వారి ఆశీర్వాదాలు వైసీపీకి ఉన్నాయంటున్నప్పుడు ఇన్ని జడ్పీటీసీ, ఎంపిటీసీలు టీడీపీకి ఎలా వచ్చాయి. దీన్ని బట్టి ఆడపడచుల మద్దతు టీడీపీకే ఉందని స్పష్టమవుతోంది. తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని లక్ష కోట్లు దోచుకున్నవిషయాన్ని జనం మరచిపోరు. ప్రజల్లో మార్పు మొదలైంది. 7 నెల్లోనే 15 శాతం ఓటు బ్యాంకు పెరిగింది. ఈ విషయాన్ని వైసీపీ నాయకులు గ్రహించలేకపోతున్నారు. కుప్పంలో కూడా ఈరోజు ఎంపీటీసులు గెలుపు సాధించారు. గెలుపు ఓటములు సహజం. ఇందిరాగాంధీ లాంటివారికే ఓటమి తప్పలేదనే విషయాన్ని వైసీపీ నాయకులు గ్రహించాలని తాత్కాలికంగా తాత్కాలిక అనంద పడొద్దని ఎమ్మెల్యే డోలా బాలవీరాంజనేయస్వామి సూచించారు. కాగా ఈ కార్యక్రమంలో రాజమండ్రి ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ కూడా పాల్గొన్నారు.

LEAVE A RESPONSE